![Jawan Dead In Encounter In Kashmir Kulgam, Clashes Kill 3 Civilians - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/12/gunakara-rao.jpg.webp?itok=ezVCbF93)
సాద గుణకరరావు
శ్రీనగర్/పాతపట్నం: కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ మృతిచెందాడు. అమర సైనికుడిని ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన సాద గుణకరరావు(25)గా గుర్తించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన గుణకరరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని అధికారులు ధ్రువీకరించారు. లష్కరే తోయిబా ఉగ్రవాదులు కుంద్వానింలో దాక్కున్నట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలు తనిఖీలను ముమ్మరం చేశాయి. ఉగ్రవాదులు నక్కిన ఇల్లు జీలం నది ఒడ్డున ఉంది.
బుధవారం ఉదయం నుంచి ఇరు వర్గాల మధ్య కాల్పులు పెరిగాయి. ఇదే సమయంలో స్థానికులు నదికి మరో పక్కన గుమిగూడారు. ఆ ప్రాంతం కాల్పుల పరిధిలోనే ఉందని అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. ఈ క్రమంలో కాల్పుల్లో చిక్కుకుని బుల్లెట్ల గాయాలతో నలుగురు పౌరులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రజలను వెళ్లగొట్టేందుకు పోలీసులు కొంతసేపు తమ ఆపరేషన్‌ను నిలిపేశారు. ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు ఆ సమయంలోనే తప్పించుకున్నట్లు భావిస్తున్నారు. ఎన్‌కౌంటర్ ముగిసిన తరువాత పోలీసులు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో 24 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
స్వగ్రామంలో విషాద చాయలు..
గుణకరరావు మృతితో పాతపట్నం మండలంలోని ఆయన స్వగ్రామం ఏఎస్ కవిటిలో విషాద చాయలు అలుముకున్నాయి. 2012లో ఆయన ఆర్మీలో చేరినట్లు గ్రామస్థులు చెప్పారు. ఎనిమిది గంటల సమయంలో తమ కుమారుడు చనిపోయినట్లు అధికారులు తెలియజేశారని తల్లి జయమ్మ చెప్పారు. గుణకరరావు తండ్రి వ్యవసాయకూలి.
Comments
Please login to add a commentAdd a comment