అతడొక సర్‌ప్రైజ్‌.. వాళ్లిద్దరి వల్లే మా ఓటమి: కేఎల్‌ రాహుల్‌ | IPL 2024: Unknown Mcgurk Came As Surprise, Says LSG KL Rahul After Loss Against DC - Sakshi
Sakshi News home page

KL Rahul On Lose Against DC: అతడొక సర్‌ప్రైజ్‌.. వాళ్లిద్దరి వల్లే మా ఓటమి: కేఎల్‌ రాహుల్‌

Published Sat, Apr 13 2024 9:21 AM | Last Updated on Sat, Apr 13 2024 10:28 AM

IPL 2024 Unknown Mcgurk Came As Surprise: LSG KL Rahul After Loss To DC - Sakshi

కేఎల్‌ రాహుల్‌ (PC: IPL/LSG)

ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఓటమితో లక్నో సూపర్‌ జెయింట్స్‌ జైత్రయాత్రకు అడ్డుకట్ట పడింది. ఐపీఎల్‌-2024లో హ్యాట్రిక్‌ విజయాల తర్వాత సొంత మైదానంలో తొలి పరాజయాన్ని మూటగట్టుకుంది. తద్వారా 160కి పైగా పరుగుల స్కోరు చేస్తే.. లక్ష్య ఛేదనలో లక్నో కచ్చితంగా గెలుస్తుందనే రికార్డు చెరిగిపోయింది.

ఈ నేపథ్యంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఓటమిపై విచారం వ్యక్తం చేశాడు. తాము కనీసం ఇంకో 15- 20 పరుగులు సాధిస్తే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. శుభారంభం లభించినా దానిని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యామని పేర్కొన్నాడు.

పిచ్‌ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్న ఢిల్లీ చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తమను దెబ్బకొట్టాడని కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. ఇక కొత్త బ్యాటర్‌ జేక్‌ ఫ్రేజర్‌- మెక్‌గర్క్‌ ఎలా ఆడతాడన్న విషయంపై తమకు అవగాహన లేదని.. అయితే.. అతడు అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడని ప్రశంసించాడు.

ఢిల్లీ విజయంలో అతడికే ఎక్కువ క్రెడిట్‌ దక్కుతుందని కేఎల్‌ రాహుల్‌ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఢిల్లీ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ను పవర్‌ ప్లేలోనే అవుట్‌ చేయాలన్న తమ వ్యూహం ఫలించినా.. క్రీజులో పాతుకుపోయిన రిషభ్‌ పంత్‌, మెక్‌గర్క్‌ కలిసి మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నారని రాహుల్‌ అన్నాడు.

ఒకవేళ నికోలస్‌ పూరన్‌(0) గనుక కాసేపు నిలబడగలిగితే కచ్చితంగా ప్రమాదకారిగా మారేవాడని.. అయితే, అతడిని పెవిలియన్‌కు పంపడంలో కుల్దీప్‌ యాదవ్‌ సఫలమయ్యాడని రాహుల్‌ పేర్కొన్నాడు. ఏదేమైనా లోపాలు సరిచేసుకుని తదుపరి మ్యాచ్‌కు సిద్ధమవుతామని తెలిపాడు. 

ఇక ఢిల్లీతో మ్యాచ్‌లో లక్నో సారథి, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ 22 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 39 పరుగులు చేశాడు. 177.27 స్ట్రైక్‌రేటు నమోదు చేసి ఎలక్ట్రిక్‌ స్ట్రైకర్‌ అవార్డు అందుకున్నాడు. కాగా లక్నో  తదుపరి ఆదివారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌లో తలపడనుంది. 

లక్నో వర్సెస్‌ ఢిల్లీ స్కోర్లు:
►టాస్‌: లక్నో.. బ్యాటింగ్‌
►లక్నో స్కోరు: 167/7 (20)
►ఢిల్లీ స్కోరు: 170/4 (18.1)

►ఫలితం: లక్నోపై ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: కుల్దీప్‌ యాదవ్‌(3/20)

►రిషభ్‌ పంత్‌ స్కోరు: 41 రన్స్‌
►ఓవరాల్‌ టాప్‌ స్కోరర్లు: జేక్‌ ఫ్రేజర్‌- మెక్‌గర్క్‌(ఢిల్లీ- 35 బంతుల్లో 55), ఆయుశ్‌ బదోని (లక్నో- 35 బంతుల్లో 55 నాటౌట్‌).

చదవండి: అరంగేట్రంలోనే అదరగొట్టాడు.. ఎవరీ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement