దద్దరిల్లిన దీనానగర్
గురుదాస్ పూర్: తుపాకీ తూటాల మోతతో పంజాబ్ లోని దీనానగర్ పట్టణం దద్దరిల్లింది. తమ ప్రాంతంలోకి చొరబడిన ముష్కరులు సాగించిన విధ్వంసకాండతో దీనానగర్ వాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చి ఉగ్రవాదులు మారణకాండకు తెగబడ్డారన్న సమాచారంతో దీనానగర్ ప్రజలు బెంబేలెత్తారు. ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు టీవీలకు అతుక్కుపోయారు. పాఠశాలలు, కాలేజీలు, ఇతర సంస్థలు మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
గురుదాస్ పూర్ జిల్లాలో మూడో అతిపెద్ద పట్టణమైన దీనానగర్ పై సాయుధ దుండగులు దండెత్తారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపి చివరకు పోలీస్ స్టేషన్ లో నక్కారు. మొదట కమల్ జీత్ సింగ్ మాథారు అనే వ్యక్తి నుంచి మారుతి 800 వాహనాన్ని లాక్కుని అతడిపై కాల్పులు జరిపారు. తర్వాత రోడ్డుపక్కనున్న హోటల్ పై కాల్పులు జరిపి చిరువ్యాపారిని పొట్టనపెట్టుకున్నారు. కదులుతున్న బస్సుపై కాల్పులు జరపడంతో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. తర్వాత హెల్త్ సెంటర్ లక్ష్యంగా దాడికి దిగారు.
పోలీస్ స్టేషన్ లోకి చొరబడే ముందు పోలీసులు నివాసముంటున్న క్వార్టర్స్ పై గ్రెనేడ్లు విసిరారు. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఉగ్రవాదులు, సైనిక బలగాలు జరుపుతున్న కాల్పులతో దీనానగర్ దద్దరిల్లింది. ముష్కర మూక దాడితో దీనానగర్ వాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. కార్యాలయాలకు సెలవు పెట్టారు. పిల్లలను స్కూల్స్ మానిపించారు. మరోవైపు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.