సాక్షి, న్యూయార్క్ : ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశమే, ఇక ఉగ్రవాద తాకిడిని తట్టుకోలేకపోతోంది. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రినే ఒప్పుకున్నారు. టెర్రరిస్టు హఫీజ్ సయీద్, టెర్రర్ గ్రూప్ లష్కరే తోయిబా తమ దేశానికి, దక్షిణాసియా ప్రాంతానికి తలకు మించిన భారంగా ఉన్నాయంటూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖవాజ ఆసిఫ్ బుధవారం వ్యాఖ్యానించారు. ముంబైలో 2008లో జరిగిన ఉగ్రవాద దాడులకు ప్రధాన సూత్రధారి అయిన సయీద్‌ను ఉద్దేశించి ఆయన న్యూయార్క్‌లో ఓ సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించారు. పాకిస్తాన్‌లో ఉన్న వీరు, తమ దేశానికి, దక్షిణాసియా ప్రాంతానికి పెను భారంగా ఉన్నారని, దీంతో తాను విభేదించడానికి లేదని వ్యాఖ్యానించారు. వీరిని తమ దేశం నుంచి తొలగించడానికి తమకు కొంత సమయం కావాలన్నారు.
ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి పాకిస్తాన్ ఎల్లవేళలా ప్రయత్నాలను కొనసాగిస్తుందని చెప్పారు. కానీ తమ బాధ్యతను నిర్వర్తించడానికి కొంత సమయం, ఆస్తుల అవసరమవుతాయని చెప్పారు. 1980లో సోవియట్‌లకు వ్యతిరేకంగా ఆఫ్గానిస్తాన్‌లో జరిగిన యుద్ధానికి అమెరికాకు మద్దతిచ్చి చాలా పొరపాటు చేశామని ఆసీఫ్ అన్నారు. దీనికి పాకిస్తాన్ పెద్ద మొత్తంలో చెల్లించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ యుద్దం అనంతరం నుంచే అమెరికా, పాకిస్తాన్‌లు రెండూ కూడా జిహాదీలతో సతమతమవుతున్నాయని చెప్పారు.