సైన్యం దాడిలో ధ్వంసమైన ఇల్లు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని బందిపొరా, షోపియాన్, బారాముల్లా జిల్లాల్లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో భద్రతాబలగాలు శుక్రవారం ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. బందిపొరా జిల్లాలోని హజిన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు భద్రతాబలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన బలగాలు హజిన్‌ను చుట్టుముట్టి ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ సందర్భంగా అప్రమత్తమైన ఉగ్రవాదులు కాల్పులు జరపగా, భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి.
ఈ విషయమై ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. బలగాల కాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన అలీ, హుబైబ్ అనే ఉగ్రవాదులు చనిపోయారని తెలిపారు. వీరిద్దరూ పాకిస్తాన్ పౌరులని వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి మందుగుండు సామగ్రితో పాటు నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. మరోవైపు షోపియాన్ జిల్లాలోని ఇమామ్‌సాహిబ్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతాబలగాలు కాల్చిచంపాయి. అయితే వీరి వివరాలు ఇంకా తెలియరాలేదు.
బారాముల్లా జిల్లాలో గురువారం రాత్రి ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన బలగాలు శుక్రవారం మరో ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. దీంతో గత మూడ్రోజుల్లో కశ్మీర్‌లో చనిపోయిన ఉగ్రవాదుల సంఖ్య ఏడుగురికి చేరుకుంది. కాగా, బారాముల్లాలో అతీఫ్ అహ్మద్(12) అనే బాలుడిని బందీగా చేసుకున్న ఉగ్రవాదులు అతడిని తుపాకీతో కిరాతకంగా కాల్చిచంపారని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఉగ్రచెరలో ఉన్న అబ్దుల్ హమీద్‌ను మాత్రమే తాము కాపాడగలిగామన్నారు. బారాముల్లాలో ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment