gurdaspur-attack
-
వెల్లువెత్తుతున్న సందర్శకులు
ఉగ్రవాదులు దాడిచేసిన దీనానగర్ పోలీసు స్టేషన్ ఎలా ఉందో చూసేందుకు సందర్శకులు వెల్లువెత్తుతున్నారు. వివిధ ప్రభుత్వ సంస్థలతోపాటు రాజకీయ నాయకులు కూడా ఈ స్టేషన్‌కు వస్తున్నారు. ఇక సామాన్య ప్రజల విషయం చెప్పనే అక్కర్లేదు. గురుదాస్‌పూర్ జిల్లా కేంద్రానికి 16 కిలోమీటర్లు, పఠాన్‌కోట్‌కు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో ప్రజలు మాత్రం తమ సాధారణ జీవనాన్ని పునరుద్ధరించుకున్నారు. అయితే.. అటువైపు వెళ్లేవాళ్లు మాత్రం ఒక్కసారి అక్కడ ఆగి, పోలీసు స్టేషన్‌ను చూసి వెళ్లిపోతున్నారు. భారీగా ఆయుధాలతో వచ్చిన ముగ్గురు ఉగ్రవాదులు భద్రతాదళాలతో దాదాపు 11 గంటల పాటు తలపడిన ప్రదేశం ఇదేనా అన్నట్లు చూస్తున్నారు. తమ గ్రామంలో ఇలాంటి ఘోరం జరుగుతుందని ఎప్పుడూ కలలో కూడా అనుకోలేదని కమల్ అనే స్థానికుడు చెప్పారు. ఆయన ఈ ఘోరానికి ప్రత్యక్ష సాక్షి. అసలు తమ గ్రామాన్నే ఉగ్రవాదులు ఎందుకు ఎంచుకున్నారో తెలియడం లేదని, ఈ ఘటనలో గాయపడినవాళ్లు, మరణించిన వాళ్లు కూడా సామాన్యులు, నిరుపేదలేనని ఆయన అన్నారు. మరోసారి ఇలాంటివి జరగకూడదని ప్రార్థిస్తున్నామన్నారు. బుధవారం ఉదయం కొందరు సీనియర్ పోలీసు అధికారులతో కలిసి పంజాబ్ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కూడా ఈ స్టేషన్‌ను సందర్శించారు. -
ఆ ఉగ్రవాదులు వీళ్లే!
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా దీనానగర్ పోలీసు స్టేషన్ మీద దాడిచేసిన ఉగ్రవాదులు కెమెరాలో చిక్కారు. వాళ్లు వస్తున్న దృశ్యాలు మీడియా చేతికి చిక్కాయి. సోమవారం తెల్లవారుజామున 4.55 గంటల సమయంలో దీనానగర్ పోలీసు స్టేషన్ వద్దకు వాళ్లు ముగ్గురూ హాయిగా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలలో రికార్డయ్యాయి. ఆ ఫుటేజి ఇప్పుడు బయటపడింది. ఉగ్రవాదులు ముందుగానే ప్లాన్ చేసుకుని, జీపీఎస్ పరికరాల సాయంతో దీనానగర్ పోలీసు స్టేషన్ ఎక్కడుందో కచ్చితంగా తెలుసుకుని మరీ అక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో ఆయుధాలు ధరించి, జీపీఎస్ పరికరాల సాయంతో వాళ్లు ఈ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ముందుగా సెంట్రీ డ్యూటీ చేస్తున్న పోలీసు మీద కాల్పులు జరిపారు. తర్వాత మొత్తం 11 గంటల పాటు జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. -
వచ్చినది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులా?
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా దీనానగర్ పోలీసు స్టేషన్ వద్ద కాల్పులు జరిపి ఏడుగురి మృతికి కారణమైనది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసు స్టేషన్లోకి చొరబడే ముందు వాళ్లు ఐఎస్ఐఎస్ అనుకూల నినాదాలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. లష్కరే తాయిబా ప్రోద్బలంతో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దాడిచేసే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నాయి. -
పంజాబ్‌లో ‘ఉగ్ర’ బీభత్సం
ఉగ్ర దాడిలో ఎస్పీ, ముగ్గురు పౌరులు సహా ఏడుగురు మృతి * పోలీస్ స్టేషన్‌పై దాడి; సిబ్బందిపై తూటాల వర్షం * అంతకుముందు ఒక ఆర్టీసీ బస్సుపై, ఆరోగ్య కేంద్రంపై కాల్పులు * 15 మందికి తీవ్రగాయాలు * పంజాబ్ స్వాట్ దళాలు, ఆర్మీ ఎదురుదాడి; దాదాపు 12 గంటల పాటు ఎన్కౌంటర్ * మొత్తం ముగ్గురు ఉగ్రవాదుల హతం గురుదాస్‌పూర్(పంజాబ్): పంజాబ్‌లో సోమవారం ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. గురుదాస్‌పూర్ జిల్లా దీనానగర్‌లో తెల్లవారుజామున ప్రారంభించిన విధ్వంసాన్ని 12 గంటల పాటు కొనసాగించి ఒక ఎస్పీ సహా ఏడుగురిని బలి తీసుకున్నారు. వారిలో ముగ్గురు పౌరులున్నారు. మరో 15 మందిని తీవ్రంగా గాయపర్చారు. దీనానగర్ పోలీస్‌స్టేషన్‌లోకి దూసుకెళ్లి సిబ్బందిపై అత్యాధునిక ఆయుధాలతో విచ్చలవిడిగా తూటాలవర్షం కురిపించారు. పంజాబ్ పోలీస్, ఆర్మీ సమన్వయంతో ఎదురుదాడి చేసి చిట్టచివరకు సోమవారం సాయంత్రానికి మొత్తం ముగ్గురు టైస్టులనూ హతమార్చారు. ఈ దాడి వెనుక ఎవరున్నారనే విషయంపై స్పష్టత లేదు. కానీ పక్కనే ఉన్న పాక్ సరిహద్దును దాటి వచ్చిన లష్కరే తోయిబా, లేదా జైషే మొహమ్మద్ ముష్కరుల ఘాతుకమే ఇదని భావిస్తున్నారు. ఈ అనూహ్య ఉగ్ర దాడితో.. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. దాడిని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయొద్దని ఈ సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ వార్తాచానెళ్లకు ఆదేశాలు జారీ చేసింది. ఎలా మొదలైంది!?.. సోమవారం వేకువజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఆత్మాహుతి దళం తమ ఆపరేషన్‌ను ప్రారంభించింది. మొదట, సైనిక దుస్తుల్లో గురుదాస్‌పూర్- పఠాన్ కోట్ రోడ్డుపై ఒక టెంపోను హైజాక్ చేసేందుకు ఆ టైస్టులు విఫలయత్నం చేశారు. తర్వాత దగ్గర్లో ఉన్న ఒక చిన్న హోటల్లోకి వెళ్లి, ఆ హోటల్ యజమాని కమల్జిత్ సింగ్ మాథుర్‌పై కాల్పులు జరిపి, ఆయన మారుతి 800 కారును అపహరించారు. అక్కడ్నుంచి వెళ్తూ దీనానగర్ బైపాస్ వద్ద ఒక చిరువ్యాపారిని కాల్చిచంపారు. తర్వాత అదే రహదారిపై వెళ్తున్న పంజాబ్ ఆర్టీసీ బస్సుపై గుళ్లవర్షం కురిపించి, పలువురు ప్రయాణికులను తీవ్రంగా గాయపర్చారు. అక్కడ్నుంచి అదే కారులో దీనానగర్ పోలీస్‌స్టేషన్‌లోకి దూసుకెళ్లారు. అంతకుముందు పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ఆరోగ్య కేంద్రంపై కాల్పులు జరిపారు. ఏకే 47 తదితర ఆధునిక ఆయుధాలు, భారీ మందుగుండుతో పోలీస్‌స్టేషన్‌లోకి దూసుకెళ్లి మొదట అక్కడి సెంట్రీపై కాల్పులు జరిపారు. అక్కడి పోలీసులు తేరుకుని, తమ ఎస్ఎల్ఆర్ తుపాకులకు పనిచెప్పేలోగా వారిపైనా విచక్షణారహితంగా గుళ్లవర్షం కురిపించారు. ఆ పక్కనే ఉన్న సిబ్బంది ఇళ్లను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. గ్రెనేడ్లతో దాడులకు తెగబడ్డారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు మరిన్ని బలగాలను, పంజాబ్ స్వాట్(స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ టీమ్) దళాలను ఘటనాస్థలికి పంపించారు. ఆర్మీ కూడా అక్కడికి చేరుకుంది. ఈ దళాలు టైస్టులపై ఎదురుదాడి ప్రారంభించాయి. ఈ లోగా స్టేషన్ పక్కనే ఖాళీగా ఉన్న భవనంలోకి వెళ్లిన ఉగ్రవాదులు.. అక్కడి నుంచి పోలీసులు, భద్రతా బలగాలపై కాల్పులు ప్రారంభించారు. ఆత్యాధునిక గ్రెనేడ్లతో దాడి చేశారు. దాదాపు 12 గంటల ఎన్కౌంటర్ తర్వాత ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. పాక్ సరిహద్దుకు అత్యంత దగ్గర్లోని దీనానగర్ పోలీసుల వద్ద ఆధునిక ఆయుధాలు లేకపోవడం, కాలం చెల్లిన ఎస్ఎల్ఆర్లతో వారు టైస్టులను ఎదుర్కోవాల్సి రావడం విమర్శలకు తావిస్తోంది. ఆ పోలీసుల వద్ద కనీసం బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్ల వంటి అవసరమైన రక్షణ పరికరాలు కానీ లేవని తెలుస్తోంది. మరోవైపు, పఠాన్‌కోట్- అమృతసర్ రైల్వే లైన్‌పై భద్రతాబలగాలు ఐదు బాంబులను గుర్తించి నిర్వీర్యం చేశారు. ఆ మార్గంలో రైళ్లను రద్దు చేశారు. ఎస్పీ సహా ఏడుగురు.. ఉగ్రవాదుల దాడిలో గురుదాస్‌పూర్ డిటెక్టివ్ ఎస్పీ బల్జీత్ సింగ్‌తో పాటు ముగ్గురు పౌరులు, ముగ్గురు హోంగార్డులు ప్రాణాలు కోల్పోయారు. దాడిలో గాయపడిన మరో 15 మంది గురుదాస్‌పూర్, అమృతసర్ల్లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ముగ్గురిని గులాం రసూల్, ఆశారాణి, అమర్జీత్గా గుర్తించారు. బల్జీత్ సింగ్ తండ్రి పోలీస్ ఇన్స్పెక్టర్ ఆచార్ కూడా 1984లో మిలిటెంట్ల దాడిలోనే చనిపోయారు. పంజాబ్ ఉగ్రదాడి నేపథ్యంలో పంజాబ్, కశ్మీర్‌లలోని అంతర్జాతీయ సరిహద్దు వెంట హైఅలర్ట్ ప్రకటించా రు. 2007లో లూథియానాలోని ఓ సినిమా హాళ్లో ఏడుగురు చనిపోయిన బాంబు పేలుడు తర్వాత పంజాబ్‌లో ఇదే తొలి ఉగ్రదాడి. చైనా మేడ్ గ్రెనేడ్లు ఉగ్రవాదులు ఆదివారం అర్ధరాత్రి దాటాక పాక్ నుంచి జమ్మూ, పఠాన్‌కోట్‌ల మధ్య ఉన్న కంచెలేని సరిహద్దు ద్వారా కానీ, జమ్మూలోని చాక్హీరా వద్దనున్న సరిహద్దు గుండా కానీ భారత్‌లోకి వచ్చి ఉండొచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అక్కడి నుంచి 15 కి.మీ. ప్రయాణించి హైవేకి చేరుకుని ఉండొచ్చని అంచనా. ఆపరేషన్ తర్వాత ఉగ్రవాదులు దాక్కున్న భవనంలో జీపీఎస్ పరికరాలను, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. టైస్టులు ఆధునిక ఆయుధాలతో వచ్చారని, వారి వద్ద చైనా తయారీ గ్రెనేడ్లున్నాయని డీజీపీ సుమేధ్ సింగ్ సైనీ చెప్పారు. మార్చిలో కశ్మీర్‌లోని కథువాలో పోలీస్ స్టేషన్‌పై జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు ఇలాగే దాడి చేశారు. పంద్రాగస్టు నేపథ్యంలో ఉగ్రదాడులు జరగొచ్చని నిఘావర్గాలు ఇదివరకే చెప్పాయి. దీనానగర్ పోలీస్‌స్టేషన్‌పై ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు ఉగ్రవాది మృతదేహాన్ని తరలిస్తున్న పోలీసులు ఘటనాస్థలిలో కారుపై బుల్లెట్ గుర్తులు ఎన్కౌంటర్లో రక్తమోడుతున్న పోలీసులు -
లాంగ్ లివ్ డెమోక్రసీ
(సాక్షి వెబ్ ప్రత్యేకం) పాకిస్థాన్ సరిహద్దుకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలో దీనానగర్.. ఉదయాన్నే తుపాకీ కాల్పులతో ఉలిక్కిపడింది. సాయంత్రానికి తుపాకీ కాల్పుల శబ్దాలు ఆగిపోయాయి. ముగ్గురు తీవ్రవాదులు చనిపోయారు. ముగ్గురు అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఒక ఎస్పీ సహా నలుగురు పోలీసులు అమరులయ్యారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత పంజాబ్ మరోసారి ఉగ్రవాదం దెబ్బకి విలవిల్లాడింది. 11 గంటల పాటు సాగిన 'ఎన్కౌంటర్' ఎన్నో ప్రశ్నలని మరోసారి తెరపైకి తెచ్చింది. అమర్నాథ్ యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో జమ్మూ - కశ్మీర్ సరిహద్దు పొడవునా భారత సైన్యం అప్రమత్తంగా ఉంది. చొరబాటు దాదాపు అసాధ్యమైంది. అందుకే ఉగ్రవాదులు తమ దృష్టిని పంజాబ్ సరిహద్దు వైపు మళ్లించి.. తమ ఉనికిని మళ్లీ చాటుకున్నారు. లష్కర్ ఏ తాయిబా, జైష్ ఏ మహ్మద్ సంస్థల హస్తం ఉందని నిఘావర్గాల నమ్మకం. దాడికి పాకిస్థాన్ మద్దతు ఉందని, ఆయుధాలు, గ్రనేడ్లు అందుకు సాక్ష్యాలని ప్రభుత్వం విశ్వసిస్తోంది. మళ్లీ పడగ విప్పడానికి ప్రయత్నిస్తున్న ఖలిస్థాన్ వేర్పాటువాదులకి ఈ సంఘటనకు సంబంధం లేదనేది ప్రాథమిక సమాచారం. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో భారతదేశం ఎలాంటి సంబంధాన్ని కోరుకుంటుంది? ఇలాంటి సంఘటనలు జమ్ము - కశ్మీర్లో సర్వసాధారణం. కానీ గతంలో ఇంతకన్నా పెద్ద సంఘటనలు జరిగాయి. సాక్షాత్తు భారతదేశ పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏం చేయగలిగాం? ముంబై వీధుల్లో పేలుళ్ల తర్వాత ఏం చేయగలిగాం? దావూద్ ఇబ్రహీంను వెనక్కి తీసుకొచ్చేందుకు దౌత్యపరంగా ఏమైనా చేయగలిగామా? పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడటం మానడం మినహా. కార్గిల్‌లో చొరబాట్లు గుర్తించేందుకే ఎంతో సమయం తీసుకున్నాం. అందుకు భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాం. కాకతాళీయంగా నిన్నటి రోజునే (ఆదివారం) కార్గిల్ విజయ్ దివస్ జరుపుకున్నాం. నేడు (సోమవారం) ఉదయాన్నే ఈ సంఘటన. పెషావర్‌లో స్కూల్ పిల్లల ఊచకోతను ప్రపంచం దిగ్భ్రాంతితో చూసినప్పుడు ఉగ్రవాదాన్ని అణచివేస్తామని పాక్ పాలకులు ఎప్పటి లాగానే బీరాలు పోయారు. ఎంతవరకు అణచగలిగారో ప్రపంచానికి తెలుసు. పాములకు పాలు పోయడమే తెలుసు. ఆ పాములను పక్కన ఉన్న పుట్టల్లోకి ఉసిగొల్పి అవి కాటేస్తుంటే చూడటమే తెలుసు. ఇపుడు కూడా అదే జరుగుతుంది. ఆధారాలు కావాలంటారు. చూపిస్తే ఇవి సరిపోవు. మరికొన్ని ఆధారాలు కావాలంటారు. దౌత్యవేత్తల మాటల గారడిలో అమాయకుల ప్రాణాలకు ఏ మాత్రం విలువ ఉంటుందో తెలిసిందే. చాయ్ పే చర్చ, నావ్ పే చర్చ.. అవసరమైతే ఇంకో చర్చ.. కొనసాగుతూనే ఉంటాయి. 'ఈ దుస్సాహసాన్ని సహించేది లేదు. గట్టిగా బుద్ధి చెబుతాం' లాంటి ప్రకటనలు వినపడుతూనే ఉంటాయి. ఒకవైపు పోలీసులు తీవ్రవాదులతో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతుంటే నేడు అదే సమయంలో చట్టసభల్లో సభ్యులు క్రమశిక్షణతో మెలగాలనే అంశంపై రాద్ధాంతం. రోజంతా అదే రభస. మీరు ఉన్నపుడు దాడులు జరగలేదా? అంటే మీరున్నపుడూ.. అంటూ మరో ఎదురుదాడి. తుపాకుల మోత కూడా ఈ మాటల దాడుల ముందు చిన్నబోయింది. ఇది శాంతి భద్రతల సమస్యా? లేక దౌత్యపరమైన సమస్యా? దేశ అస్తిత్వాన్ని సవాలు చేసే పెనుముప్పా? ఎదుర్కోవడం ఎలా? ఎంతకాలం ఈ దాగుడు మూతలు? ఒకసారి ఖలిస్థాన్.. ఇపుడు పాకిస్థాన్.. రేపు మరేదో సమస్య. జమ్మూ - కశ్మీర్ సమస్యకు పరిష్కారం ఉందా? అక్కడి యువత, ప్రజల కోరికలేమిటి? వారి అస్తిత్వానికి సంబంధించిన సమస్యలను పట్టించుకుంటున్నామా? రాజకీయ అవసరాల కోసం ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటూ వస్తున్నామా? సిరియా, ఇరాక్లను భయపెడుతూ ప్రపంచానికి సవాలు విసురుతున్న ఐఎస్ఐఎస్ జెండాలు జమ్మూ - కశ్మీర్ వీధుల్లో కాలనాగుల్లా భయపెడుతున్న రాబోయే పెనుముప్పును కావాలనే పట్టించుకోవడం మానేస్తున్నామా? ఈ వారాంతం వరకు పార్లమెంటులో వాదోపవాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు.. కాలం గడచిపోతుంది. ఇంకో రోజు.. ఇంకోచోట తుపాకులు గర్జిస్తాయి. గ్రనేడ్లు పేలుతాయి. అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మళ్లీ ఇదే సీన్ రిపీట్ అవుతుంది. ఈ క్రమంలో 'కొలేటరల్ డామేజ్' కింద అమాయకులు బలైపోతూనే ఉంటారు. అందుకే ..........లాంగ్ లివ్ డెమోక్రసీ -
బాంబులకు 200 మీటర్ల దూరంలో ఆగిన రైలు!
స్థలం.. పరమానంద్ రైల్వే స్టేషన్ రాష్ట్రం.. పంజాబ్ ఘటన.. రైలు పట్టాలపై బాంబులు సందర్భం.. దీనానగర్ పోలీసు స్టేషన్‌పై ఉగ్రదాడి హీరోలు.. పరమానంద్ గ్రామస్థులు అమృతసర్- పఠాన్‌కోట్ మార్గంలో పరమానంద్ అనేది ఓ చిన్న రైల్వేస్టేషన్. అయితే అది ప్రధానమార్గం కావడంతో అటువైపుగా చాలా రైళ్లు వెళ్తుంటాయి. సోమవారం ఉదయం కూడా ఓ ప్యాసింజర్ రైలు అటువైపుగా వెళ్తోంది. మరికొద్ది సెకన్లు దాటితే ఆ రైలు బ్రిడ్జి మీదకు వెళ్లేది.. బాంబులు పేలి రైలు తునాతునకలు అయిపోయేది, అనేక ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయేవి. కానీ గ్రామస్థులు అప్రమత్తంగా వ్యవహరించి, బాంబులను గుర్తించారు. దాంతో సరిగ్గా బాంబులకు 200 మీటర్ల దూరంలో రైలు ఆగిపోయింది. అందులో ఉన్నవాళ్లంతా సురక్షితంగా ఉన్నారు. రైలు ఎందుకు ఆగిందో తెలియని వాళ్లు.. ఆ తర్వాత విషయం తెలిసి ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. పరమానంద్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉన్న రైలు బ్రిడ్జి మీద ఉగ్రవాదులు 5 బాంబులను అమర్చారు. వాటిని గ్రామస్థులు గుర్తించి వెంటనే అధికారులను అప్రమత్తం చేయడంతో.. బాంబులకు కొద్ది దూరంలో రైలు ఆగిపోయింది. ఆ మార్గంలో వెళ్లాల్సిన అన్ని రైళ్లను అధికారులు ఎక్కడికక్కడే ఆపేశారు. పంజాబ్ సాయుధ పోలీసు బలగంలోని బాంబు నిర్వీర్య దళాలు వచ్చి ఆ బాంబులను డిఫ్యూజ్ చేశాయి. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
ఉగ్రవాదుల వద్ద భారీగా ఆయుధాలు, జీపీఎస్ పరికరాలు
దీనానగర్ పోలీసు స్టేషన్ మీద దాడిచేసిన ఉగ్రవాదులు భారీ ఎత్తున ఆయుధాలతో పాటు జీపీఎస్ పరికరాలు కూడా తీసుకొచ్చారు. ఈ విషయాన్ని పంజాబ్ డీజీపీ సుమేధ్ సింగ్ సైని తెలిపారు. ఉగ్రవాదులను హతమార్చేందుకు వచ్చిన బృందాలకు ఆయన స్వయంగా నాయకత్వం వహించారు. మొత్తం ఎన్కౌంటర్ ముగిసిన తర్వాత.. సైని విలేకరులతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... ఉగ్రవాదులు పాకిస్థాన్‌లోని నరోవల్ ప్రాంతం నుంచి వచ్చారు సుమారు 11 గంటల పాటు మొత్తం ఆపరేషన్ జరిగింది ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో డిటెక్టివ్ ఎస్పీ బల్జీత్ సింగ్, ముగ్గురు హోంగార్డులు మరణించారు. ముగ్గురు సామాన్య పౌరులను ఉగ్రవాదులు చంపేశారు. దీనానగర్ పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ గాయపడ్డారు వాళ్ల వద్ద భారీ సంఖ్యలో ఫైర్ ఆర్మ్‌లు, గ్రెనేడ్లు ఉన్నాయి ఉగ్రవాదుల వద్ద జీపీఎస్ సిస్టంలు కూడా ఉన్నాయి ఈ దాడి వెనక లష్కరే తాయిబా ఉండొచ్చు ఇప్పటివరకు ఏ గ్రూపూ తాము దాడి చేసినట్లు చెప్పుకోలేదు ఈ మొత్తం విషయం మీద లోతుగా దర్యాప్తు చస్తాం -
ఉగ్రవాదులనే భయపెట్టిన బస్సు డ్రైవర్!
పౌరుషానికి మారుపేరైన పంజాబ్‌లో.. ఒక బస్సు డ్రైవర్ సాహసం అనేక మంది ప్రాణాలను కాపాడింది. పంజాబ్ రోడ్‌వేస్‌కు చెందిన నానక్ చంద్ అనే బస్సు డ్రైవర్ ఉగ్రవాదులను చూసి ఏమాత్రం భయపడలేదు. వాళ్లు బస్సు మీద కాల్పులు జరిపినప్పుడు.. నానక్ చంద్ ధైర్యంగా వాళ్ల మీదకు బస్సును పోనిచ్చాడు. దాంతో మొత్తం నలుగురు ఉగ్రవాదులూ వెనకడుగు వేశారు. దాంతో వెంటనే బస్సును పక్కకు మళ్లించిన డ్రైవర్.. దాన్ని వేగంగా అవతలకు తీసుకెళ్లిపోయాడు. బస్సు మీద ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ప్రయాణికులు ఎవరైనా గాయపడి ఉంటారన్న ఆలోచనతో బస్సును నేరుగా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లిపోయాడు. దాంతో అక్కడే క్షతగాత్రులకు చికిత్స జరిగింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. బస్సులో 75 మంది ప్రయాణికులు ఉన్నారని, వాళ్ల ప్రాణాలు కాపాడటం ముఖ్యమని భావించడంతో బస్సును ఆపలేదని చెప్పాడు. డ్రైవర్ అప్రమత్తతే మొత్తం 75 మంది ప్రాణాలనూ కాపాడిందని పంజాబ్ రోడ్‌వేస్ జనరల్ మేనేజర్ చెప్పారు. -
పంజాబ్‌లో ముగిసిన ఎన్కౌంటర్
-
కొనసాగుతున్న గాలింపు చర్యలు
ఉగ్రవాద దాడిని సమర్థంగా ఎదుర్కొన్న భద్రతా దళాలు.. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. అయితే, ఇంకా ఎక్కడైనా ఉగ్రవాదులు నక్కి ఉన్నారేమోనన్న అనుమానంతో దీనానగర్, చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. గురుదాస్‌పూర్ జిల్లా మొత్తం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం పది గంటల పాటు కొనసాగిన ఎదురు కాల్పుల్లో మొత్తం 9 మంది మరణించారు. మృతుల్లో పంజాబ్ డిటెక్టివ్ విభాగం ఎస్పీ బల్జీత్ సింగ్ కూడా ఉన్న విషయం తెలిసిందే. కాగా, గురుదాస్‌పూర్ ఎదురుకాల్పుల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం సాయంత్రం జాతీయ భద్రతా సలహాదారుతోను, కేంద్ర హోం శాఖ కార్యదర్శితోను సమావేశం కానున్నారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు. ఇక ఈ అంశంపై పార్లమెంటులో మంగళవారం నాడు రాజ్‌నాథ్ సింగ్ ఓ ప్రకటన చేయనున్నారు. -
ముగిసిన ఎన్కౌంటర్: తీవ్రవాదుల హతం
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా దీనానగర్ ప్రాంతంలో తెల్లవారుజామున ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమైన ఎన్కౌంటర్ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ముగిసింది. దీనానగర్ పోలీసు స్టేషన్లోకి చొరబడి.. పోలీసులతో పాటు పలువురు సామాన్య పౌరులను కూడా కాల్చి చంపిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు ఎదురు కాల్పుల్లో హతమార్చాయి. దీంతో ఎన్కౌంటర్ ముగిసినట్లయింది. పంజాబ్ పోలీసు కమాండోలు, ఎన్ఎస్జీ బలగాలతో పాటు కేంద్రం పంపిన ప్రత్యేక బలగాలు ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నాయి. దాదాపు 11 గంటలకు పైగా సాగిన కాల్పులు ఉగ్రవాదుల దాడిలో ఎస్పీ బల్జీత్ సింగ్, ముగ్గురు హోం గార్డుల మృతి మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను కాల్చిచంపిన భద్రతా దళాలు తీవ్రవాదుల దాడిలో మరో ముగ్గురు పౌరుల మృతి తీవ్రవాదుల ఆపరేషన్‌లో ముమ్మరంగా పాల్గొన్న పంజాబ్ పోలీసు కమాండోలు దాడికి పాల్పడ్డవారు లష్కరే తాయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులని అనుమానం -
లష్కరే తాయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులా?
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా దీనానగర్ పోలీసు స్టేషన్‌పై దాడిచేసి, మొత్తం 13 ప్రాణాలు పోయేందుకు కారణమైన ఉగ్రవాదులు ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చారన్న ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి. వీళ్లు లష్కరే తాయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద గ్రూపులకు చెందినవారు అయి ఉంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో కూడా ముంబై ఉగ్రదాడుల సమయంలో లష్కరే తాయిబా వద్ద శిక్షణ పొందిన ఉగ్రవాదులు వచ్చి ఇక్కడ దాడులు చేసిన విషయం తెలిసిందే. అదే దారిలో మరోసారి లష్కరే తాయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఇప్పుడూ ప్రవేశించి ఉంటారని అనుమానిస్తున్నారు. మొత్తం ఉగ్రవాదులందరూ 15 నుంచి 54 ఏళ్ల మధ్య వయసున్నవారేనని అంటున్నారు. వారిలో ఒక తీవ్రవాది హతం కాగా, మరో తీవ్రవాదికి తీవ్ర గాయాలయ్యాయి. 2007 తర్వాత పంజాబ్‌లో ఉగ్రవాద ఘటన చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి. దీనానగర్ ప్రాంతంలో స్కూళ్లు, కాలేజీలను అధికారులు పూర్తిగా బంద్ చేశారు. పంజాబ్ రాజధాని చండీగఢ్ నగరానికి 260 కిలోమీటర్ల దూరంలో ఈ దీనానగర్ ఉంది. తీవ్రవాదుల ఎన్కౌంటర్లో పంజాబ్ పోలీసు కమాండోలు ముమ్మరంగా పాల్గొన్నారు. -
గంటా రెండు గంటల్లో ఎన్కౌంటర్ ముగిసే అవకాశం
పంజాబ్ ఎన్కౌంటర్ గంటా రెండు గంటల్లో ముగిసే అవకాశం ఉందని కేంద్ర హోం మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు. గురుదాస్‌పూర్ జిల్లాలోని దీనానగర్ వద్ద పోలీసు కమాండోలకు, ఉగ్రవాదులకు మధ్య పోరాటం ఇంకా కొనసాగుతోందని ఆయన చెప్పారు. మొత్తం ఎన్కౌంటర్ ఒకటి రెండు గంటల్లో ముగియొచ్చన్నారు. ఇద్దరు పోలీసు అధికారులు, ఇద్దరు హోం గార్డులు, ముగ్గురు సామన్య పౌరులు కూడా మరణించిన వారిలో ఉన్నారు. ఉగ్రవాదుల్లో ఒకరిని దీనానగర్ పోలీసు స్టేషన్ ప్రాంగణంలోనే హతమార్చారు. ఉగ్రవాదులు ఎవరనేది ఇంతవరకు స్పష్టంగా తెలియలేదని, తొలుత ఒక వ్యాన్ చేజిక్కించుకునేందుకు ప్రయత్నించి, తర్వాత ఒక చిన్న కారు లాక్కుని దాంట్లో పోలీసు స్టేషన్ వద్దకు సోమవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు ప్రవేశించారన్నారు. ఆ సమయానికి కేవలం ముగ్గురు నలుగురు పోలీసులే అక్కడ ఉన్నట్లు తెలిపారు. వాళ్లు ముందుగా స్టేషన్‌కు కాపలాగా ఉన్న పోలీసుపై కాల్పులు జరిపారని, కాల్పుల శబ్దం విన్న మరో పోలీసు లోపలినుంచి వచ్చి ఉగ్రవాదులపై కాల్పులు జరిపాడని చెప్పారు. మరణించినవారిలో డిటెక్టివ్ ఎస్పీ బల్జీత్ సింగ్ కూడా ఉన్నారు. -
హైదరాబాద్‌లో హై అలర్ట్
హైదరాబాద్: పంజాబ్‌లోని గురుదాస్ పూర్లో ఉగ్రవాద దాడుల నేపథ్యంలో హైదరాబాద్‌లో హై అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ప్రముఖుల నివాసాలు, కార్యాలయాలు, కీలక ప్రాంతాల్లో భదత్రను కట్టుదిట్టం చేశారు. జంట నగరాల్లో నిఘాను పెంచారు. సోమవారం ఉదయం గురుదాస్ పూర్లో ఉగ్రవాదులు దాడి చేయడంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం శాఖ హెచ్చరించింది. ఉగ్రవాద దాడిలో ఎస్పీ బల్జీత్ సింగ్ సహా 13 మంది మరణించినట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. -
'వారిలో ఓ మహిళా ఉగ్రవాది కూడా'
దీనానగర్: పంజాబ్ లో దీనానగర్ పోలీస్ స్టేషన్ పై దాడికి తెగబడ్డ ఉగ్రవాదుల బృందంలో ఓ మహిళా సభ్యురాలు కూడా ఉన్నట్లు తెలిసింది. ముష్కరుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ మొదట ఈ విషయాన్నితెలపగా.. భద్రతా దళాలు కూడా దీనిని ధ్రువీకరిస్తున్నాయి. ఆర్మీ దుస్తులు ధరించిన నలుగురు సాయుధులు గురుదాస్ పూర్ జిల్లా దీనానగర్ పోలీస్ స్టేషన్ పై కాల్పులు జరిపి పక్కనే ఓ భవనంలో దాక్కుని కాల్పులు జరుపుతున్నారు. ఉదయం నుంచి కొనసాగుతున్న కాల్పుల్లో ఇప్పటివరకూ 13 మంది మరణించారు. గాయపడ్డ కానిస్టేబుల్ ఘటన జరిగిన తీరును వివరిస్తూ.. ' సోమవారం ఉదయం 5:45 గంటల సమయంలో సైనిక దుస్తులు ధరించిన పది మంది.. స్టేషన్లోకి రావడం గమనించాం, మా స్టేషన్ కు సమీపంలో ఇండియన్ ఆర్మీ క్యాంపులు ఉండటంతో వచ్చినవారు ముష్కరులేనని గుర్తించలేకపోయాం. అయితే ఒక్కసారిగా విచక్షణా రహితంగా కాల్పులు జరపడం చూశాకగానీ అర్థంకాలేదు.. వాళ్లు ఉగ్రవాదులని. వాళ్లలో ఓ మహిళా ఉంది. మేం ఫైరింగ్ ఓపెన్ చేసేలోపే మా వాళ్లలో చాలా మందికి గాయాలయ్యాయి. ఓ బుల్లెట్ నా భుజంలోకి దూసుకెళ్లింది. ఇద్దరు గార్డులు కుప్పకూలిపోయారు. స్టేషన్ లోకి చొరబడ్డ ఉగ్రవాదులు ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఫైరింగ్ జరుపుతున్నారు' అని చెప్పారు. పంజాబ్‌లో ఉగ్రవాదుల దాడి ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టేందుకు బీఎస్ ఎఫ్ బలగాలను రంగంలోకి దింపింది. ఢిల్లీ సహా మెట్రో నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీచేసింది. దీనానగర్ పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదుల దాడి, అనంతర పరిణామాలపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. -
'ముందుగా దాడి చేయం.. కానీ'
న్యూఢిల్లీ: పాకిస్థాన్ తో శాంతి సంబంధాలు కోరుకుంటున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. అయితే తమ దేశ గౌరవానికి భంగం వాటిల్లితే సహించబోమని స్పష్టం చేశారు. తమకు తాముగా కయ్యానికి కాలు దువ్వబోమని చెప్పారు. తాము ఎవరిపై ముందుగా దాడి చేయబోమని, తమపై ఎవరైనా దాడికి దిగితే తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు. పొరుగుదేశంతో సత్సంబంధాలు కోరుకుంటున్నా పదే పదే సరిహద్దు ఉగ్రవాద దాడులు ఎందుకు జరుగుతున్నాయో తనకు అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్ లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
సరిహద్దును ఎందుకు మూసేయలేదు?
గురుదాస్‌పూర్ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాల్పుల సమాచారం తెలిసిన వెంటనే తన సంగత్ దర్శన్ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. రాష్ట్ర డీజీపీ సుమేధి సింగ్ సహా, మిగిలిన ఉన్నతాధికారులు గురుదాస్‌పూర్ జిల్లాలోని దీనానగర్‌కు వెళ్లాలని ఆదేశించారు. తీవ్రంగా గాయపడి అమృతసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మరోవైపు ఈ ఘటనపై ఆయన కేంద్రంపై ఆరోపణలు గుప్పించారు. ఉగ్రవాదం ఒక రాష్ట్ర సమస్య కాదని, దాన్ని ఎదుర్కొనేందుకు జాతీయ విధానం కావాలంటూ పరోక్షంగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. అంతర్జాతీయ సరిహద్దులను ఎందుకు మూసేయలేదంటూ ప్రశ్నించారు. మరోవైపుర దీనానగర్ ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య భీకరంగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సర్వేష్ కౌశల్, ఇతర ముఖ్య అధికారులతో సీఎం అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. పరిస్థితిని ఎప్పటికపుడు సమీక్షిస్తున్నారు. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు పరిస్థితిని వివరిస్తున్నారు. కాగా సోమవారం ఉదయం జరిగిన భారత్ పాక్ సరిహద్దులో ఉగ్రదాడితో దేశ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కేంద్ర హోంశాఖ అన్ని భద్రతా దళాలను అప్రమత్తం చేసింది. దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. -
దద్దరిల్లిన దీనానగర్
గురుదాస్ పూర్: తుపాకీ తూటాల మోతతో పంజాబ్ లోని దీనానగర్ పట్టణం దద్దరిల్లింది. తమ ప్రాంతంలోకి చొరబడిన ముష్కరులు సాగించిన విధ్వంసకాండతో దీనానగర్ వాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చి ఉగ్రవాదులు మారణకాండకు తెగబడ్డారన్న సమాచారంతో దీనానగర్ ప్రజలు బెంబేలెత్తారు. ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు టీవీలకు అతుక్కుపోయారు. పాఠశాలలు, కాలేజీలు, ఇతర సంస్థలు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. గురుదాస్ పూర్ జిల్లాలో మూడో అతిపెద్ద పట్టణమైన దీనానగర్ పై సాయుధ దుండగులు దండెత్తారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపి చివరకు పోలీస్ స్టేషన్ లో నక్కారు. మొదట కమల్ జీత్ సింగ్ మాథారు అనే వ్యక్తి నుంచి మారుతి 800 వాహనాన్ని లాక్కుని అతడిపై కాల్పులు జరిపారు. తర్వాత రోడ్డుపక్కనున్న హోటల్ పై కాల్పులు జరిపి చిరువ్యాపారిని పొట్టనపెట్టుకున్నారు. కదులుతున్న బస్సుపై కాల్పులు జరపడంతో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. తర్వాత హెల్త్ సెంటర్ లక్ష్యంగా దాడికి దిగారు. పోలీస్ స్టేషన్ లోకి చొరబడే ముందు పోలీసులు నివాసముంటున్న క్వార్టర్స్ పై గ్రెనేడ్లు విసిరారు. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఉగ్రవాదులు, సైనిక బలగాలు జరుపుతున్న కాల్పులతో దీనానగర్ దద్దరిల్లింది. ముష్కర మూక దాడితో దీనానగర్ వాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. కార్యాలయాలకు సెలవు పెట్టారు. పిల్లలను స్కూల్స్ మానిపించారు. మరోవైపు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. -
కశ్మీర్ లో పాక్ జెండాలు ఎగురుతున్నా..
హైదరాబాద్: పంజాబ్ పై ఉగ్రవాదుల దాడిన కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు. టెర్రరిస్ట్ అంశాలను కూడా బీజేపీ రాజకీయ లబ్థికోసం వాడుకోవాలనుకుంటుందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో కసబ్ ను ఉరితీసిన తర్వాతే మీడియాకు తెలిసిందని ఆయన గుర్తుచేశారు. యాకుబ్ మెమన్ ఉరి నిర్ణయాన్ని ప్రచారం చేసి దేశవ్యాప్తంగా మతపరమైన అంశాలు రెచ్చగొడుతోందని ఆయన మండిపడ్డారు. కశ్మీర్ లో పాక్ జెండాలు ఎగురుతున్నా ప్రధాని ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్నారు. దేశ అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లితే మోదీనే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ పై కూడా ఆయన మండిపడ్డారు. ధనిక రాష్ట్రమంటున్న కేసీఆర్ రైతులను ఎందుకు ఆదుకోవటం లేదన్నారు. ఆలోచన వచ్చిందే తరువు కొత్త పథకాలు ప్రకటిస్తున్నారన్నారు. నూతనంగా ప్రకటించిన గ్రామజ్యోతి పథకానికి రూ. 25 వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఎస్పీ మృతి, 13కి చేరిన మృతుల సంఖ్య
గురుదాస్ పూర్ : పంజాబ్‌లోని గురుదాస్ పూర్ ఎదురు కాల్పుల్లో ఎస్పీ బల్జీత్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులతో జరిగిన పోరులో ఆయన సోమవారం వీరమరణం పొందారు. గురుదాస్ పూర్ డిటెక్టివ్ విభాగంలో ఎస్పీగా పనిచేస్తున్న బల్జీత్ సింగ్... ఉగ్రవాదుల కాల్పులు ఘటన వార్త తెలియగానే రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఆయన ఉగ్రవాదుల తూటాలకు బలైపోయారు. తీవ్ర బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బల్జీత్ సింగ్ అసువులు బాసినట్టు పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటించారు. మరోవైపు ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన వారి సంఖ్య 13 కి చేరింది. గురుదాస్ పూర్ పోలీస్ స్టేషన్ లోకి చొరబడిన ఉగ్రవాదులు నిమిష నిమిషానికి కాల్పులకు తెగబడుతున్నారు. భద్రతా వర్గాలకు, టెర్రరిస్టులకు మధ్య భారీఎత్తున కాల్పులు కొనసాగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా భద్రతను పెంచారు. కేంద్ర హోంశాఖ, ప్రభుత్వ వర్గాలు అప్రమత్తమయ్యాయి. పంజాబ్ రాష్ట్రంలో సెక్యూరిటీ దళాలు పెద్ద ఎత్తున మోహరించాయి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, తదితర ప్రాంతాలలో డాగ్ స్క్వాడ్ తో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతి చెందాడు. -
టెర్రరిస్టుల్లో ఒకడు వీడే
గురుదాస్ పూర్: పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఇద్దరిని భద్రత బలగాలు హతమార్చాయి. మృతి చెందిన ఉగ్రవాదుల్లో ఒకరి దగ్గర ఏకే-47 తుపాకీ, పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి ఉన్నాయి. నలుపు రంగు దుస్తులు ధరించి, చేతులకు గ్లౌజులు వేసుకుని గుబురు గడ్డంతో ఉన్నాడు. మృతుల పేరు, వివరాలు వెల్లడికావాల్సి ఉంది. నలుగురు ఉగ్రవాదులు దాడిలో పాల్గొన్నట్టు సమాచారం. మరోవైపు దీనానగర్ పోలీసు స్టేషన్ లో నక్కిన ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు సైనిక బలగాలు రంగంలోకి దిగాయి. ఉగ్రవాదుల దాడిలో 13 మంది మృతి చెందారు. ఉగ్ర దాడి నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. సీనియర్ మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసరంగా సమావేశమయ్యారు. సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. పార్లమెంట్ వద్ద అదనపు బలగాలు మొహరించారు. -
ఉగ్రదాడిని ఖండించిన రాహుల్, కేజ్రీవాల్
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని గురుదాస్ పూర్లో సోమవారం జరిగిన ఉగ్రవాదుల దాడిని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించారు. ఉగ్రవాదుల దాడిని తాను తీవ్రంగా ఖండిస్తుననట్టు రాహుల్ ట్విట్ చేశారు. ఈ దాడుల నేపథ్యంలో పంజాబ్ లో సాధ్యమైనంత తొందరగా పరిస్థితి అదుపులోకి రావాలని ఆశిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మానసిక స్థైర్యం ప్రసాదించాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నట్టు రాహుల్ తెలిపారు. ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. పిరికతనంతో అమాయకులపై ఉగ్రవాదులు చేసిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. పంజాబ్ ప్రజలకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. అలాగే అపరాధులైన వారిని త్వరలో అరెస్ట్ చేస్తారని భావిస్తున్నట్టు కేజ్రీవాల్ ట్విట్ చేశారు. కాగా, పాకిస్థాన్ సరిహద్దుకు అతి సమీపంలోని గుర్ దాస్ పూర్ జిల్లా దీనానగర్ పోలీస్ స్టేషన్ పై సోమవారం ఉగ్రవాదులు చేసిన దాడుల్లో ఐదుగురు పోలీసులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. -
'ఆ పరిస్థితిని ఎదుర్కొనే సత్తా ఉంది'
న్యూఢిల్లీ: పంజాబ్ లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో తలెత్తిన పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొంటామని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ప్రకటించింది. ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే సత్తా భారత ప్రభుత్వానికి ఉందని పీఎంఓ వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలో ఉగ్రవాదులు దాడికి తెగబడిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. హోంమంత్రిత్వ శాఖ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని చెప్పారు. ఇటువంటి దాడులను తిప్పికొట్టగల సత్తా తమకు ఉందని పునరుద్ఘాటించారు. -
వచ్చింది పాకిస్థాన్ నుంచేనా?
గుర్దాస్పూర్: పంజాబ్‌లోని దీనానగర్‌లో భీభత్సం సృష్టించి పోలీస్ స్టేషన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పటివరకు ఆరుగురిని కాల్చిచంపి.. ఇంకా స్టేషన్ లోనే నక్కి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి తూటాలు పేల్చుతూ భద్రతా బలగాలకు సవాలు విసురుతోన్న ముష్కరులు సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినబడుతోంది. నాలుగురి నుంచి పది మంది వరకు ఉన్న ఈ ఉగ్రవాదుల బృందం.. పాకిస్థాన్‌లోని నరోవాల్ నుంచి వచ్చినట్లుగా ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాలు భావిస్తున్నాయి. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో నరోవల్ ఓ ముఖ్య పట్టణమేకాదు.. నరోవల్ జిల్లాకు కేంద్రం కూడా. ఇది భారత్- పాక్ సరిహద్దుకు అతి సమీపంలో ఉంది. ఇటు పంజాబ్‌తోపాటు జమ్ముకశ్మీర్తోనూ సరిహద్దును పంచుకుంటున్న నరోవల్ జిల్లా నుంచే ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడి ఉంటారని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. దీనానగర్ పోలీస్ స్టేషన్ పై దాడికి ముందు జమ్ములోని హరినగర్‌లో ఈ బృందం కదలికలను ఐబీ గుర్తించినట్లు తెలిసింది. హరినగర్ నుంచి సోమవారం రాత్రి అమృత్సర్- పఠాన్‌కోట్ హైవే వద్దకు చేరుకున్న ముష్కరులు.. మొదట ఓ కారును హైజాక్ చేశారు. అదే మార్గంలో వెళుతోన్న ఓ బస్సుపై కాల్పులు జరిపారు. దీంతో ఓ ప్రయాణికుడు చనిపోయాడు. అక్కడినుంచి కారులో నేరుగా దీనానగర్ కు చేరుకుని, గార్డులను కాల్చిచంపి, పోలీస్ స్టేషన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వారంత సుశిక్షితులైన ఉగ్రవాదులేనని ఇప్పటికే నిర్ధారించిన భద్రతా దళాలు.. తగు జాగ్రత్తలతో ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. దీనానగర్‌లో అప్రకటిత కర్ఫ్యూ నెలకొంది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. -
'సరిహద్దులో అప్రమత్తంగా ఉండాలి'
న్యూఢిల్లీ: పంజాబ్ లో ఉగ్రవాదుల దాడితో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఇండియా- పాకిస్థాన్ సరిహద్దు వెంట అప్రమత్తంగా ఉండాలని బీఎస్ఎఫ్ డీజీ డీకే పాథక్ తో ఆదేశించినట్టు ట్విటర్ లో పేర్కొన్నారు. పంజాబ్ లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వెల్లడించారు. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, హోంశాఖ, ఎన్ఎస్ఏ కార్యదర్శులతో మాట్లాడానని చెప్పారు. గురుదాస్ పూర్, పంజాబ్ లో పరిస్థితిని కనిపెట్టి చూస్తున్నామన్నారు. భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని చెప్పారు. ఉగ్రవాదులను మట్టుబెట్టే ఆపరేషన్ కొనసాగుతోందని, త్వరలోనే పరిస్థితి అదుపులోకి వస్తుందని తెలిపారు. Spoke to DG BSF Shri DK Pathak and instructed him to step up the vigil on India-Pakistan border in the wake of attack in Gurudaspur — Rajnath Singh (@BJPRajnathSingh) July 27, 2015