ఎస్పీ మృతి, 13కి చేరిన మృతుల సంఖ్య
గురుదాస్ పూర్ : పంజాబ్లోని గురుదాస్ పూర్ ఎదురు కాల్పుల్లో ఎస్పీ బల్జీత్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులతో జరిగిన పోరులో ఆయన సోమవారం వీరమరణం పొందారు. గురుదాస్ పూర్ డిటెక్టివ్ విభాగంలో ఎస్పీగా పనిచేస్తున్న బల్జీత్ సింగ్... ఉగ్రవాదుల కాల్పులు ఘటన వార్త తెలియగానే రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఆయన ఉగ్రవాదుల తూటాలకు బలైపోయారు. తీవ్ర బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బల్జీత్ సింగ్ అసువులు బాసినట్టు పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటించారు.
మరోవైపు ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన వారి సంఖ్య 13 కి చేరింది. గురుదాస్ పూర్ పోలీస్ స్టేషన్ లోకి చొరబడిన ఉగ్రవాదులు నిమిష నిమిషానికి కాల్పులకు తెగబడుతున్నారు. భద్రతా వర్గాలకు, టెర్రరిస్టులకు మధ్య భారీఎత్తున కాల్పులు కొనసాగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా భద్రతను పెంచారు. కేంద్ర హోంశాఖ, ప్రభుత్వ వర్గాలు అప్రమత్తమయ్యాయి. పంజాబ్ రాష్ట్రంలో సెక్యూరిటీ దళాలు పెద్ద ఎత్తున మోహరించాయి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, తదితర ప్రాంతాలలో డాగ్ స్క్వాడ్ తో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతి చెందాడు.