![mixed response on new budget](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/budget.jpg.webp?itok=Yxclyc2d)
‘‘ఇది ప్రజల బడ్జెట్టు. ప్రజల సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్లు, వినియోగం పెరుగుతాయి’’ అని అన్నారు ప్రధాన మంత్రి. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయి అని ఆశిస్తున్నారు మోదీగారు. ‘‘ప్రజలకు ఒరిగిందేమీ లేదు. స్కీముల సంఖ్య పెరిగిందే కానీ సంతోషపడాల్సినదేమీ లేదు. ఆర్థిక మందగమనానికి నాంది’’ అని అంటున్నారు ఒకప్పటి ఆర్థికమంత్రి చిదంబరం.
ఇక రాష్ట్రాల విషయానికొస్తే.. ప్రతి రాష్ట్రం ఎంతో కొంత అసంతృప్తిగానే ఉంది. ఆరోగ్యరంగానికి సరిపోయినంత మందు పడలేదంటున్నారు. రైల్వేను పట్టాల నుంచి తప్పించారంటున్నారు. రైతులకు అంతంతమాత్రమే అని ఒకరు .. పరిశ్రమలకు ఫర్వాలేదని మరొకరు.. ఆటలకి పెద్ద పీట.. చిన్న తరహా పరిశ్రమలకు ఊతం..కృత్రిమ మేధస్సుకు ఎక్సలెన్సు, మందుల ధరల తగ్గుముఖం .. ఆహార భద్రతకు అవకాశం .. ఆభరణాల మీద కస్టమ్స్ తగ్గుదల, పత్తికి కొత్త ఊపు, జౌళి పరిశ్రమకు దన్ను, ఎయిర్‌పోర్టుల విస్తరణ, రోడ్ల మీద చిన్న చూపు, అంతరిక్ష రంగాన్ని మరింత పైకి తీసుకెళ్లే ప్రయత్నం, చిన్న తరహా పరిశ్రమలకు భారీ ఊరట, యాత్రా స్థలాల సుందరీకరణ, ఎలక్ట్రిక్ వాహనాల ధరల తగ్గుదల.. ఇలా ఒక్కో రంగానిది ఒక్కో పరిస్థితి.
ఏది ఎలా ఉన్నా స్టాక్ ఎక్స్చేంజీల్లో షేర్లు పతనం, విజయకేతనం. ఈ పరిణామం దిక్సూచి కాకపోయినా, ఇదో వెంటాడే బూచి. ‘‘నా తలరాత మారింది. నా ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెట్టుకోవచ్చు’’ అని మురిసిపోతోంది మధ్యతరగతి మహిళ. భారీగా పెన్షన్ వచ్చే దంపతులు .. ఇక కంపల్సరీ సేవింగ్స్ మానేసి ‘‘పదవే గౌరీ, పరమాత్ముని చూడ’’ అని తీర్థయాత్రలకు విమానంలో ప్లాన్ చేస్తున్నారు. పింగళిగారు రాసిన పాటను పదే పదే పాడి ‘‘ప్రేమించిన పతికి ఎదురునుండగా తీర్థయాత్రకెందుకని’’ అంటూ పతిభక్తి చాటుకున్న భార్య సత్యవతి .. పదండి పదండి ఎప్పుడూ ఈ పాడు కొంపేనా అంటూ ట్రావెలింగ్ ఏజంటు దగ్గరకి పరుగెత్తింది, మొగుడి క్రెడిట్ కార్డు పట్టుకుని.
‘వెకేషన్’కి పెద్ద ప్లాన్ చేస్తోంది లావణ్య. అక్కతో పాటు నేనూ, మా ఆయనా వస్తాం అంటోంది చెల్లెలు త్రిష. ‘మ్యుచువల్ ఫండ్స్’లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు రవి. ‘నాకు జీతం పెంచకపోయినా ఫర్వాలేదు’ అంటోంది ఉద్యోగిని ఊర్మిళ.. వాళ్లబాసుతో. ఇంట్లో పాత ఫర్నిచరు, టీవీలు తీసేసి కొత్తవి కొనుక్కుందాం అని అంటోంది మరో మహిళ లలిత. ఇల్లు కొత్తది కాకపోయినా మంచిగా ఇంటీరియర్స్ చేయిద్దాం అంటోంది హరిత. ‘‘సేవింగ్స్‌తో మంచిగా అప్‌స్కేలింగ్ వైపు వెళ్తాను’’ అని అంటున్నాడు అక్షిత్.
లేటెస్టు మ్యూజిక్ పరికరాలు కొని సంగీతం సాధన చేస్తానంటోంది మరో వనిత అభిజ్ఞ. షేరు మార్కెట్లో ఎంటర్ అయ్యి వెల్త్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు వారెన్ బఫెట్ బుక్ చతివి రత్నాకర్. ‘‘పొరుగింటి మీనాక్షమ్మని చూశారా’’ అనే ప్రశ్న మానేసి తనకి కావాల్సిన బంగారం ఆభరణాలను ప్లాన్ చేస్తోంది నాగమణి.
వీళ్ళందరి ఆలోచనలూ నిజమయ్యేనా? అంటే నిజమే అనిపిస్తోంది. తన ప్రతిపాదనలతో సంవత్సరానికి లక్ష కోట్ల రూపాయల నష్టమని చెప్తున్నారు సీతమ్మ తల్లి. రెండు కోట్ల మంది ట్యాక్స్ పేయర్లకు లబ్ధి చేకూరుతుందని ఫైనాన్స్ సెక్రటరీ పాండేగారి ఉవాచ. జనాల చేతిలో మిగులు. అలా మిగిలిన మొత్తం వెచ్చించడానికి ఇక హద్దులుండవు. ఇప్పటికి ప్రైవేటు వారి చేతిలో వినియోగం నిమిత్తం ఆర్థిక వ్యవస్థలోకి వచ్చేది రెండు వందల లక్షల కోట్లు. దానికి అదనంగా ఒక లక్ష కోట్లు అంటే సామాన్యం కాదు. పెద్ద సంఖ్యే.
క్రమేపీ, పాత విధానం పన్నుల సేకరణ ఉండదు. కొత్త విధానానికి మొగ్గు చూపిస్తున్నారు. ద్రవ్యోల్బణం కొనసాగుతున్నా ఖర్చుల స్థాయి తగ్గలేదు. కోడి పందాల్లో వేల కోట్లు. కుంభమేళా సందర్భంగా కొన్ని వేల కోట్లు. ఆకలి చావులుండవచ్చు.. కానీ కోడి పులావ్ అమ్ముడుపోతుంది. అందరి ఖర్చులు పెరుగుతాయి. లిక్విడిటీ పెరుగుతుంది. ఈ యాగంలో ‘‘వినియోగమే’’ యోగప్రదమైనది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/3_56.jpg)
పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు.
Comments
Please login to add a commentAdd a comment