సాక్షి, ఢిల్లీ : కశ్మీర్‌లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడే అవకాశముందన్న సమాచారంతో పంజాబ్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. జైషే మహమ్మద్, లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చనే నిఘా వర్గాల హెచ్చరికలతో పంజాబ్‌లోని పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్ జిల్లాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు శుక్రవారం భారీ కార్డన్ సెర్చ్ చేపట్టారు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ ఆపరేషన్‌లో ఐదు వేల మంది పోలీసులు, బీఎస్‌ఎఫ్, మిలిటరీ నిఘా వర్గాలు, ఎన్‌ఐఎకు చెందిన సాయుధ బలగాలు పాల్గొంటున్నాయి. ఈ ఆపరేషన్‌కు పంజాబ్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ఈశ్వర్ సింగ్, అడిషనల్ డెరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాకేశ్ చంద్రలు నేతృత్వం వహిస్తున్నారని పంజాబ్ డీజీపీ దిన్‌కర్ గుప్తా శనివారం తెలియజేశారు.
ఈ బలగాలు అనుమానాస్పద ప్రాంతాల గురించి పరస్పరం సమాచారాన్ని పంచుకుకుంటాయని డీజీపీ వెల్లడించారు. ఈ విషయంలో ప్రజలు తమకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గత నెలలో పాకిస్తాన్‌లోని ఖలిస్తాన్ ఉగ్రవాదులు 8 డ్రోన్ల ద్వారా దాదాపు 80 కిలోల పేలుడు పదార్ధాలు, ఆయుధాలను పంజాబ్ సరిహద్దుల్లో విడిచిపెట్టిందని నిఘా వర్గాలు ధ్రువీకరించాయి. ఈ నేపథ్యంలో ఈ ఆపరేషన్‌ను ఇతర సరిహద్దు ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశముందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్ జిల్లాల్లోని ప్రతీ ఆసుపత్రిలో 8 బెడ్లను అత్యవసర సేవల కోసం సిద్ధంగా ఉంచాలని జిల్లా అధికారులు ఆదేశించారని పఠాన్‌కోట్ మెడికల్ ఆఫీసర్ భూపీందర్ సింగ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment