సెమీస్ లో రాంచీ రేస్
రాంచీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ రాంచీ రేస్ సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. శనివారం జరిగిన రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో రాంచీ 6-0తో ఉత్తర ప్రదేశ్ విజార్డ్స్‌పై నెగ్గింది. దీంతో ఆరు విజయాలు, మూడు ఓటములతో మొత్తం 32 పాయింట్లతో జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. రాంచీ తరఫున ఒగ్లివి ఫ్లిన్ (40వ ని.), జాక్సన్ ఆష్లే (47వ ని.), సుమిత్ కుమార్ (59వ ని.) ఫీల్డ్ గోల్స్ (రెండు గోల్స్‌తో సమానం) సాధించారు.
తొలి రెండు క్వార్టర్స్‌లో ప్రత్యర్థి సర్కిల్‌లోకి దూసుకెళ్లిన రాంచీ గోల్స్ కోసం చాలా అవకాశాలను సృష్టించుకుంది. రెండో అర్ధభాగంలో రాంచీ కొట్టిన ఐదు పెనాల్టీ కార్నర్లను గోల్‌కీపర్ శ్రీజేష్ అద్భుతంగా అడ్డుకున్నాడు. మూడో క్వార్టర్స్‌లో యూపీ అటాకింగ్ మొదలుపెట్టినా.. రాంచీ డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది. నాలుగో క్వార్టర్‌లో పూర్తి ఆధిక్యం ప్రదర్శించిన రాంచీ మరో రెండు ఫీల్డ్ గోల్స్‌తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో రాంచీ రేస్.. దబాంగ్ ముంబైతో తలపడుతుంది.a