laskar-e-taiba
-
భారత్ ప్రతిపాదనకు నో.. పాకిస్థాన్ ఉగ్రవాదికి చైనా అండ!
వాషింగ్టన్: ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన కీలక నాయకుడు షాహిద్ మహమూద్‌కు ఐక్యరాజ్య సమితిలో చైనా అండా నిలిచింది. మహమూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ భారత్, అమెరికాలు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా అడ్డుకుంది. పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాదులపై చర్యలు చేపట్టకుండా ఐక్యరాజ్య సమితిలో గత కొన్ని నెలల్లో చైనా అడ్డుకోవడం ఇది నాలుగోసారి కావటం గమనార్హం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ)లో 1267 అల్‌ఖైదా ఆంక్షల కమిటీ కింద షాహిద్ మహమూద్‌పై చర్యలు తీసుకోవాలని.. భారత్, అమెరికా ప్రతిపాదనలు చేశాయి. అయితే, పాకిస్థాన్ మిత్రదేశమైన చైనా అందుకు అడ్డుపడింది. ఈ ప్రతిపాదనలను నిలిపివేసింది. మరోవైపు.. 2016లోనే అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ షాహిద్ మహమూద్, మహుమ్మద్ సార్వర్లపై ఆంక్షలు విధించింది. ఉగ్రవాదానికి వీరు నిధులను సమకూర్చటాన్ని అడ్డుకునే క్రమంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా తెలిపింది. ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ భారత పర్యటనలో భాగంగా 26/11 ముంబై ఉగ్రదాడిలో మరణించి వారికి నివాళులర్పించిన క్రమంలోనే.. చైనా టెర్రరిస్టులకు అండగా నిలవటం గమనార్హం. ఎవరీ షాహిద్? అమెరికా ట్రెజరీ విభాగం వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. షాషిద్ మహమూద్ కరాచీలోని లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో సీనియర్ సభ్యుడు. 2007 నుంచి లష్కరే ఉగ్రసంస్థ కోసం పనిచేస్తున్నాడు. 2013లో అతడు లష్కరే పబ్లికేషన్స్ విభాగ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టాడు. 2014 నుంచి లష్కరే అనుబంధ విభాగమైన ఫలహ్ ఇ ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్ఐఎఫ్)లో కొనసాగి.. 2015-16 మధ్యలో ఆ సంస్థ వైస్ ఛైర్మన్‌గా వ్యవహరించాడు. సిరియా, టర్కీ, బంగ్లాదేశ్, గాజా వంటి ప్రాంతాల్లో పర్యటించి ఉగ్రవాదానికి నిధులు సమకూర్చాడు. మరో ఉగ్రనేత సాజిద్ మిర్‌తో కలిసి విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించాడు. ఇదీ చదవండి: ఎందుకింత ఉగ్రరూపం? జెలెన్స్కీ ట్వీట్ -
దర్భంగా పేలుళ్ల విచారణ... కీలక అంశాలు వెలుగులోకి
సాక్షి, హైదరాబాద్: దర్భంగా పేలుడు ఘటనపై జరుగుతున్న విచారణలో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. దర్భంగా పేలుడు సూత్రధారులకు హవాలా రూపంలో డబ్బులు అందినట్లు తెలిసింది. పేళుళ్లలో ప్రధాన సూత్రధారులైన మాలిక్ సోదరులకు హాజీ సలీం హవాలా రూపంలో డబ్బులు అందించినట్లు సమాచారం. పదేళ్ల క్రితం పాకిస్తాన్లో ఇక్బాల్ ఖానాని నాసిర్, మాలిక్ కలిశారు. ఆ సమయంలోనే నాసిర్, మాలిక్‌లు కెమికల్ బాంబుల తయారీ విధానాన్ని నేర్చుకున్నారు. ఆ తర్వాత సొంత జిల్లా కైరానాలో హాజీ సలీంతో కలిసి పేలుళ్లకు కుట్ర పన్నారు. దీని కోసమే నాసిర్, మాలిక్‌లకు హవాలా రూపంలో డబ్బులు సరఫరా జరిగింది. హాజీ పంపిన డబ్బులతోనే నాసిర్, మాలిక్‌లు కెమికల్ బ్లాస్ట్‌కు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు లష్కరే తొయిబా ఉగ్రవాది ఇక్బాల్ పాక్‌లోనే ఉండి పెద్ద ఎత్తున్న బ్లాస్ట్‌లకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ బ్లాస్టింగ్స్ కోసం లష్కరే తొయిబా ఆర్థిక కష్టాల్లో ఉన్నవారిని ఎంపిక చేసింది. -
పుల్వామాలో ఎన్కౌంటర్; లష్కరే కమాండర్ హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు బుధవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా టౌన్లో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తొయిబా కమాండర్ సహా మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామాలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బుధవారం తెల్లవారుజామున కశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా గాలింపు బృందాలపై ముష్కరులు కాల్పులు జరిపారని, ఈ సందర్భంగా వారిని లొంగిపోవాలని కోరామని కశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరపడంతో ప్రతిగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని పేర్కొన్నారు. వారిలో లష్కరే తొయిబా కమాండర్ ఐజాజ్ ఉన్నాడని తెలిపారు. మరో ఇద్దరు స్థానికులని, వారు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారనే విషయం తెలియాల్సి ఉందని వెల్లడించారు. -
ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా ప్రధాన కమాండర్ హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పరింపోరా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్ ఉగ్రవాది, లష్కరే తోయిబా కమాండర్ నదీమ్ అబ్రార్ హతమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సోమవారం పరింపోరా చెక్‌పోస్ట్ వద్ద జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది వాహన తనిఖీ చేపట్టారు. ఈ సమయంలోనే ఓ కారును ఆపి చెక్ చేస్తుండగా వెనక సీట్లో కూర్చున్న వ్యక్తి హ్యాండ్ గ్రానైడ్ విసిరేందుకు యత్నించాడు. వెంటనే సీఆర్పీఎఫ్ బలగాలు అతడిని పట్టుకొని ముఖానికి ఉన్న ముసుగు తొలగించారు. అతడు లష్కరే తోయిబా టాప్ కమాండర్ నదీమ్ అబ్రార్ గుర్తించిన సీఆర్ఫీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకోని విచారించారు. దీనిలో భాగంగా ఆయుధాలు దాచిన ఇంటి గురించి తెలిపాడు. నదీమ్ అబ్రార్‌ను తీసుకోని ఆయుధాలు దాచిన ప్రదేశానికి వెళ్లారు సీఆర్పీఎఫ్ సిబ్బంది. అక్కడే దాక్కుని ఉన్న మరో ఉగ్రవాది భద్రతాదళాలపై కాల్పులు జరిపాడు. దీంతో బలగాలు కాల్పులు జరిపి ఇద్దరినీ అంతమొందించాయి. ఘటనాస్థలంలో అధికారులు ఓ ఏకే 47తోపాటు మరికొన్ని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో ముగ్గురికి గాయాలయ్యాయి. కాగా నదీమ్ అబ్రార్ అనేక హత్యకేసులో నిందితుడిగా ఉన్నారు. చదవండి: ఆ డ్రోన్లు జారవిడిచిన బాంబుల్లో ఆర్డీఎక్స్! -
హఫీజ్ సయీద్ ఇంటి సమీపంలో పేలుడు, ఇద్దరు మృతి
కరాచీ: ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ నివాసానికి సమీపంలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు మృతి చెందగా.. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. లాహోర్‌లోని జోహర్ టౌన్లో మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది. హఫీజ్ సయీద్‌ను లక్ష్యంగా చేసుకొని పేలుడు జరిగినట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడిగా ఉన్న హఫీజ్ సయీద్.. ప్రస్తుతం జమాత్ ఉద్ దువాకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇండియన్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న హఫీజ్ సయీద్‌పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. 2008 ముంబై దాడుల వెనుక ప్రధాన సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ అమెరికా 10 లక్షల డాలర్లు వెల కట్టింది. కాగా కశ్మీర్ అంశంపై కేంద్రం రేపు శాంతియుతంగా చర్చలు జరపనున్న నేపథ్యంలో బాంబు దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తుంది. చదవండి: విషాదం: ప్రపంచ రికార్డ్ కోసం ఫీట్ చేసి ప్రాణాలు కోల్పోయాడు -
ఐదుగురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని బందిపొరా, షోపియాన్, బారాముల్లా జిల్లాల్లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో భద్రతాబలగాలు శుక్రవారం ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. బందిపొరా జిల్లాలోని హజిన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు భద్రతాబలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన బలగాలు హజిన్‌ను చుట్టుముట్టి ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ సందర్భంగా అప్రమత్తమైన ఉగ్రవాదులు కాల్పులు జరపగా, భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ విషయమై ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. బలగాల కాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన అలీ, హుబైబ్ అనే ఉగ్రవాదులు చనిపోయారని తెలిపారు. వీరిద్దరూ పాకిస్తాన్ పౌరులని వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి మందుగుండు సామగ్రితో పాటు నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. మరోవైపు షోపియాన్ జిల్లాలోని ఇమామ్‌సాహిబ్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతాబలగాలు కాల్చిచంపాయి. అయితే వీరి వివరాలు ఇంకా తెలియరాలేదు. బారాముల్లా జిల్లాలో గురువారం రాత్రి ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన బలగాలు శుక్రవారం మరో ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. దీంతో గత మూడ్రోజుల్లో కశ్మీర్లో చనిపోయిన ఉగ్రవాదుల సంఖ్య ఏడుగురికి చేరుకుంది. కాగా, బారాముల్లాలో అతీఫ్ అహ్మద్(12) అనే బాలుడిని బందీగా చేసుకున్న ఉగ్రవాదులు అతడిని తుపాకీతో కిరాతకంగా కాల్చిచంపారని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఉగ్రచెరలో ఉన్న అబ్దుల్ హమీద్‌ను మాత్రమే తాము కాపాడగలిగామన్నారు. బారాముల్లాలో ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది. -
కశ్మీర్లో శ్రీకాకుళం జవాను మృతి
శ్రీనగర్/పాతపట్నం: కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో తెలుగు జవాన్ మృతిచెందాడు. అమర సైనికుడిని ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన సాద గుణకరరావు(25)గా గుర్తించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన గుణకరరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని అధికారులు ధ్రువీకరించారు. లష్కరే తోయిబా ఉగ్రవాదులు కుంద్వానింలో దాక్కున్నట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలు తనిఖీలను ముమ్మరం చేశాయి. ఉగ్రవాదులు నక్కిన ఇల్లు జీలం నది ఒడ్డున ఉంది. బుధవారం ఉదయం నుంచి ఇరు వర్గాల మధ్య కాల్పులు పెరిగాయి. ఇదే సమయంలో స్థానికులు నదికి మరో పక్కన గుమిగూడారు. ఆ ప్రాంతం కాల్పుల పరిధిలోనే ఉందని అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. ఈ క్రమంలో కాల్పుల్లో చిక్కుకుని బుల్లెట్ల గాయాలతో నలుగురు పౌరులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రజలను వెళ్లగొట్టేందుకు పోలీసులు కొంతసేపు తమ ఆపరేషన్‌ను నిలిపేశారు. ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు ఆ సమయంలోనే తప్పించుకున్నట్లు భావిస్తున్నారు. ఎన్కౌంటర్ ముగిసిన తరువాత పోలీసులు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో 24 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. స్వగ్రామంలో విషాద చాయలు.. గుణకరరావు మృతితో పాతపట్నం మండలంలోని ఆయన స్వగ్రామం ఏఎస్ కవిటిలో విషాద చాయలు అలుముకున్నాయి. 2012లో ఆయన ఆర్మీలో చేరినట్లు గ్రామస్థులు చెప్పారు. ఎనిమిది గంటల సమయంలో తమ కుమారుడు చనిపోయినట్లు అధికారులు తెలియజేశారని తల్లి జయమ్మ చెప్పారు. గుణకరరావు తండ్రి వ్యవసాయకూలి. -
హఫీజ్‌కు పాక్ బిగ్ షాక్
ఇస్లామాబాద్ : ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కర్-ఇ-తాయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ పాకిస్థాన్ పెద్ద షాక్ ఇచ్చింది. హఫీజ్‌ను ఉగ్రవాదిగా గుర్తిస్తూ... అతనికి చెందిన సంస్థలపై నిషేధం విధించింది. గతంలో ఐక్యరాజ్యసమితి హఫీజ్‌కు చెందిన లష్కర్-ఇ-తాయిబా, జమాత్ ఉద్ దవా లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గతంలోనే నిధుల సేకరణ అనుమతికి నిరాకరించిన పాక్.. ఇప్పుడు పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. 1997 ఉగ్రవాద వ్యతిరేక చట్టానికి సవరణలు చేసి మొత్తం 27 సంస్థలను ఉగ్రవాద జాబితాలో జత చేర్చింది. గత వారమే అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ఆర్డినెన్స్ పై సంతకం చేసినప్పటికీ.. సోమవారం ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించారు. తక్షణమే ఈ నిషేధం అమలులోకి వచ్చినట్లు ప్రకటించారు. అయితే హఫీజ్‌ను అరెస్ట్ చేసే విషయంపై మాత్రం పాక్ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, 26/11 ముంబై దాడులకు హఫీజ్ ప్రధాన సూత్రధారి. అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా హఫీజ్‌గా గుర్తించి అతనిపై 10 మిలియన్ డాలర్ల నజరానాను కూడా ప్రకటించింది. ఐరాస ఒత్తిడి మేరకు 297 రోజులపాటు అతన్ని గృహ నిర్భందం చేసిన పాక్ ప్రభుత్వం, లాహోర్ కోర్టు ఆదేశాల మేరకు చివరకు విడుదల చేయాల్సి వచ్చింది. పాక్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారుతున్న తరుణంలో హఫీజ్‌కు తాజా నిర్ణయం ఊహించని దెబ్బే. -
ఆ చేదు నిజాన్ని పాక్ మంత్రి ఒప్పేసుకున్నారు!
సాక్షి, న్యూయార్క్ : ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశమే, ఇక ఉగ్రవాద తాకిడిని తట్టుకోలేకపోతోంది. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రినే ఒప్పుకున్నారు. టెర్రరిస్టు హఫీజ్ సయీద్, టెర్రర్ గ్రూప్ లష్కరే తోయిబా తమ దేశానికి, దక్షిణాసియా ప్రాంతానికి తలకు మించిన భారంగా ఉన్నాయంటూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖవాజ ఆసిఫ్ బుధవారం వ్యాఖ్యానించారు. ముంబైలో 2008లో జరిగిన ఉగ్రవాద దాడులకు ప్రధాన సూత్రధారి అయిన సయీద్‌ను ఉద్దేశించి ఆయన న్యూయార్క్‌లో ఓ సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించారు. పాకిస్తాన్లో ఉన్న వీరు, తమ దేశానికి, దక్షిణాసియా ప్రాంతానికి పెను భారంగా ఉన్నారని, దీంతో తాను విభేదించడానికి లేదని వ్యాఖ్యానించారు. వీరిని తమ దేశం నుంచి తొలగించడానికి తమకు కొంత సమయం కావాలన్నారు. ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి పాకిస్తాన్ ఎల్లవేళలా ప్రయత్నాలను కొనసాగిస్తుందని చెప్పారు. కానీ తమ బాధ్యతను నిర్వర్తించడానికి కొంత సమయం, ఆస్తుల అవసరమవుతాయని చెప్పారు. 1980లో సోవియట్లకు వ్యతిరేకంగా ఆఫ్గానిస్తాన్‌లో జరిగిన యుద్ధానికి అమెరికాకు మద్దతిచ్చి చాలా పొరపాటు చేశామని ఆసీఫ్ అన్నారు. దీనికి పాకిస్తాన్ పెద్ద మొత్తంలో చెల్లించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ యుద్దం అనంతరం నుంచే అమెరికా, పాకిస్తాన్‌లు రెండూ కూడా జిహాదీలతో సతమతమవుతున్నాయని చెప్పారు. -
పాక్ లష్కరే, హిజ్బుల్ను సృష్టించింది
-
పాక్ లష్కరే, హిజ్బుల్ను సృష్టించింది
ఐక్యరాజ్యసమితి: భారతదేశం ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మ విద్యాసంస్థల్ని నెలకొల్పి శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, వైద్యులు, ఇంజనీర్లను తయారుచేస్తుంటే.. పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదుల్ని ఉత్పత్తి చేస్తోందని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. ప్రపంచ ఐటీ శక్తిగా భారత గుర్తింపు పొందితే.. ఉగ్రవాదుల తయారీ కేంద్రంగా పాకిస్తాన్ ఎందుకు అపఖ్యాతి పాలవుతుందో ఆ దేశ పాలకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆమె సూచించారు. 72వ ఐరాస సాధారణ అసెంబ్లీలో శనివారం సుష్మా ప్రసంగిస్తూ.. విధ్వంసం, మారణహోమం, క్రూరత్వాన్ని ప్రపంచానికి ఎగుమతి చేయడంతో పాకిస్తాన్ ముందువరుసలో ఉందని విరుచుకుపడ్డారు. అలాంటి దేశం ఐరాస వేదికపై నుంచి మానవత్వం గురించి మాట్లాడుతూ.. కపట ప్రదర్శనలో విజేతగా నిలిచిందని సుష్మా స్వరాజ్ ఎద్దేవా చేశారు. ఉగ్రవాదం మానవజాతి అస్తిత్వానికే ప్రమాదకరమని, ఉగ్రవాదుల జాబితాను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలే ఆమోదించకపోతే.. ఉగ్రవాద భూతంపై అంతర్జాతీయ సమాజం ఎలా పోరాటం చేయగలదని ఆమె ప్రశ్నించారు. ‘కొద్ది గంటల తేడాతో భారత్, పాకిస్తాన్‌లు స్వాతంత్య్రం పొందాయి. భారతదేశం ప్రపంచ ఐటీ శక్తిగా గుర్తింపు పొందితే.. ఉగ్రవాద ఎగుమతి కేంద్రంగా పాకిస్తాన్ ఎందుకు పేరుపడింది. ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని పాకిస్తాన్ రాజకీయ నాయకులకు నేను చెప్పాలనుకుంటున్నాను’ అని సుష్మా పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఎగదోయడమే ప్రధాన లక్ష్యంగా పాకిస్తాన్ పనిచేసినా.. వాటిని అధిగమించి భారత్ పురోగమించిందని చెప్పారు. ‘స్వాతంత్య్రం అనంతరం గత 70 ఏళ్లుగా భారత్‌ను అనేక పార్టీలు పాలించాయి. ప్రతీ ప్రభుత్వం దేశ అభివృద్ధి కోసం ఎంతో కొంత పాటుపడ్డాయి. ప్రపంచానికి గర్వకారణమైన ఐఐటీ, ఐఐఎంల్ని నెలకొల్పాం. కానీ ఉగ్రవాదం తప్ప ప్రపంచానికి పాకిస్తాన్ ఏమిచ్చింది?. మీరు ఉగ్రవాదుల్ని తయారు చేశారు. ఉగ్రవాద శిబిరాల్ని ఏర్పాటుచేశారు. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, హక్కానీ నెట్‌వర్క్‌ల్ని సృష్టించారు’అని పాకిస్తాన్‌పై సుష్మా నిప్పులు చెరిగారు. ఉగ్రవాదంపై పెట్టిన సమయాన్ని అభివృద్ధి కోసం ఆ దేశం వినియోగించుంటే.. ఇప్పుడు పాకిస్తాన్, ప్రపంచం సురక్షితంగా ఉండేవని చెప్పారు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో భారతదేశం ఒక్కటే కాకుండా.. అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లు కూడా నష్టపోతున్నాయని అన్నారు. మోదీ స్నేహ హస్తాన్ని ఎందుకు తిరస్కరించారు? ఐరాసలో శుక్రవారం పాక్ ప్రధాని చేసిన ఆరోపణల్ని సుష్మా తోసిపుచ్చుతూ.. శాంతి, మైత్రి కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ అందించిన స్నేహ హస్తాన్ని పాకిస్తాన్ ఎందుకు తిరస్కరించిందో సమాధానం చెప్పాలన్నారు. ‘ద్వైపాకిక్ష చర్చల ద్వారా అపరిష్కృత సమస్యల్ని పరిష్కరించుకోవాలని సిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్ మేరకు భారత్–పాక్‌లు అంగీకరించిన విషయాన్ని పాక్ ప్రధాని మర్చిపోయారు. వాస్తవాల్ని మర్చిపోవడంలో పాకిస్తాన్ రాజకీయ నాయకులు సిద్ధహస్తులు’ అని సుష్మా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇలాగైతే ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు ఎలా.. ‘మన శత్రువు ఎవరో నిర్వచించడంలో మన మధ్య అంగీకారం లేకపోతే కలిసికట్టుగా మనం ఎలా పోరాడగలం? మంచి ఉగ్రవాదులు, చెడ్డ ఉగ్రవాదులు అని తేడాల్ని కొనసాగిస్తే ఉమ్మడి పోరు ఎలా సాధ్యం?’ అని జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌పై చైనా వైఖరిని పరోక్షంగా తప్పుపట్టారు. మసూద్‌పై నిషేధం విధించాలని ఐరాసలో భారత ప్రతిపాదనను పదే పదే భద్రతామండలి సభ్య దేశం చైనా అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. ఐరాసలో సుష్మా ప్రసంగం అద్భుతం: మోదీ ఐరాసలో సుష్మా స్వరాజ్ ప్రసంగాన్ని ట్విటర్లో ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఉగ్రవాద ముప్పు, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం అంశాలపై సుష్మా స్వరాజ్ గట్టి సందేశాన్ని ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఐరాసలో భార త విదేశాంగ మంత్రి అద్భుత ప్రసంగం చేశారని, ప్రపంచ వేదికపై దేశాన్ని గర్వపడేలా చేశారని ప్రధాని ట్వీట్ చేశారు. పేదరిక నిర్మూలనే మా లక్ష్యం వాతావరణ మార్పులతో ఉత్పన్నమయ్యే సవాళ్లకు మాటలతో కాకుండా సరైన చేతలతో సమాధానం చెప్పాల్సిన అవసరముందని సుష్మా అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన దేశాలు పర్యావరణ సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతికంగా, ఆర్థికంగా సాయం చేయాలని సూచించారు. నల్లధనం, అవినీతిని రూపుమాపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం సాహసోపేతమని సుష్మా పేర్కొన్నారు. జీఎస్టీ అమలుతో దేశమంతా ఒకపన్ను పనువిధానం అమలు చేస్తున్నామని చెప్పారు. పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడమే భారతదేశ ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. జన్‌ధన్, ముద్ర, ఉజ్వల, డిజిటల్ ఇండియా వంటివన్నీ పేదలకు సాధికారత అందించేందుకు ఉద్దేశించినవని చెప్పారు. అణ్వస్త్ర వ్యాప్తి, సముద్ర రవాణా భద్రతకు ముప్పు అంశాలపై ఐరాసలో ఆందోళన వ్యక్తం చేశారు. -
ఢిల్లీలో హై అలర్ట్: ఉగ్రదాడి అనుమానాలు
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదులు భారీ దాడులకు దిగనున్నారనే నిఘా వర్గాల హెచ్చరికలతో దేశ రాజధానిలో పోలీసులు అప్రమత్తమయ్యారు. లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశంలో దాడులకు దిగ్గనున్నారనే నిఘా హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు హై అలర్ట్ జారీ చేశారు. 20-21 మంది లష్కర్ టెర్రరిస్టులు దేశంలో ఇప్పటికే చొరబడినట్టు ఇంటిలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ, ముంబై, రాజస్థాన్, పంజాబ్ లో టెర్రర్ గ్రూపులు దాడిచేయవచ్చనే అనుమానాలను నిఘా వర్గాలు వ్యక్తం చేశాయి. అనుమానిత వ్యక్తులను జాగ్రత్తగా పరిశీలించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ తన జిల్లా, మెట్రో పోలీస్, రైల్వే పోలీసు విభాగాలను గట్టిగా హెచ్చరించింది. మార్కెట్ ప్రాంతాలు, మతపరమైన ప్రదేశాలు, మాల్స్, మెట్రో, రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచుకోవాలని, అప్రతమత్తంగా ఉండాలని ఆదేశించింది. అలాగే మాక్ డ్రిల్స్ నిర్వహించాలని, అత్యవసర పరిస్థితికి సిబ్బంది సిద్దం చేయాలని కోరింది. అటు హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో విమానాశ్రయంలో కూడా హై అలర్ట్ జారీ అయ్యింది. భద్రతా ప్రమాణాలను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. మాంచెస్టర్ టెర్రర్ దాడి సహా, ఽప్రపంచ వ్యాప్తంగా అనేక ఇతర ప్రాంతాల్లో జరిగిన దాడుల నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది.