టీ బిల్లుపై విప్ లేదు.. ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా మాట్లాడచ్చు: బొత్స
రాష్ట్ర విభజన బిల్లులోని ప్రతి క్లాజ్‌ను చర్చించాలంటే అసెంబ్లీకి రాష్ట్రపతి ఇచ్చిన గడువు సరిపోదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. కనీసం మరో 20 రోజుల అదనపు గడువు ఇవ్వాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరుతున్నట్లు ఆయన చెప్పారు. అసెంబ్లీలో విభజన చర్చపై విప్ ఉండబోదని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చని తెలిపారు. అయితే, పార్టీ తలదించుకునేలా మాత్రం ఎమ్మెల్యేలు వ్యవహరించొద్దని సూచించారు.
విభజన బిల్లుపై ఓటింగ్ ఉండదన్న దిగ్విజయ్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని బొత్స చెప్పారు. ప్రతి అంశాన్నీ రాజకీయం చేయాలనే దిగ్విజయ్‌పై టీడీపీ ఎమ్మెల్యేలు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారని, అసలు బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శిరంచారు. రాష్ట్ర విభజన కోరుతున్న బీజేపీతో పొత్తు అనేది చంద్రబాబు ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. టీడీపీ అనుసరిస్తున్న వైఖరి అత్యంత ప్రమాదకరమని, దీనివల్ల లౌకిక వాదానికి దెబ్బ తీసే పరిస్థితి ఉంటుందని ఆయన అన్నారు. బీజేపీతో పొత్తు తప్పిదమని, మోడీని బర్తరఫ్ చేయాలంటూ 2004లో బయటకు వచ్చిన చంద్రబాబు ఇప్పుడు అదే బీజేపీతో పొత్తుపెట్టుకోవాలనుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
సోనియాగాంధీపైనే విమర్శలు చేసిన ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డికి పీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు ఇస్తుందని బొత్స చెప్పారు. విభజనకు సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒప్పించేందుకు దిగ్విజయ్ డబ్బు సంచులతో వచ్చాడని చంద్రబాబు అన్నారని, ఈ వ్యాఖ్యలను చూస్తే బాబుకు పిచ్చిపట్టిందేమో అనిపించిందని ఆయన ఎద్దేవా చేశారు. తన ఉన్మాదంతో చంద్రబాబు ప్రజలకు పిచ్చిపట్టించాలనుకుంటారని అన్నారు.