కొత్త హంగులతో పునరాగమనం | Revival of Hockey India League | Sakshi
Sakshi News home page

కొత్త హంగులతో పునరాగమనం

Published Sat, Oct 5 2024 4:18 AM | Last Updated on Sat, Oct 5 2024 4:18 AM

Revival of Hockey India League

హాకీ ఇండియా లీగ్‌ పునరుద్ధరణ

డిసెంబర్‌ 28 నుంచి ప్రారంభం

పురుషుల విభాగంలో 8 జట్లు

మహిళల విభాగంలో 6 జట్లు పోటీ

రౌర్కెలా, రాంచీలో పోటీలు

దిలీప్‌ టిర్కీ కృషికి దక్కిన ఫలితం  

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) స్ఫూర్తితో ప్రారంభమైన హాకీ ఇండియా  లీగ్‌ (హెచ్‌ఐఎల్‌) తిరిగి అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. 2017లో  నిలిచిపోయిన హెచ్‌ఐఎల్‌ను తిరిగి  ఆరంభించాలని హాకీ ఇండియా (హెచ్‌ఐ) నిర్ణయించింది. ఈసారి లీగ్‌కు సరికొత్త హంగులు అద్దగా... పురుషులతో పాటు మహిళల విభాగంలో పోటీలుజరగనున్నాయి. 

డిసెంబర్‌ 28 నుంచి ప్రారంభం కానున్న ఈ లీగ్‌ కోసం ఈ నెల 13 నుంచి మూడు రోజులపాటు ప్లేయర్ల వేలం జరగనుంది. ఒక్కో జట్టులో 24 మంది ప్లేయర్లు ఉండనున్నారు. ఇందులో నలుగురు జూనియర్‌ ఆటగాళ్లు తప్పనిసరి అనే నిబంధనను తీసుకొచ్చారు. పురుషుల విభాగంలో హైదరాబాద్‌ జట్టును రెసల్యూట్‌ స్పోర్ట్స్‌ కంపెనీ సొంతం చేసుకుంది. 

మహిళల లీగ్‌ తుదిపోరు వచ్చే ఏడాది జనగరి 26న, పురుషుల ఫైనల్‌ ఫిబ్రవరి 1న నిర్వహించనున్నట్లు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్‌ టిర్కీ ప్రకటించాడు. ఏడేళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కానున్న లీగ్‌ విశేషాలను పరిశీలిస్తే...  – సాక్షి, క్రీడావిభాగం 

దేశంలో హాకీ క్రీడకు మరింత ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో మొదలు పెట్టిన హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌) ఏడేళ్ల విరామం తర్వాత పునఃప్రారంభం కానుంది. 2013లో ప్రారంభమైన లీగ్‌ ఐదు సీజన్‌లు పాటు విజయవంతంగా కొనసాగిన తర్వాత 2017లో అనివార్య కారణాల వల్ల నిలిచిపోయింది. ఇప్పుడు తిరిగి ఈ ఏడాది నుంచి ప్రారంభించనున్నట్లు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్‌ టిర్కీ శుక్రవారం వెల్లడించాడు. గతంలో పురుషుల విభాగంలో మాత్రమే పోటీలు జరగగా... ఈ సారి మహిళల విభాగంలోనూ మ్యాచ్‌లు జరగనున్నాయి. 

హెచ్‌ఐఎల్‌ తిరిగి ప్రారంభమవడం ద్వారా ఆటకు మరింత ఆదరణ దక్కడంతో పాటు... మహిళల హాకీలో కోత్త జోష్‌ రానుంది. భారత మాజీ కెపె్టన్‌ దిలీప్‌ టిర్కీ హాకీ ఇండియా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి... ఈ లీగ్‌ను తిరిగి తీసుకురావాలని ప్రయత్నాలు చేయగా... ఇప్పటికి కార్యరూపం దాలి్చంది. హెచ్‌ఐఎల్‌కు టిర్కీనే చైర్మన్‌గా వ్యవహరించనున్నాడు. ‘జాతీయ జట్టుకు నాణ్యమైన ఆటగాళ్లను అందించడంలో హాకి ఇండియా లీగ్‌ కీలక పాత్ర పోషించనుంది. హాకీ క్రీడలో కొత్త అధ్యాయానికి నేడు తెర లేచినట్లు అనిపిస్తోంది. 

అడగ్గానే హెచ్‌ఐఎల్‌ కోసం 35 రోజుల సమయాన్ని కేటాయించిన అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌)కు ధన్యవాదాలు. హాకీ ఇండియా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దీని కోసం కృషి చేశా. ఇప్పటికి కల సాకారమైంది’ అని టీర్కీ పేర్కొన్నాడు. హాకీ ఇండియా కార్యదర్శి భోళానాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ... భారత్‌లో హాకీ కేవలం క్రీడ మాత్రమే కాదని దీనికి భారతీయుల గుండెల్లో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. 2036 వరకు భారత హాకీకి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్‌గా వ్యవహరించనుందని పునరుద్ఘాటించారు. 

జట్ల వివరాలు  
పురుషుల విభాగంలో ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి. వాటిలో చెన్నై జట్టుకు చార్లెస్‌ గ్రూప్, లక్నో జట్టుకు యదు స్పోర్ట్స్, పంజాబ్‌ జట్టుకు జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్, పశ్చిమ బెంగాల్‌ జట్టుకు ష్రాచీ స్పోర్ట్స్, హైదరాబాద్‌ జట్టుకు రెసల్యూట్‌ స్పోర్ట్స్, రాంచీ జట్టుకు నవోయమ్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యజమానులుగా కొనసాగనున్నారు. 

టెన్నిస్‌ దిగ్గజం మహేశ్‌ భూపతికి చెందిన ఎస్‌జీ స్పోర్ట్స్‌ కంపెనీ ఢిల్లీ జట్టును సొంతం చేసుకుంది. మహిళల విభాగంలో హరియాణా జట్టును జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్, పశ్చిమ బెంగాల్‌ టీమ్‌ను ష్రాచీ స్పోర్ట్స్, ఢిల్లీ జట్టును ఎస్‌జీ స్పోర్ట్స్, ఒడిశా జట్టును నవోయమ్‌ స్పోర్ట్స్‌ సొంతం చేసుకున్నాయి. మరో రెండు ఫ్రాంచైజీల యజమానులను త్వరలోనే వెల్లడించనున్నారు.  

» పురుషుల విభాగంలో 8 జట్లు, మహిళల విభాగంలో 6 జట్లు లీగ్‌లో పాల్గొననున్నాయి. గతంలో కేవలం పురుషుల విభాగంలోనే పోటీలు జరగగా.. తొలిసారి మహిళా లీగ్‌ను ప్రవేశ పెడుతున్నారు.  
»  పురుషుల విభాగంలో పోటీలను రౌర్కెలాలో, మహిళల మ్యాచ్‌లను రాంచీలో నిర్వహించనున్నారు.  
»  ఒక్కో జట్టులో 24 మంది ఆటగాళ్లు ఉండనున్నారు. వారిలో 16 మంది భారత ఆటగాళ్లు, 8 మంది విదేశీయులకు అవకాశం ఉంటుంది. భారత ఆటగాళ్లలో నలుగురు జూనియర్‌ ప్లేయర్లు తప్పనిసరి. 
»  డిసెంబర్‌ 28న ఈ లీగ్‌ ప్రారంభం కానుండగా... మహిళల విభాగంలో వచ్చే ఏడాది జనవరి 26న రాంచీలో ఫైనల్‌ జరగనుంది. పురుషుల విభాగంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న రౌర్కెలాలో తుదిపోరు జరగనుంది.  
»  ఈనెల 13 నుంచి 15 వరకు న్యూఢిల్లీలో జరగనున్న ప్లేయర్ల వేలంలో అన్ని ఫ్రాంచైజీలు పాల్గొననున్నాయి. ప్లేయర్ల కనీస ధరను మూడు కేటగిరీలుగా (రూ. 10 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు) విభజించారు.  
»  ఆటగాళ్లను ఎంపిక చేసుకునేందుకు పురుషుల విభాగంలో ఒక్కో ఫ్రాంచైజీ రూ. 4 కోట్లు... మహిళల విభాగంలో ఒక్కో ఫ్రాంచైజీ రూ. 2 కోట్లు ఖర్చు చేయవచ్చు.  
»  2013లో తొలిసారి నిర్వహించిన హెచ్‌ఐఎల్‌లో రాంచీ రైనోస్‌ టైటిల్‌ సాధించగా.. ఆ తర్వాత 2014లో ఢిల్లీ వేవ్‌రైడర్స్, 2015లో రాంచీ రాయ్స్, 2016లో పంజాబ్‌ వారియర్స్, 2017లో కళింగ లాన్సర్స్‌ చాంపియన్‌గా నిలిచాయి. 
»  పారిస్‌ ఒలింపిక్స్‌ తర్వాత హాకీ ఆటకు గుడ్‌బై చెప్పిన భారత దిగ్గజ గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేశ్‌ ఢిల్లీ జట్టుకు డైరెక్టర్‌గా వ్యవహరించనున్నాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement