అసోం వరదల్లో 26 మంది మృతి.. హోం మంత్రి సమీక్ష..
గౌహతిః అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తడంతో లక్షలమంది జనం ఇక్కట్లు పడుతున్నారు. సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. ఇప్పటికే వరదల కారణంగా 26 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులను సమీక్షించేందుకు వరద బాధిత ప్రాంతాల్లో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఏరియల్ సర్వే నిర్వహించారు. అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోన్వాల్, రాష్ట్ర మంత్రి జితేంద్రసింగ్ లతో కలసి నష్టాలను అంచనావేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు కేంద్రం 4 లక్షల రూపాయల చొప్పున సహాయాన్ని ప్రకటించింది.
వరదల్లో చిక్కుకున్న అసోం రాష్ట్రంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటించారు. అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోన్వాల్, రాష్ట్రమంత్రి జితేంద్రసింగ్ లతో కలసి ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం వరద పరిస్థితులపై అక్కడి అధికారులతో సమీక్షించిన రాజ్ నాథ్.. సుమారు 60 ఎన్జీఆర్ ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించడం పరిష్కారం కాదని, రాష్ట్రానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. స్థానిక ప్రజా ప్రతినిధులు సైతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని రాజ్ నాథ్ తెలిపారు. వరద పరిస్థితులను సమీక్షించేందుకు ఉదయం ఢిల్లీనుంచీ గౌహతి బయల్దేరేందుకు ముందుగా ఆయన.. తన పర్యటన వివరాలను ట్వీట్ చేశారు.
రాష్ట్రంలోని 21 జిల్లాల్లోని సుమారు 36 లక్షలమంది వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ఇప్పటి వరకూ వరదల కారణంగా 26 మంది వరకూ మృతి చెందారని రాజ్ నాథ్ తెలిపారు. ఎడ తెరపి లేకుండా కురిసిన వర్షాలకు తోడు.. నదులు పొంగి ప్రవహించడంతో ఈ పరిస్థితి ఏర్పండిందన్నారు. లఖింపూర్, గోలాఘాట్, బొంగాయిగాన్, జోర్హాట్, ధీమాజీ, బర్పేటా, గావాల్పర్, ధుబ్రీ, దర్రాంగ్, మోరిగావ్, సోనిత్పూర్ జిల్లాలు అత్యధికంగా వరదల వల్ల నష్టపోయినట్లు 'అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ' (ఏఎస్డీఎమ్ఏ) వెల్లడించింది. అలాగే శివసాగర్, కోక్రజ్హర్, దిబ్రుఘర్, గోల్పారా, తిన్షుకియా,బిశ్వనాథ్, నల్బారీ, బక్సా, ఉదల్ గ్లురీ, కామ్రప్ (ఎం) ఛిరాంగ్ జిల్లాలు కూడా వరద ముంపునకు గురైనట్లు ఏఎస్డీఎమ్ఏ తెలిపింది. గౌహతి, నేమాతిఘట్, తేజ్పూర్, గోల్పారా, ధుబ్రీల్లోని బ్రహ్మపుత్రానది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని 27 అగ్నిమాపక కేంద్రాలతో కలసి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. బాధితులకోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 800 తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేసి, ఆహారం, మందులు సైతం అందిస్తున్నట్లు ఎస్డీఆర్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.