
అసోంలోని వివిధ జిల్లాలకు చెందిన లక్షలాదిమంది ప్రజలు ప్రస్తుతం వరదల్లో చిక్కుకున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో రుతుపవనాలు ఇక్కడికి ప్రవేశించనున్నాయి. దీంతో మరింతగా వర్షాలు కురవనున్నాయి. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్రం వరదల బారిన పడనుంది. రాబోయే కాలంలోనూ ఇదే ముప్పు కొనసాగనుందా?
భారత వాతావరణశాఖ తాజాగా అసోంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని తెలియజేస్తూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. దీని ప్రకారం చూస్తే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఖాయమని తెలుస్తోంది. కాగా ఇప్పటికే వరదల కారణంగా లక్షమందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.
అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజిమెంట్ అధారిటీ(ఎఎస్‌డీఎంఏ) తెలిపిన వివరాల ప్రకారం అసోంలోని బక్సా, బార్పేట, దరంగ్, ఘెమాజీ, థుభరీ, కోక్రాజార్, లఖీపుర్, నల్బార్, సోనిత్‌పూర్, ఉదల్‌గురి జిల్లాలలో 1.9 లక్షలకు మించిన ప్రజలు వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని 780 గ్రామాలు నీట మునిగాయి. 10 వేల ఎకరాల్లోని పంట నీట మునిగింది. ఫలితంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాలను వరదలు చుట్టుముట్టాయి. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్థంభించింది.
గత ఏడాది మే నెల నుంచే అసోంలో వరదలు మొదలయ్యాయి. సాధారణ వర్షపాతం కంటే అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. 2022 ముందు 10 ఏళ్లలో ఎప్పుడూ అసోంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తలేదు. గడచిన కొన్ని సంవత్సరాలుగా అసోంలో సంభవిస్తున్న వరదలు ప్రజలను మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వరదల కారణంగా ఊళ్లను చుట్టుముడుతున్న నీరు చాలా సమయం వరకూ అదే ప్రాంతంలో నిలిచిపోతోంది. ఇది ఎంతో ప్రమాదకరంగా మారుతోంది.
గడచిన ఏడాదిలో భారీ వర్షాలు, వరదలు అసోంను అతలాకుతలం చేశాయి. ఏకంగా ఏడు నెలల పాటు అసోంలోని పలు జిల్లాలు నీటిలో మునిగే ఉన్నాయి. దీనికి ముందు 2019, 2020లలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. గడచిన ఏడాది అసోంలో సంభవించిన వరదలకు 180 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చదవండి: కాశీకి వెళుతున్నారా? ఈ మార్పులు తెలియకపోతే.. దారి తప్పడు ఖాయం!