IPL 2025: కెవిన్‌ పీటర్సన్‌కు కీలక బాధ్యతలు | IPL 2025: Kevin Pietersen Appointed As Delhi Capitals Mentor | Sakshi
Sakshi News home page

IPL 2025: కెవిన్‌ పీటర్సన్‌కు కీలక బాధ్యతలు

Published Thu, Feb 27 2025 4:08 PM | Last Updated on Thu, Feb 27 2025 6:54 PM

IPL 2025: Kevin Pietersen Appointed As Delhi Capitals Mentor

2025 ఐపీఎల్‌ సీజన్‌ (IPL 2025) ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) తమ నాన్‌ ప్లేయింగ్‌ బృందం మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. హెడ్‌ కోచ్‌ సహా కీలక స్థానాలన్నిటినీ కొత్త వారితో భర్తీ చేసింది. రికీ పాంటింగ్‌కు ఉద్వాసన పలికాక హేమంగ్‌ బదానీని హెడ్‌ కోచ్‌గా నియమించుకున్న డీసీ యాజమాన్యం.. డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా వేణుగోపాల్‌ రావు, అసిస్టెంట్‌ కోచ్‌గా మాథ్యూ మాట్‌, బౌలింగ్‌ కోచ్‌గా మునాఫ్‌ పటేల్‌, స్కౌటింగ్‌ హెడ్‌గా విజయ్‌ భరద్వాజ్‌లను నియమించుకుంది. 

తాజాగా ఈ ఫ్రాంచైజీ ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ను (Kevin Pietersen) మెంటార్‌గా ఎంచుకుంది. పీటర్సన్‌ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాడు. 2014 సీజన్‌లో అతను డీసీ కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. కోచింగ్‌కు సంబంధించి పీటర్సన్‌కు ఐపీఎల్‌లో ఇది మొదటి రోల్‌. పీటర్సన్‌ను మెంటార్‌గా నియమించిన విషయాన్ని డీసీ యాజమాన్యం ఇవాళ (ఫిబ్రవరి 27) అధికారికంగా ప్రకటించింది. 

2025 ఐపీఎల్‌ సీజన్‌లో పీటర్సన్‌ హెడ్‌ కోచ్‌ హేమంగ్‌ బదానీతో కలిసి పని చేస్తాడు. పీటర్సన్‌ ఐపీఎల్‌లో చివరిగా 2016 సీజన్‌లో పాల్గొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 13000కు పైగా పరుగులు చేసిన పీటర్సన్‌ 2014 సీజన్‌లో ఢిల్లీ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సీజన్‌లో ఢిల్లీ కేవలం రెండే విజయాలతో చివరి స్థానంలో నిలిచింది. పీటర్సన్‌ 2012, 2014 సీజన్లలో ఢిల్లీకు ఆడాడు. 

అంతకుముందు 2009, 2010 సీజన్లలో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు. 2012 సీజన్‌లో పీటర్సన్‌ తన అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. ఆ సీజన్‌లో అతను 305 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉంది. పీటర్సన్‌ ఐపీఎల్‌ కెరీర్‌ 2016లో ముగిసింది. ఆ సీజన్‌లో అతను రైజింగ్‌ పూణే సూపర్‌ జెయింట్‌కు ఆడాడు. 44 ఏళ్ల పీటర్సన్‌ ఐపీఎల్‌ మొత్తంలో 36 మ్యాచ్‌లు ఆడి 1001 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 4 అర్ద సెంచరీలు ఉన్నాయి.

కాగా, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐపీఎల్‌ ప్రారంభం నుంచి వేర్వేరు పేర్లతో లీగ్‌లో ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేకపోయింది. తొలి రెండు సీజన్లలో సెమీస్‌కు చేరిన ఈ జట్టు.. 2020 సీజన్‌లో అత్యుత్తమంగా ఫైనల్స్‌కు చేరింది. ఆ సీజన్‌ ఫైనల్లో డీసీ ముంబై చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గత మూడు సీజన్లలో ఢిల్లీ పేలవ ప్రదర్శన కనబర్చింది. మూడు సీజన్లలో లీగ్‌ దశలోనే నిష్క్రమించింది.

తదుపరి సీజన్‌ కోసం ఢిల్లీ జట్టును సైతం ప్రక్షాళన చేసింది. పాత ఆటగాళ్లను దాదాపుగా వదిలించుకుని కొత్త ఆటగాళ్లను తీసుకుంది. మెగా వేలానికి ముందు అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, ట్రిస్టన్‌ స్ట​బ్స్‌, అభిషేక్‌ పోరెల్‌ను రీటైన్‌ చేసుకున్న డీసీ యాజమాన్యం.. కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ సహా ఆసీస్‌ స్టార్‌ ఆటగాళ్లు డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌లను వదిలేసింది.

మెగా వేలంలో కేఎల్‌ రాహుల్‌, మిచెల్‌ స్టార్క్‌, హ్యారీ బ్రూక్‌, జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌, టి నటరాజన్, డుప్లెసిస్‌ లాంటి స్టార్‌ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వేలంలో డీసీ యాజమాన్యం అత్యధికంగా 14 కోట్లు వెచ్చింది కేఎల్‌ రాహుల్‌ను సొంతం చేసుకుంది. తదుపరి సీజన్‌ కోసం డీసీ మేనేజ్‌మెంట్‌ తమ కెప్టెన్‌ను ఇంకా ప్రకటించలేదు.

2025 సీజన్‌ కోసం ఢిల్లీ జట్టు..
కేఎల్‌ రాహుల్‌, జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌, హ్యారీ బ్రూక్‌, అషుతోశ్‌ శర్మ, డుప్లెసిస్‌, సమీర్‌ రిజ్వి, కరుణ్‌ నాయర్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, అభిషేక్‌ పోరెల్‌, డొనోవన్‌ ఫెరియెరా, అక్షర్‌ పటేల్‌, విప్రాజ్‌ నిగమ్‌, దర్శన్‌ నల్కండే, మాధవ్‌ తివారి, మన్వంత్‌ ‍కుమార్‌, త్రిపురుణ విజయ్‌, అజయ్‌ మండల్‌, మిచెల్‌ స్టార్క్‌, టి నటరాజన్‌, ముకేశ్‌ కుమార్‌, మోహిత్‌ శర్మ, దుష్మంత చమీరా, కుల్దీప్‌ యాదవ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement