
ఢిల్లీలో హై అలర్ట్: ఉగ్రదాడి అనుమానాలు
దేశంలో ఉగ్రవాదులు భారీ దాడులకు దిగనున్నారనే నిఘా వర్గాల హెచ్చరికలతో దేశ రాజధానిలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదులు భారీ దాడులకు దిగనున్నారనే నిఘా వర్గాల హెచ్చరికలతో దేశ రాజధానిలో పోలీసులు అప్రమత్తమయ్యారు. లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశంలో దాడులకు దిగ్గనున్నారనే నిఘా హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు హై అలర్ట్ జారీ చేశారు. 20-21 మంది లష్కర్ టెర్రరిస్టులు దేశంలో ఇప్పటికే చొరబడినట్టు ఇంటిలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ, ముంబై, రాజస్థాన్, పంజాబ్ లో టెర్రర్ గ్రూపులు దాడిచేయవచ్చనే అనుమానాలను నిఘా వర్గాలు వ్యక్తం చేశాయి. అనుమానిత వ్యక్తులను జాగ్రత్తగా పరిశీలించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ మేరకు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ తన జిల్లా, మెట్రో పోలీస్, రైల్వే పోలీసు విభాగాలను గట్టిగా హెచ్చరించింది. మార్కెట్ ప్రాంతాలు, మతపరమైన ప్రదేశాలు, మాల్స్, మెట్రో, రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచుకోవాలని, అప్రతమత్తంగా ఉండాలని ఆదేశించింది. అలాగే మాక్ డ్రిల్స్ నిర్వహించాలని, అత్యవసర పరిస్థితికి సిబ్బంది సిద్దం చేయాలని కోరింది.
అటు హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో విమానాశ్రయంలో కూడా హై అలర్ట్ జారీ అయ్యింది. భద్రతా ప్రమాణాలను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. మాంచెస్టర్ టెర్రర్ దాడి సహా, ఽప్రపంచ వ్యాప్తంగా అనేక ఇతర ప్రాంతాల్లో జరిగిన దాడుల నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది.