కశ్మీర్ వేర్పాటు వాదుల తీవ్రవాద చర్యలను సమర్థిస్తూ, భారత సైన్యంపై విషం కక్కుతూ ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ చేసిన వ్యాఖ్యలు 14 సంవత్సరాల క్రిందటివి. 2010 అక్టోబర్ 21న దేశ రాజధాని నగరం ఢిల్లీలో ‘ఆజాది ఓన్లీ ద వే’ అనే అంశంపై కశ్మీరీ వేర్పాటు వాదులు ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కశ్మీర్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుస్సేన్, రచయిత్రి అరుంధతీ రాయ్ భారత సైన్యానికీ, భారత ప్రభుత్వానికీ వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు క్షమించరానివి.
ఈ వ్యాఖ్యలు రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్య్ర పరిధిని అతిక్రమించాయనే చెప్పాలి. దేశభద్రతపై ఆ వ్యాఖ్యలు చూపే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని, సామాజిక కార్యకర్త సుశీల్ పండిట్ ఫిర్యాదు మేరకు ‘ఉపా’ కింద 2010 అక్టోబర్ 28న ఢిల్లీ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. లౌకికవాద ముసుగు వేసుకున్న కాంగ్రెస్ తదితర పార్టీల నాయకులు కశ్మీర్ వేర్పాటువాదుల వాదనలకు వ్యతిరేకంగా విచారణ చేస్తే... ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కడ దెబ్బ తింటుందో అనే భీతితో ఆ కేసును తొక్కి పట్టారు.
వాస్తవంగా దేశ భద్రతతో ముడిపడిన ఈ విషయంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడిచే కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచించి ఉండాలి. 14 ఏళ్లు ఆ కేసుపై విచారణ జరగకుండా తాత్సారం చేయడం దేశాన్ని ప్రేమించే వాళ్లకు మాత్రమే ఆశ్చర్యం కలిగిస్తుంది. దేశ భద్రత విషయంలో కఠిన వైఖరి అవలంబించే మోదీ ప్రభుత్వం పది సంవత్సరాలు ఈ కేసును విచారణ చేయకుండా నిర్లక్ష్యం చేయడానికి కారణాలనూ దేశ ప్రజలకు వివరించవలసిన బాధ్యత మూడోసారి అధికారాన్ని చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలదే!
అనూహ్యంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఈ కేసు ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడం దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. దేశానికి వ్యతిరేకంగా, దేశ భద్రతకు సవాల్‌గా మారిన తీవ్రవాదులకు అనుకూలంగా గళం విప్పిన వాళ్ళ పని పట్టడానికి మూడోసారి అధికారంలో కూర్చున్న మోదీ∙ప్రభుత్వం చురుకుగా పని చేస్తుందని ముందస్తు సమాచారం ఇవ్వడంలో భాగంగానే ఈ ‘ఉపా’ కేసును తెరపైకి తెచ్చేలా కేంద్రం చేసిందా అనే అనుమానం దేశ ప్రజలకు కలగక మానదు.
‘ఆజాదీ ఓన్లీ ద వే’ కాన్ఫరెన్స్‌లో అరుంధతీ రాయ్ మాట్లాడిన మాటలను, ఆమె ఉద్దేశాలను ఈ దేశ ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ఎవరిది? కశ్మీర్ స్వతంత్ర దేశమనీ, దాన్ని భారత ప్రభుత్వం దౌర్జన్యంగా ఆక్రమించిందనీ, కశ్మీర్ ప్రజలు స్వతంత్రంగా బతికే హక్కు ఉందనీ, ఈ హక్కు కోసం భారత సైన్యంతో పోరాడే కశ్మీరు వేర్పాటు వాదులు తన సోదరులనీ, ఈ పోరాటంలో భారత సైన్యానికి ఎదురొడ్డి నిలవడం సమర్థనీయమనీ ఆమె చేసిన వ్యాఖ్యలను దేశ ప్రజలకు తెలియనీయకుండా కనుమరుగు చేసింది ఎవరు?
స్వాతంత్య్రానంతరం 562 సంస్థానాలు భారతదేశంలో విలీనమైనట్లే జమ్మూ–కశ్మీర్ సంస్థానం రాజు ‘రాజా హరి సింగ్’ భారత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని, జమ్మూ–కశ్మీర్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు. నిజానికి పాకిస్తానే 1948లో కశ్మీర్‌లో మూడో వంతును ఆక్రమించింది. దాన్ని ‘పాక్ ఆక్రమిత కశ్మీర్’ అని పిలుస్తున్నారు. అప్పటి నుంచి కశ్మీర్‌లో పాక్ వెన్నుదన్నుతో తీవ్రవాదులు చేసిన మారణహోమం అంతా ఇంతా కాదు. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం గాలి పీల్చుతూ, ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం ముక్కలు కావాలని ఎవరు కోరినా క్షమించరాని నేరమే అవుతుంది.
– ఉల్లి బాలరంగయ్య, సామాజిక, రాజకీయ విశ్లేషకులు
ఆ వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పే!
Published Wed, Jul 10 2024 4:58 AM | Last Updated on Wed, Jul 10 2024 4:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment