ముగ్గురు ఉగ్రవాదులు హతం,
ముగ్గురు పోలీసులకు గాయాలు
అస్సాం: రాష్ట్రంలోని కాచర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. ఎస్పీ నుమాల్ మహట్టా తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాపూర్ రోడ్డు ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై పోలీసులకు సమాచారం అందింది.
మంగళవారం కాచర్‌లోని ధలై గంగా నగర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు ఏకే రైఫిళ్లను, ఒక సాధారణ రైఫిల్, ఒక పిస్టల్‌ను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం పట్టుబడిన ముగ్గురూ హ్మార్ తీవ్రవాద సంస్థలో శిక్షణ పొందిన క్యాడర్‌గా ప్రాథమిక విచారణలో తేలింది. భుబన్ హిల్స్‌లోని సమీపంలోని అడవిలో మరికొందరున్నట్టు, అసోం–మణిపూర్ సరిహద్దుల్లో విధ్వంసాలకు సిద్ధమవుతున్నట్లు పట్టుబడిన ముగ్గురు వెల్లడించారు.
దీంతో బుధవారం తెల్లవారుజామున అదనపు ఎస్పీ నేతృత్వంలోని బృందం అరెస్టయిన ఉగ్రవాదులతో పాటు భుబన్ హిల్స్‌లో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ సమయంలో భుబన్‌హిల్స్‌లో ఉన్న కొందరు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. గంటపాటు జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో ఇద్దరు కాచర్‌కు చెందినవారు కాగా ఒకరు మణిపూర్‌కు చెందినవారు. మరో ఆరు నుంచి ఏడుగురు ఉగ్రవాదులు తప్పించుకున్నారు. వారికోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment