ముంబై: ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్టు తయారైంది ముంబై వాసి ప్రశాంత్ మిశ్రా పరిస్థితి. అధికారులు చేసిన పొరపాటు అతడికి పెద్ద చికాకు తెచ్చిపెట్టింది. లోక్‌సభ వెబ్‌సైట్‌లో పొరపాటున అతడి మొబైల్ నంబరు పెట్టడంతో నిరాంతరాయంగా ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ గురుదాస్‌పూర్ ఎంపీ, నటుడు సన్నీ డియోల్‌కు వెళ్లాల్సినవి. లోక్‌సభ వెబ్‌సైట్‌లో సన్నీ డియోల్ నంబరుకు బదులుగా ప్రశాంత్ మిశ్రా ఫోన్ నంబరు పెట్టారు. దీంతో అతడి ఫోన్‌కు రకరకాల ఫిర్యాదులు, అభ్యర్థనలతో ఫోన్లు, వాట్సప్, టెక్ట్స్ మెసేజ్‌లు వస్తున్నాయి.
సన్నీ డియోల్ నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా ముంబైలో ఉంటున్నారని గురుదాస్‌పూర్ వాసుల నుంచి ఫిర్యాదు వెల్లువెత్తాయి. సన్నీడియోల్‌ను తమ ఎంపీగా ఎన్నుకుని తప్పు చేశామని చాలా మంది వాపోయారు. సన్నీడియోల్‌ను కలవాలని ఆయన అభిమానులు చాలా మంది తనకు ఫోన్లు చేస్తున్నారని ప్రశాంత్ మిశ్రా వాపోయాడు. గతేడాదే ఈ ఫోన్ నంబరు తీసుకున్నానని, లోక్‌సభ వెబ్‌సైట్‌లో పొరపాటుగా తన నంబరు పెట్టడంతో వేలాదిగా ఫోన్లు వస్తున్నాయని తెలిపాడు. తన నంబరును లోక్‌సభ వెబ్‌సైట్ నుంచి తొలగించాలని కోరుకుంటున్నాడు. సన్నీ డియోల్ ఫోన్ నంబరును లోక్‌సభ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేశారని ఆయన వ్యక్తిగత సహాయకుడు నిరంజన్ విద్యాసాగర్ తెలిపారు. పొరపాటుగా పెట్టిన ప్రశాంత్ నంబరును అధికారులు తొలగిచారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి బీజేపీ ఎంపీగా సన్నీ డియోల్ గెలిచిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment