రేపే పంచాయితీ..
‘విభజన’సమస్యలపై గవర్నర్ సమక్షంలో చర్చలు
- రాజ్‌భవన్‌లో సమావేశం.. హాజరుకానున్న
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మంత్రుల స్థాయి కమిటీలు
- అపరిష్కృత సమస్యల పరిష్కారం దిశగా ముందడుగు
- సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రతివారం సమావేశాలు
- నరసింహన్‌తో కేసీఆర్ ముందస్తు భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీల మధ్య విభజన వివాదాల పరిష్కారానికి గవర్నర్ నరసింహన్ మధ్యవర్తిత్వం వహించనున్నారు. గవర్నర్ సమక్షంలో తొలిసారిగా ఇరు రాష్ట్రాల మంత్రుల స్థాయి కమిటీలు బుధవారం రాజ్‌భవన్‌లో సమావేశమై చర్చలు జరపనున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య పీటముడిలా తయారైన సమస్యలన్నింటి పైనా దృష్టి సారించనున్నారు. అన్ని అంశాలూ ఓ కొలిక్కి వచ్చేదాకా ప్రతీ వారం ఈ కమిటీలు సమావేశం కానున్నాయి. సమావేశాలకు ఎజెండా తోపాటు, వివిధ సంస్థల విభజన అంశాలపై ఇరు రాష్ట్రాలు తొలిసారిగా ఒకే వేదికపై అభిప్రాయా లను పంచుకోబోతున్నాయి. సచివాలయం, ప్రభుత్వ భవనాలు, 9, 10వ షెడ్యూల్ సంస్థల విభజన, జల జగడాలు, విద్యుత్ ఉద్యోగుల విభజన సహా అన్ని ప్రధాన సమస్యలూ సమావేశాల ఎజెండా కానున్నాయి. కేంద్ర హోం శాఖ పరిష్కరించాల్సిన 9, 10 షెడ్యూల్ అంశాలను కూడా ఇక్కడే పరిష్కరించుకోవాలని ఇరు4 రాష్ట్రాలు అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది.
భవనాల అప్పగింతే కీలకం!
ఏపీ ప్రభుత్వ కార్యాలయాలన్నీ అమరావతికి తరలిపోతున్న నేపథ్యంలో... సచివాలయంతో సహా హైదరాబాద్‌లో ఉన్న అన్ని ప్రభుత్వ భవనాలను తెలంగాణకు అప్పగించే అంశంపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. విభజనకు ముందు రాష్ట్రపతి పాలన సమయంలో విభజన చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం హైదరాబాద్‌లోని ప్రభుత్వ భవనాల పంపకంపై గవర్నర్ నేతృత్వంలోని కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో... అనుకున్న సమయం కంటే ముందే ఏపీ కార్యాలయాలను అమరావతికి తరలించే ప్రక్రియ మొదలైంది. దీంతో హైదరాబాద్‌లోని అనేక ప్రభుత్వ భవనాలు ఖాళీగా ఉన్నాయి.
సరైన నిర్వహణ లేక అవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయనే అభిప్రాయమూ వస్తోంది. పలు చోట్ల ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను ఏపీ అధికారులు అద్దెకు ఇచ్చుకుంటున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ శాఖలు కొన్ని తమ కార్యకలాపాల కోసం అదనపు భవనాలు, స్థలం కావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో హైదరాబాద్‌లోని అన్ని ప్రభుత్వ భవనాలను తమకు స్వాధీనం చేయాలనే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం. వీటితోపాటు రాబోయే రోజుల్లో జరిగే సమావేశాల ఎజెండాను సైతం బుధవారం నాటి భేటీలో నిర్ణయించనున్నారు.
హైదరాబాద్‌లో స్థలం కోసం ఏపీ పట్టు
విభజన తర్వాత తమకు వాటాగా వచ్చే ఆస్తుల జాబితా, వాటి విలువలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమిక అంచనాలను తయారు చేసుకున్నట్లు సమాచారం. అలా వచ్చే భవనాలు, ఆస్తుల విలువ సుమారు రూ.50 వేల కోట్ల మేరకు ఉంటుందని అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఆ మొత్తానికి పరిహారంగా హైదరాబాద్ శివార్లలో భూములు కేటాయిస్తే... ఆస్తుల విభజనకు బేషరతుగా సమ్మతించి ఒప్పందం కుదుర్చుకోవాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
తెరపైకి కొత్త సచివాలయం
ప్రభుత్వ భవనాల అప్పగింత చర్చలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణం ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. ఈ మార్చి తరవాత పాత సచివాలయం కూల్చి వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఈసారి బడ్జెట్లో నిధులు సైతం కేటాయించనున్నట్లు సమాచారం. ఒకే బ్లాక్‌గా 6 అంతస్తుల్లో 8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సచివాలయం నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దానికి రూ.300 కోట్ల వ్యయంతో ఆర్ అండ్ బీ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
గవర్నర్‌తో కేసీఆర్ ముందస్తు భేటీ
గవర్నర్ వద్ద సమావేశాల కోసం తెలంగాణ తరఫున మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేకానందతో కమిటీ ఏర్పాటు చేసినట్లు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అటు ఏపీ కూడా ఆ రాష్ట్ర మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాస్‌లతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీల భేటీలో సంబంధిత శాఖల అధికారులు కూడా పాల్గొంటారు. ఈ నేపథ్యంలో సోమవారం సీఎం కేసీఆర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మతో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో ముందస్తుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు విభజన సమస్యలపై చర్చించినట్లు తెలిసింది.