
కేంద్ర హోంమంత్రితో గవర్నర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ బుధవారం రాత్రి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. అఖిల భారత సర్వీస్ అధికారుల విభజన సహా ఇరు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులు, వివాదాస్పద అంశాలను ఆయనకు వివరించారు. ఢిల్లీలోని అశోకారోడ్డులో రాజ్‌నాథ్ నివాసంలో దాదాపు అరగంటపాటు ఈ సమావేశం జరిగింది. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ విషయంలో రెండు రాష్ట్రాలు పట్టుబట్టిన వైనాన్ని గవర్నర్ వివరించారు. అయితే ఈ సమస్య ప్రస్తుతం సమసిపోయిందని, ఇరు రాష్ట్రాలు వేర్వేరుగా పరీక్షల షెడ్యూల్‌ను ఇచ్చుకున్నాయని గవర్నర్ తెలిపారు. భవిష్యత్తులో ఇంజనీరింగ్, వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఉమ్మడిగా ఎంసెట్ నిర్వహణపై ఇప్పటి నుంచే వివాదం రేగే అవకాశమున్నట్లు కేంద్రం దృష్టికి తెచ్చారు.
ఇక తొమ్మిది, పదో షెడ్యూల్‌లోని సంస్థల విభజనతోపాటు నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్, నిథిమ్, కార్మిక కమిషనర్ కార్యాలయాల్లో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరును గవర్నర్ వివరించినట్లు తెలిసింది. కాగా, గురు లేదా శుక్రవారాల్లో ప్రధాని నరేంద్ర మోదీని కలవడానికి కూడా అపాయింట్‌మెంట్ కోరారు.
ప్రధాని సమయమిస్తే.. రెండు రాష్ట్రాల మధ్య విద్య, విద్యుత్, జల, ఆర్థిక వివాదాలతోపాటు, ఉమ్మడి సంస్థలపై నెలకొన్న విభేదాలను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. కాగా, శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో సమావేశ మందిరం ప్రారంభ కార్యక్రమంలో ఇతర రాష్ట్రాల గవర్నర్లతో పాటు నరసింహన్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం కోసం ఢిల్లీ వెళ్లాలని గవర్నర్ భావిస్తుండగానే బుధవారమే రావాలని కేంద్ర హోం శాఖ నుంచి పిలుపువచ్చింది. దీంతో ఆయన సాయంత్రం బయలుదేరి వెళ్లారు.