రంజీ ట్రోఫీ 2024-25 సెకెండ్ లెగ్ మ్యాచ్‌లు నిన్నటి నుంచి (జనవరి 23) ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఆటలో రవీంద్ర జడేజా (ఐదు వికెట్లు) మినహా టీమిండియా ఆటగాళ్లంతా తేలిపోయారు. పలువురు దేశీయ ఆటగాళ్లు (గుజరాత్ బౌలర్ సిద్దార్థ్ దేశాయ్ తొమ్మిది వికెట్ల ప్రదర్శన) సత్తా చాటారు. నిన్న మొదలైన మ్యాచ్‌ల్లో పదో తరగతి చదువుతున్న ఓ కుర్రాడు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును బద్దలు కొట్టాడు.
15 ఏళ్ల అంకిత్ ఛటర్జీ హర్యానాతో నిన్న మొదలైన మ్యాచ్‌లో బెంగాల్ తరఫున అరంగేట్రం చేపి, బెంగాల్ తరఫున రంజీ అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ పేరిట ఉండేది. గంగూలీ 17 ఏళ్ల వయసులో రంజీల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అంకిత్ ప్రస్తుతం పదో క్లాస్ చదువుతున్నాడు. క్లబ్ లెవెల్ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన అంకిత్‌కు రంజీ జట్టులో చోటు దక్కేలా చేసింది.
నిన్న హర్యానాతో మొదలైన మ్యాచ్‌లో అంకిత్ 20 బంతులు ఎదుర్కొని బౌండరీ సాయంతో 5 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి అంకిత్ ప్రాతినిథ్యం వహిస్తున్న బెంగాల్ వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది.
అంతకుముందు హర్యానా తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగులకే ఆలౌటైంది. బెంగాల్ యువ బౌలర్ సూరజ్ సింధు జైస్వాల్ ఆరు వికెట్లు తీసి హర్యానాను దెబ్బేశాడు. టీమిండియాకు ప్రాతినిథ్యం వహించే ముకేశ్ కుమార్, టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తమ్ముడు మహ్మద్ కైఫ్ తలో రెండు వికెట్లు తీశారు. హర్యానా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ అంకిత్ కుమార్ (57) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అతి పిన్న వయస్కుడు వైభవ్ సూర్యవంశీ
అంకిత్ ఛటర్జీ బెంగాల్ తరఫున రంజీ అరంగ్రేటం చేసిన అతి పిన్న వయస్కుడైతే.. ఓవరాల్‌గా రంజీల్లో అరంగేట్రం చేసిన అతి చిన్న వయస్కుడి రికార్డు వైభవ్ సూర్యవంశీ పేరిట ఉంది. వైభవ్ 12 ఏళ్ల వయసులో బీహార్ తరఫున రంజీ అరంగేట్రం చేశాడు. వైభవ్ ముంబైతో జరిగిన తన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు.
వైభవ్ భారత్ తరఫున అండర్ 19 లెవెల్లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగానూ రికార్డు నెలకొల్పాడు. వైభవ్.. యూత్ టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత్ ఆటగాడిగానూ రికార్డు కలిగి ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment