పాకిస్థాన్లోని నరోవల్ పట్టణం (పెద్ద వృత్తం), అంతర్జాతీయ సరిహద్దు (నీలి రంగులో), ఉగ్రదాడి కొనసాగుతున్న దీనానగర్ (చిన్న వృత్తం)
గుర్దాస్పూర్: పంజాబ్లోని దీనానగర్లో భీభత్సం సృష్టించి పోలీస్ స్టేషన్ను తమ ఆధీనంలోకి తీసుకున్న ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పటివరకు ఆరుగురిని కాల్చిచంపి.. ఇంకా స్టేషన్ లోనే నక్కి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి తూటాలు పేల్చుతూ భద్రతా బలగాలకు సవాలు విసురుతోన్న ముష్కరులు సరిహద్దు దాటి భారత్లోకి ప్రవేశించారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినబడుతోంది.
నాలుగురి నుంచి పది మంది వరకు ఉన్న ఈ ఉగ్రవాదుల బృందం.. పాకిస్థాన్లోని నరోవాల్ నుంచి వచ్చినట్లుగా ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాలు భావిస్తున్నాయి. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో నరోవల్ ఓ ముఖ్య పట్టణమేకాదు.. నరోవల్ జిల్లాకు కేంద్రం కూడా. ఇది భారత్- పాక్ సరిహద్దుకు అతి సమీపంలో ఉంది. ఇటు పంజాబ్తోపాటు జమ్ముకశ్మీర్తోనూ సరిహద్దును పంచుకుంటున్న నరోవల్ జిల్లా నుంచే ఉగ్రవాదులు భారత్లోకి చొరబడి ఉంటారని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి.
దీనానగర్ పోలీస్ స్టేషన్ పై దాడికి ముందు జమ్ములోని హరినగర్లో ఈ బృందం కదలికలను ఐబీ గుర్తించినట్లు తెలిసింది. హరినగర్ నుంచి సోమవారం రాత్రి అమృత్సర్- పఠాన్కోట్ హైవే వద్దకు చేరుకున్న ముష్కరులు.. మొదట ఓ కారును హైజాక్ చేశారు. అదే మార్గంలో వెళుతోన్న ఓ బస్సుపై కాల్పులు జరిపారు. దీంతో ఓ ప్రయాణికుడు చనిపోయాడు.
అక్కడినుంచి కారులో నేరుగా దీనానగర్ కు చేరుకుని, గార్డులను కాల్చిచంపి, పోలీస్ స్టేషన్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వారంత సుశిక్షితులైన ఉగ్రవాదులేనని ఇప్పటికే నిర్ధారించిన భద్రతా దళాలు.. తగు జాగ్రత్తలతో ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. దీనానగర్లో అప్రకటిత కర్ఫ్యూ నెలకొంది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు.