ఒక్క టైటిల్‌ కోసం... | Indian Premier League Will Start From Tomorrow, DC And PBKS Make Their Own Luck In IPL 2025? | Sakshi
Sakshi News home page

ఒక్క టైటిల్‌ కోసం...

Published Fri, Mar 21 2025 3:44 AM | Last Updated on Fri, Mar 21 2025 9:36 AM

Indian premier league will start from tomorrow

ఢిల్లీ, పంజాబ్‌ జట్ల సుదీర్ఘ పోరాటం

వరుస వైఫల్యాలతో సతమతం

ప్రతీ ఏటా ప్రతికూల ఫలితాలే 

రేపటి నుంచి ఐపీఎల్‌

ఐపీఎల్‌ మొదలైనప్పుడు ఉన్న ఎనిమిది జట్లలో ఐదు టీమ్‌లు ఎప్పుడో విజేతగా నిలిచాయి... బెంగళూరు ఒక్కసారి కూడా గెలవకపోయినా ఆ జట్టు మూడుసార్లు ఫైనల్‌కు వెళ్లింది. పైగా విరాట్‌ కోహ్లిలాంటి దిగ్గజం కారణంగా ఫలితాలతో సంబంధం లేకుండా ఆకర్షణ కోల్పోని జట్టుగా సాగుతోంది... కానీ మరో రెండు టీమ్‌లు మాత్రం ప్రతీ సీజన్‌లో ఎన్నో ఆశలతో బరిలోకి దిగడం, సగం టోర్నీ ముగిసేవరకే పేలవ ప్రదర్శనతో చేతులెత్తేయడం దాదాపుగా రివాజుగా మారిపోయింది... ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆటగాళ్లు, కెప్టెన్లు, సిబ్బందిని మార్చి మార్చి ప్రయోగాలు చేసినా, వ్యూహాలు మార్చినా ఆశించిన ఫలితం దక్కలేదు. 

డేర్‌డెవిల్స్‌ నుంచి క్యాపిటల్స్‌గా మారినా... కింగ్స్‌ ఎలెవన్‌ నుంచి కింగ్స్‌కు పరిమితమైనా రాత మాత్రం మారలేదు. మరోసారి కొత్త మార్పులు, కొత్త బృందంతో దండయాత్రకు సిద్ధమవుతున్న ఢిల్లీ, పంజాబ్‌ టీమ్‌లకు ఇప్పుడైనా టైటిల్‌ రూపంలో అదృష్టం తలుపు తడుతుందా చూడాలి. –సాక్షి క్రీడా విభాగం  

అక్షర్‌ అద్భుతం చేసేనా? 
2020 సీజన్‌లో ఫైనల్‌ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్‌ రన్నరప్‌గా నిలిచి సంతృప్తి చెందింది. ఐపీఎల్‌లో ఢిల్లీకిదే అత్యుత్తమ ప్రదర్శన. ఆ తర్వాత నాలుగు సీజన్లలో ఢిల్లీ వరుసగా 3, 5, 9, 6 స్థానాల్లో నిలిచింది. గత ఏడాది తొలి ఐదు మ్యాచ్‌లలో ఓడిన తర్వాత కోలుకోవడం కష్టమైంది. ఈసారి జట్టు ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బందిలో కూడా భారీ మార్పు జరిగింది. వేలానికి ముందు అట్టి పెట్టుకున్న అక్షర్‌ పటేల్, కుల్దీప్, స్టబ్స్, పొరేల్‌లతో పాటు వేలంలో జేక్‌ ఫ్రేజర్‌ను మళ్లీ తెచ్చుకుంది. ఇప్పుడు అందరి దృష్టి కేఎల్‌ రాహుల్‌పై ఉంది. 

లక్నో యాజమాన్యంతో విభేదాల తర్వాత ఆ జట్టుకు దూరమైన రాహుల్‌ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకే కెపె్టన్సీని తిరస్కరించినట్లు సమాచారం. ఇటీవలి ఫామ్‌ చూస్తే రాహుల్‌ చక్కటి ప్రదర్శనపై అంచనాలు పెరుగుతున్నాయి. ఓపెనింగ్‌లో ఫ్రేజర్, డుప్లెసిస్‌తో పాటు మిడిలార్డర్‌లో స్టబ్స్‌ దూకుడు కీలకం కానుంది. గత ఏడాది పంజాబ్‌ తరఫున చెలరేగిన అశుతోష్‌ శర్మతో పాటు సమీర్‌ రిజ్వీ ఫినిషర్లుగా సిద్ధమయ్యారు. ఇక ఆల్‌రౌండర్‌గా, కెపె్టన్‌గా అక్షర్‌ పటేల్‌ తన ముద్రను చూపించాల్సి ఉంది. 

ముఖ్యంగా టి20 వరల్డ్‌ కప్, చాంపియన్స్‌ ట్రోఫీలలో సత్తా చాటి ఒక్కసారిగా స్థాయిని పెంచుకున్న అతను ఢిల్లీని సమర్థంగా నడిపిస్తే చరిత్రలో నిలిచిపోగలడు. స్టార్క్‌లాంటి దిగ్గజం జట్టుతో ఉండటం ఎప్పుడైనా బలమే. ముకేశ్, నటరాజన్, కుల్దీప్‌లు అతనికి అండగా నిలవాల్సి ఉంది. మోహిత్‌ రూపంలో మరో చక్కటి బౌలింగ్‌ ప్రత్యామ్నాయం అందుబాటులో ఉంది. 

హెడ్‌ కోచ్‌గా హేమంగ్‌ బదాని, డైరెక్టర్‌ హోదాలో వచ్చిన వేణుగోపాలరావు ఎలాంటి మార్పు తీసుకొస్తారనేది ఆసక్తికరం. మాజీ ఇంగ్లండ్‌ స్టార్‌ కెవిన్‌ పీటర్సన్‌ మెంటార్‌గా తన ప్రభావం చూపించవచ్చు. స్టార్క్‌ మినహా మిగతా భారత పేసర్లకు బౌలింగ్‌ కోచ్‌ మునాఫ్‌ పటేల్‌ ఎలా మార్గనిర్దేశం చేస్తాడో చూడాలి.  

ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు: అక్షర్‌ పటేల్‌ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్, కుల్దీప్‌ యాదవ్, ట్రిస్టన్‌ స్టబ్స్, జేక్‌ ఫ్రేజర్, మిచెల్‌ స్టార్క్, ఫాఫ్‌ డుప్లెసిస్, ముకేశ్‌ కుమార్, కరుణ్‌ నాయర్, డొనొవాన్‌ ఫెరీరా, అభిషేక్‌ పొరేల్, సమీర్‌ రిజ్వీ, అశుతోష్‌ శర్మ, దర్శన్‌ నల్కండే, విప్‌రాజ్‌ నిగమ్, అజయ్‌ మండల్, మన్వంత్‌ కుమార్, త్రిపురాన విజయ్, మాధవ్‌ తివారి, టి.నటరాజన్, మోహిత్‌ శర్మ, దుష్మంత్‌ చమీరా.   

శ్రేయస్‌ నాయకత్వంలోనైనా... 
2014లో అనూహ్య ప్రదర్శనతో దూసుకుపోయి ఫైనల్‌ వరకు వెళ్లగలగడం పంజాబ్‌ కింగ్స్‌ జట్టు సాధించిన ఘనత. కానీ ఆ తర్వాత లీగ్‌లో మరే ఇతర జట్టుకు లేనంత చెత్త రికార్డును ఈ టీమ్‌ నమోదు చేసింది. తర్వాతి పదేళ్లలో ఒక్కసారి కూడా కనీసం ‘ప్లే ఆఫ్స్‌’కు అర్హత సాధించలేకపోయిన జట్టు వరుసగా 8, 8, 5, 7, 6, 6, 6, 6, 8, 9 స్థానాలకు పరిమితమైంది! గత సీజన్లో 14 మ్యాచ్‌లలో 5 మాత్రమే గెలిచిన టీమ్‌ ఈసారి ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే అట్టి పెట్టుకొని మళ్లీ కొత్తగా మొదలు పెట్టేందుకు సిద్ధమైంది. 

ప్రభ్‌సిమ్రన్‌ సింగ్, శశాంక్‌ సింగ్‌లను కొనసాగించి వారిపై అంచనాలు పెంచుకున్న టీమ్‌ వేలంలో యువ పేస్‌ అర్‌‡్షదీప్‌ను తిరిగి తెచ్చుకోవడం సరైన నిర్ణయం. ఏడాది కాలంగా ఫామ్‌లో ఉన్న అతను టీమ్‌ విజయాలను శాసించగలడు. ఢిల్లీ కోచ్‌గా ఫలితాలు సాధించలేకపోయిన రికీ పాంటింగ్, 2024 ఐపీఎల్‌ విన్నింగ్‌ కెపె్టన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ కాంబినేషన్‌లో జట్టు సంచలనాలు ఆశిస్తోంది. 

ట్రోఫీ గురించి ఇప్పుడే మాట్లాడకపోయినా కనీసం గతంలోకంటే మెరుగైన విజయాలు అందుకొని ముందుగా ప్లే ఆఫ్స్‌ వరకు వెళ్లాలని జట్టు భావిస్తోంది. జట్టుపై ఆ్రస్టేలియన్ల ప్రభావం చాలా ఉంది. గతంలో ఐదు సీజన్లు ఇదే టీమ్‌కు ఆడిన మ్యాక్స్‌వెల్‌ మళ్లీ ఇక్కడికే వచ్చాడు. కెరీర్‌ చివర్లో ఉన్న అతను ఎంతగా ప్రభావం చూపిస్తాడనేది చర్చనీయాంశం. మరో నలుగురు ఆసీస్‌ ఆటగాళ్లు స్టొయినిస్, ఇన్‌గ్లిస్, బార్ట్‌లెట్, హార్డీ టీమ్‌తో ఉన్నారు. 

అయ్యర్‌ కెప్టెన్సీతో పాటు దూకుడైన బ్యాటింగ్‌ చూపించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో చక్కటి ఫామ్‌లో ఉన్న అజ్మతుల్లా, మార్కో యాన్సెన్‌ కచ్చితంగా ప్రభావం చూపించగలరు. ఐపీఎల్‌ స్టార్‌ స్పిన్నర్‌ చహల్‌ ఉండటం జట్టుకు అదనపు బలం. హాడిన్, హోప్స్, సునీల్‌ జోషిలతో కూడిన సహాయక సిబ్బంది కూడా కీలకం కానున్నారు.   

పంజాబ్‌ కింగ్స్‌ జట్టు: శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), అర్ష్  దీప్‌ సింగ్, యుజువేంద్ర చహల్, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్, శశాంక్‌ సింగ్, స్టొయినిస్, మ్యాక్స్‌వెల్, ఇన్‌గ్లిస్, హర్‌ప్రీత్‌ బ్రార్, మార్కో యాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఫెర్గూసన్, నేహల్‌ వధేరా, విష్ణు వినోద్,  హర్నూర్‌ పన్ను, పైలా అవినాశ్,  ప్రియాన్‌‡్ష ఆర్య, ఆరోన్‌ హార్డీ, ముషీర్‌ ఖాన్, సూర్యాంశ్‌ షెడ్గే,  వైశాక్‌ విజయ్‌కుమార్, యశ్‌ ఠాకూర్, కుల్దీప్‌ సేన్, ప్రవీణ్‌ దూబే, జేవియర్‌ బార్ట్‌లెట్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement