Gurudaspur
-
బీజేపీ 8వ జాబితా రిలీజ్.. ప్రముఖ బాలీవుడ్ హీరోకు నో టికెట్
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల 8వ జాబితాను బీజేపీ శనివారం(మార్చ్ 30) సాయంత్రం విడుదల చేసింది. ఒడిషా, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 11 సీట్లకు ఈ జాబితాలో అభ్యర్థులను ప్రకటించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు, బ్లాక్ బస్టర్ గదర్ హీరో సన్నీ డియోల్‌కు పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి ఈసారి బీజేపీ టికెట్ నిరాకరించింది. సన్నీ డియోల్ స్థానంలో గురుదాస్‌పూర్ నుంచి దినేష్‌సింగ్ బాబును బరిలోకి దింపింది. పార్లమెంటుకు సరిగా హాజరు కాకపోవడం వల్లే సన్నీ డియోల్‌కు టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గు చూపలేదని సమాచారం. మాజీ సీఎం అమరేందర్‌సింగ్ భార్య ప్రణీత్ కౌర్‌కు పార్టీలో చేరిన కొద్ది రోజులకే పటియాల నుంచి టికెట్ ఇచ్చారు. అమెరికాలో భారత మాజీ రాయబారి తరణ్‌జిత్‌సింగ్ సంధుకు అమృత్సర్ నుంచి అవకాశం కల్పించారు. ఆమ్ఆద్మీ పార్టీ నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన సుశీల్‌కుమార్ రింకూను జలంధర్ నుంచి బరిలోకి దింపారు. ఒడిషాలో ఇటీవలే రాష్ట్రంలో అధికార బీజేడీ నుంచి బీజేపీలో చేరిన మోస్ట్ సీనియర్ ఎంపీ భర్తృహరి మెహతాబ్‌కు కటక్ నుంచి టికెట్ ఇచ్చారు. ఇదీ చదవండి.. బీజేపీ వాషింగ్‌మెషిన్‌ను ప్రదర్శించిన తృణమూల్ నేతలు -
సన్నీడియోల్‌పై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు!
చండీగఢ్: గదర్-2 హీరో సన్నీడియోల్‌పై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫైరయ్యారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ పర్యటన సందర్భంగా కేజ్రీవాల్ సన్నీడియోల్‌పై విమర్శల దాడి చేశారు. గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న సన్నీడియోల్ ఎప్పుడైనా మీకు మొహం చూపించారా అని ప్రజలను ప్రశ్నించారు. ఓటు వేసిన వారిని సన్నీడియోల్ మోసం చేశారని విమర్శించారు. ‘సన్నీ డియోల్‌ను మీరు గెలిపించారు. గెలిచినప్పటి నుంచి నియోజకవర్గానికి అతడు మళ్లీ ఎప్పుడైనా వచ్చాడా? అతని ముఖాన్ని మీరేప్పుడైనా మళ్లీ చూశారా?. పెద్ద హీరో అనుకుని మనం అతనికి ఓట్లేశాం. అలాంటి పెద్దవాళ్లను ఎన్నుకుంటే వాళ్లేం చేయరు. అందుకే సామాన్యుడిని(ఆమ్ఆద్మీ)ని గెలిపించాలి. ఆమ్ ఆద్మీ అయితే మీరెప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తాడు’ అని కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్‌లో ప్రతిపక్షాలపై కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆపార్టీలకు ఆప్ ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప వేరే ఏం పనిలేదని విమర్శించారు. గత ప్రభుత్వం ఖాళీ చేసిన ఖజానాను ఏడాదిన్నరలో ఆప్ ప్రభుత్వం నింపిందన్నారు. ప్రజలకు ఉచిత విద్యుత్ లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామని తెలిపారు. ఇదీచదవండి.. ‘24 గంటలు ఆగండి.. పూర్తి మెజార్టీ మాదే’ -
ఇంట్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు; నలుగురు మృతి
అమృత్సర్: పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. భూతగాదాల నేపథ్యంలో సుఖ్వీందర్సింగ్ సోనీ మంగల్ సింగ్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మంగల్‌సింగ్‌తో పాటు ఒక కుమారుడు అక్కడికక్కడే మృతిచెందగా, మరో కుమారుడు సహా మనుమడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. కాగా ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం పలు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. అయితే ఇరు కుటుంబాల మధ్య భూతగాదాల నేపథ్యంలో సుఖ్వీందర్సింగ్ పగ పెంచుకొని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని గురుదాస్‌పూర్ డీఎస్పీ హర్కిషన్ తెలిపారు. -
దారుణం : కాల్చి చంపి.. కాళ్లు నరికి..!
చంఢీగడ్ : గురుదాస్‌పూర్ శిరోమణి అకాలీదళ్ యూనిట్ ఉపాధ్యక్షుడు దల్బీర్ సింగ్ (55)ను దారుణ హత్యకు గురయ్యారు. ఓ కూలీ మనిషి విషయంలో ఘర్షణ తలెత్తడంతో పౌల్ట్రీ నిర్వాహకుడు బల్విందర్ సింగ్ (55) మరికొంతమందితో కలిసి దల్బీర్‌సింగ్‌ను కాల్చి చంపారని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో నిందితులు బల్విందర్ సింగ్ (55), అతని కుమారులు మేజర్ సింగ్ (25), మన్దీప్ సింగ్ (24) తో పాటు మరో ఆరుగురు దల్బీర్ ఇంట్లోకి చొరబడ్డారని పోలీసులు తెలిపారు. తొలుత దల్బీర్ కుంటుంభ సుభ్యులపైకి డజనుకుపైగాబుల్లెట్లను పేల్లి వాళ్లందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. ఈక్రమంలోనే దల్బీర్‌ను కాల్చి చంపి.. అతని కాళ్లను ముక్కలుగా నరికివేశారు. కూలీ మనిషి విషయంలో తలెత్తిన గొడవలో మాజీ సర్పంచ్ అయిన దల్బీర్ కలుగజేసుకుని పరిష్కరించాడని.. అయితే, బల్విందర్ మాత్రం.. దల్బీర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడని గ్రామస్తులు పేర్కొన్నారు. తొమ్మిది మంది నిందితులపై కేసు నమోదు చేశామని బటాలా ఎస్ఎస్పి ఒపింద్రజీత్ సింగ్ ఘుమ్మన్ తెలిపారు. -
పాక్ సరిహద్దు జిల్లాల్లో కార్డన్ సెర్చ్
సాక్షి, ఢిల్లీ : కశ్మీర్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడే అవకాశముందన్న సమాచారంతో పంజాబ్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. జైషే మహమ్మద్, లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చనే నిఘా వర్గాల హెచ్చరికలతో పంజాబ్‌లోని పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్ జిల్లాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు శుక్రవారం భారీ కార్డన్ సెర్చ్ చేపట్టారు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ ఆపరేషన్‌లో ఐదు వేల మంది పోలీసులు, బీఎస్ఎఫ్, మిలిటరీ నిఘా వర్గాలు, ఎన్ఐఎకు చెందిన సాయుధ బలగాలు పాల్గొంటున్నాయి. ఈ ఆపరేషన్‌కు పంజాబ్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ఈశ్వర్ సింగ్, అడిషనల్ డెరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాకేశ్ చంద్రలు నేతృత్వం వహిస్తున్నారని పంజాబ్ డీజీపీ దిన్కర్ గుప్తా శనివారం తెలియజేశారు. ఈ బలగాలు అనుమానాస్పద ప్రాంతాల గురించి పరస్పరం సమాచారాన్ని పంచుకుకుంటాయని డీజీపీ వెల్లడించారు. ఈ విషయంలో ప్రజలు తమకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గత నెలలో పాకిస్తాన్‌లోని ఖలిస్తాన్ ఉగ్రవాదులు 8 డ్రోన్ల ద్వారా దాదాపు 80 కిలోల పేలుడు పదార్ధాలు, ఆయుధాలను పంజాబ్ సరిహద్దుల్లో విడిచిపెట్టిందని నిఘా వర్గాలు ధ్రువీకరించాయి. ఈ నేపథ్యంలో ఈ ఆపరేషన్‌ను ఇతర సరిహద్దు ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశముందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్ జిల్లాల్లోని ప్రతీ ఆసుపత్రిలో 8 బెడ్లను అత్యవసర సేవల కోసం సిద్ధంగా ఉంచాలని జిల్లా అధికారులు ఆదేశించారని పఠాన్‌కోట్ మెడికల్ ఆఫీసర్ భూపీందర్ సింగ్ పేర్కొన్నారు. -
సన్నీ డియోల్ చర్యపై విమర్శల వర్షం..!
చంఢీగడ్ : ప్రముఖ నటుడు, గురుదాస్‌పూర్ బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ ఓ ప్రతినిధిని నియమించుకున్నారు. నియోజకవర్గంలో జరిగే ముఖ్యమైన కార్యక్రమాల్లో తన బదులు గురుప్రీత్‌సింగ్ పల్హేరీ హాజరవుతారని ఒక లేఖ విడుదల చేశారు. ఈ వ్యవహారంలపై కాంగ్రెస్ పార్టీ విమర్శల వర్షం కురిపిస్తోంది. ప్రజాప్రతినిధిగా సేవలందించాల్సిందిపోయి తనకు ప్రతినిధిగా మరో వ్యక్తిని నియమిస్తారా అని కాంగ్రెస్ నేత సుఖ్‌జీందర్‌సింగ్ రంధ్వా ప్రశ్నించారు. ఓటర్లను సన్నీ దారుణంగా మోసం చేశాడని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న నాయకుడు తన బదులు మరొకరిని ఆశ్రయించాలని కోరడం విడ్డూరంగా ఉందని చురకలంటించారు. ఓటర్లు సన్నీని నాయకుడిగా ఎన్నుకున్నారని అతని ప్రతినిధిని కాదని ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో సైతం సన్నీ చర్యపై ట్రోలింగ్ కొనసాగుతోంది. ‘నా ప్రతినిధిగా మొహాలీ జిల్లాకు చెందిన గురుప్రీత్‌సింగ్ పల్హేరీని నియమించుకున్నాను. నా పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజలకు ఆయన అందుబాటులో ఉంటాడు. ఏవైనా కార్యక్రమాలకు నేను హాజరు కాలేనప్పుడు ఆయనే చూసుకుంటారు. సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటారు’ అని సన్నీ ఒక లెటర్లో పేర్కొన్నారు. కాగా, తన నియామకంపై వస్తున్న విమర్శలపై గురుప్రీత్ స్పందించారు. నియోజకవర్గ ప్రజలకు 24 గంటలు సేవలందించాలనే సదుద్దేశంతోనే ఎంపీ సన్నీ డియోల్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు. ఇదిలాఉండగా.. తాజా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జక్కర్‌పై ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారు. ముంబైలో నివాసముండే సన్నీ.. లోక్‌సభ సమావేశాలకు అక్కడినుంచే వచ్చి వెళ్తున్నారు. -
స్విస్ బ్యాంక్‌లో రూ.7 కోట్ల డిపాజిట్లు..!
సాధారణంగా అక్రమ సంపాదనపరులు తమ నల్లడబ్బును స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటారని అంటుంటారు. అక్కడి బ్యాంకుల్లో సొమ్మున్నట్టు బహిరంగంగా ఎవరూ చెప్పుకోరు. అయితే, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సునీల్ కుమార్ జాఖఢ్ మాత్రం తన భార్యకు స్విస్ బ్యాంకులో ఏడు కోట్ల రూపాయల విలువైన డిపాజిట్లు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో స్పష్టం చేశారు. తన భార్య సిల్వియా జాఖఢ్ పేరుమీద జ్యూరిక్ లోని జ్యూర్చర్ కాంటోనల్ బ్యాంకులో 7.37 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయని ఎన్నికల సంఘానికి సమర్పించిన అస్తిపాస్తుల వివరాల్లో వెల్లడించారు. మధ్య ప్రదేశ్ మాజీ గవర్నర్ బలరాం జాఖడ్ కుమారుడైన సునీల్ ఈ నియోజకవర్గం సిట్టింగ్ ఎంపీ. ఇక్కడ ఆయన ప్రముఖ బాలీవుడ్ హీరో సన్నీదేవల్తో తలపడుతున్నారు. స్విస్ బ్యాంకు సొమ్ము కాకుండా దేశంలోని వేర్వేరు బ్యాంకుల్లో 1.23 కోట్ల విలువైన డిపాజిట్లు ఉన్నాయని సునీల్ తెలిపారు. తన భార్యకు 12.06 కోట్ల విలువైన ఆస్తులున్నాయని పేర్కొన్నారు. ఇక సన్నీడియోల్ విషయానికి వస్తే ఆయనకు 60.46 కోట్ల విలువైన చరాస్తులు,21 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఆయన భార్య లిండా దేవల్‌కు 5.72 కోట్లు ఉన్నాయి. సన్నీదేవల్కు మొత్తం 49.3 కోట్ల అప్పులు ఉన్నాయి. ఆయన భార్య పేరు మీద 1.66 కోట్ల అప్పులున్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. సన్నీ దేవల్ జీఎస్టీ కింద కోటి 7 లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందట. -
గురుదాస్‌పూర్ ‘బోర్డర్’ వార్!
సరిహద్దుల్లో దేశభద్రతకోసం సాహసోపేతంగా పోరాడిన సినీ హీరో ఇప్పుడు రాజకీయ బరిలో నిజమైన సమరాన్ని ఎదుర్కోబోతున్నారు. ‘బోర్డర్’, ‘గదర్ –ఏక్ ప్రేమ్‌కథా’ లాంటి చిత్రాల హీరో సన్నీదేవల్ను ఓటర్లు గెలిపిస్తారా? అనే ప్రశ్న రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ సరిహద్దుల్లో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో నాలుగు సార్లు విజయం సాధించిన మరో బాలీవుడ్ నటుడు వినోద్‌ఖన్నా మరణంతో 2017లో జరిగిన ఉప ఎన్నికలో ఈ సీటుని బీజేపీ నుంచి కాంగ్రెస్ కైవసం చేసుకోగలిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ మాజీ స్పీకర్ బలరాం జాఖఢ్ కొడుకు సునీల్ జాఖఢ్ 1,90,000 ఓట్ల మెజారిటీతో ఇక్కడ విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్‌కి చెక్‌పెట్టేందుకు బీజేపీ సినీరంగ ప్రముఖుడైన 62 ఏళ్ళ సన్నీదేవల్ను బరిలోకి దింపింది. బీజేపీ టికెట్‌పై పోటీచేసిన వినోద్ ఖన్నాను అభివృద్ధి ఎజెండా నాలుగుసార్లు ఈ స్థానంలో గెలుపుని ప్రసాదించింది. ఈ ప్రాంతంలో విస్తృతంగా వంతెన నిర్మాణాలు చేపట్టడంతో వినోద్‌కి ‘పూలోంకా బాద్షా’ అనే పేరు తెచ్చిపెట్టింది. బీజేపీ తన పూర్వ వైభవం సంపాదించేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. అయితే గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానంలో జాట్ల జనాభా ఎక్కువ. ఇటు కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాఖడ్, అటు బీజేపీ సినీదిగ్గజం ధర్మేంద్ర కొడుకు సన్నీదేవల్ ఇరువురూ జాట్ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారనేది 23 వరకు వేచి చూడాల్సి ఉంది. గురుదాస్‌పూర్‌లో తనను తాను దేశభక్తుడిగా ప్రచారం చేసుకునే సన్నీదేవల్పై బీజేపీ గంపెడాశలు పెట్టుకుంది. రాజకీయ నేతగా మారిన సన్నీదేవల్ ఇటీవలే బీజేపీలో చేరి ప్రస్తుతం విరామం లేకుండా ప్రచారం సాగిస్తున్నారు. సమయం అతి తక్కువగా ఉండడంతో మొత్తం తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేయడం అంత సులువైన విషయమేమీ కాదని భావిస్తున్నారు. అందుకే ప్రతిరోజూ 12 గంటలపాటు నిర్విరామంగా రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. సన్నీదేవల్ బీజేపీ జాతీయవాదాన్ని సినిమాఫక్కీలో ప్రచారంచేస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. సన్నీ సందర్భోచిత సినీడైలాగులతో ఓటర్లును ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 1993లో యువతరాన్ని ఉర్రూతలూగించిన ‘దామిని’ సినిమాలోని ‘ఏ ఢాయీ కిలోకా హాత్’ డైలాగులనీ, ‘గదర్’ సినిమాలోని ‘ఏ హిందుస్థాన్ జిందాబాద్ హై, జిందాబాద్ రహేగా’’ అనే డైలాగునీ అదే సినీఫక్కీలో వినిపిస్తోన్న సన్నీదేవల్ ప్రచారాన్ని ప్రజలు బాగానే ఆదరిస్తున్నారు. చివరకు నరేంద్రమోదీ కూడా సన్నీదేవల్ ఫొటోతో ‘‘హిందుస్థాన్ జిందాబాద్...’’ అంటూ ట్వీట్ చేయడం విశేషం. అలాగే సన్నీదేవల్ తండ్రి ధర్మేంద్ర ప్రచారం సైతం బీజేపీకి అనుకూలిస్తుందని భావిస్తున్నారు. అయితే స్థానికేతరుడంటూ ప్రత్యర్థుల విమర్శలనెదుర్కొంటున్న సన్నీదేవల్కి స్థానిక సమస్యలు తెలియకపోవడం వల్ల సినీ డైలాగులు తప్ప ప్రజాసమస్యల ప్రస్తావన ఆయన ప్రచారంలో కొరవడిందన్న విమర్శలు వెంటాడుతున్నాయి. ఈ ప్రాంతంలో వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం, రైతాంగానికి రుణమాఫీ ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ప్రధానంగా చెరకు రైతులకు గత పంటలకాలంలో చెల్లించాల్సిన 85 కోట్లరూపాయల చక్కెర మిల్లుల బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ‘‘ బీజేపీ జాతీయవాదం తమకు ఉపాధి కల్పించలేదు. కానీ కొత్త ఫ్యాక్టరీల నిర్మాణం, అభివృద్ధీ ఆ పని చేయగలుగుతుంది’’ అని 2017లో ఉపాధి కోల్పోయిన స్థానిక యువకుడు జగ్రాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. సిట్టింగ్ ఎంపీ సునీల్ జాఖడ్‌పై ఈ ప్రాంత ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారన్న విమర్శలున్నాయి. దానికి తోడు స్థానికంగా అక్రమ మైనింగ్ ఆరోపణలు సైతం ఆయన ఎదుర్కొంటుండడం సన్నీదేవల్కి కలిసొచ్చే అంశమని విశ్లేషకుల అంచనా. -
బీజేపీ, కాంగ్రెస్ గరమ్ గరమ్ పోటీ
హిమాచల్‌ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలకు చివరి దశలో ఈ నెల 19న పోలింగ్ జరుగుతుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని నాలుగు సీట్లను బీజేపీ గెలుచుకుంది. 1989 నుంచీ జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే ఒక్క 1991లోనే కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు చెరో రెండు సీట్లు కైవసం చేసుకున్నాయి. కిందటి పార్లమెంటు ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, ఇప్పుడు కాషాయ ప్రభుత్వ పాలన సాగుతోంది. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 53.8 శాతం ఓట్లతో నాలుగు సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 41 శాతం ఓట్లు సాధించినా ఒక్క సీటూ దక్కించుకోలేకపోయింది. రాజధాని సిమ్లాతోపాటు మండీ, కాంగ్ఢా, హమీర్పూర్ లోక్‌సభ స్థానాలకు బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. 2018 నవంబర్‌లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 68 సీట్లలో 44 స్థానాలు కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చింది. సిమ్లా బరిలో బీజేపీ కొత్త అభ్యర్థి షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్‌చేసిన సిమ్లా స్థానంలో బీజేపీ సిట్టింగ్ సభ్యుడు వీరేందర్ కశ్యప్‌కు బదులు సురేష్ కశ్యప్‌కు టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ తరఫున ధనీరామ్ శాండిల్ బరిలోకి దిగారు. కిందటి ఎన్నికల్లో వీరేందర్(బీజేపీ) తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి మోహన్‌లాల్ బ్రాక్తాను 84 వేలలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఓడించారు. ప్రస్తుత అభ్యర్థులు సురేష్ కశ్యప్, ధనీరామ్ శాండిల్ కోలీ(ఎస్సీ) కులానికి చెందినవారే. ఇద్దరికీ సైన్యంలో పనిచేసిన అనుభవం ఉంది. నియోజకవర్గ పరిధిలోని సిర్మోర్ ప్రాంతంలోని హాటీ సామాజికవర్గానికి ఆదివాసీ(ఎస్టీ) హోదా కల్పించడం ఈ ఎన్నికల్లో ముఖ్యాంశంగా మారింది. ఈ వర్గం ప్రజల్లో ఉన్న అసంతృప్తి కారణంగా సిట్టింగ్ సభ్యుడు వీరేందర్‌కు బీజేపీ టికెట్ ఇవ్వలేదు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన మెరుపు దాడులను ఎన్నికల్లో గెలుపునకు బీజేపీ వాడుకుంటోందని గతంలో సిమ్లాకు రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ అభ్యర్థి శాండిల్ ప్రచారం చేస్తున్నారు. పాక్‌పై వైమానిక దాడులపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తోందంటూ బీజేపీ అభ్యర్థి విమర్శిస్తున్నారు. హమీర్‌పూర్‌లో నాలుగోసారి అనురాగ్ కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ జరుగుతున్న మరో నియోజకవర్గం హమీర్పూర్. ఎప్పుడూ ఠాకూర్లే గెలిచే ఈ స్థానం నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఇప్పటికి వరుసగా మూడుసార్లు ఎన్నికయ్యారు. మాజీ సీఎం ప్రేమ్‌కుమార్ ధూమల్ కుమారుడైన అనురాగ్ ఇంతకు ముందు క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షునిగా పనిచేశారు. ఆయన బీజేపీ టికెట్‌పై నాలుగోసారి పోటీకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి రామ్‌లాల్ ఠాకూర్ పోటీచేస్తున్నారు. ఆయనకు గతంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. రాష్ట్ర కబడ్డీ జట్టులో సభ్యునిగా ఆయన ఆరుసార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. 1998 నుంచీ బీజేపీ అభ్యర్థులే గెలుస్తున్న ఈ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అనురాగ్ తండ్రి ధూమల్ కూడా గతంలో ఇక్కడి నుంచి మూడుసార్లు గెలిచారు. 44 ఏళ్ల అనురాగ్ 2014లో తన సమీప అభ్యర్థి రాజేంద్ర రాణాను 98 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. నాలుగోసారి విజయానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అనురాగ్‌కు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామ్‌లాల్ గట్టి పోటీ ఇస్తున్నారు. కాంగ్ఢాలో మంత్రితో కాంగ్రెస్ ఎమ్మెల్యే పోటీ రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బీజేపీ సీనియర్ నేత శాంతాకుమార్ 2014లో నాలుగోసారి గెలిచిన కీలక నియోజవర్గం కాంగ్ఢా. కిందటిసారి ఆయన తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి చందర్కుమార్ను లక్షా 70 వేలకు పైగా ఓట్లతో ఓడించారు. బీజేపీ ఈసారి 84 ఏళ్ల శాంతాకుమార్కు బదులు రాష్ట్ర మంత్రి కిషన్ కపూర్‌ను పోటీకి దింపింది. కాంగ్రెస్ తరఫున పార్టీ ఎమ్మెల్యే పవన్ కాజల్ పోటీలో ఉన్నారు. బీసీ వర్గానికి చెందిన కాజల్ ఈ ప్రాంతంలో గణనీయ సంఖ్యలో ఉన్న గద్దీ కుటుంబంలో జన్మించారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ స్థానానికి ఆనుకుని ఉన్న కాంగ్ఢాలో పంజాబీలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి కపూర్ కూడా పంజాబీయే. బీజేపీ తరఫున బాలీవుడ్ నటుడు, గురుదాస్‌పూర్ బీజేపీ అభ్యర్థి సన్నీ దేవల్, కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ, పంజాబ్ మంత్రి నవజోత్‌సింగ్ సిద్ధూ పాల్గొంటున్నారు. -
సునీల్ జాఖడ్ అభ్యర్థని ముందు తెలియదు: ధర్మేంద్ర
గురుదాస్‌పూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాఖఢ్ అని ముందే తెలిస్తే తన కొడుకు సన్నీ దేవల్‌ను ఆయనపై పోటీచేయనిచ్చేవాణ్ని కాదని సన్నీ తండ్రి, ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సునీల్ తండ్రి, లోక్‌సభ మాజీ స్పీకర్ బలరామ్ జాఖడ్‌పై తనకు ఎనలేని గౌరవం ఉందని ఆయన అన్నారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి సన్నీని బీజేపీ ఎన్నికల్లో నిలిపింది. 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి గెలిచిన మరో బాలీవుడ్ హీరో వినోద్ ఖన్నా మరణించాక జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేసిన సునీల్ జాఖడ్ గెలిచారు. ఆయన మళ్లీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీకి దిగారు. ‘‘నేను గురుదాస్‌పూర్ చేరుకున్నాకే సునీల్ పోటీచేస్తున్న విషయం తెలిసింది. ఆయన నాకు కొడుకులాంటి వాడు. అయితే, ఇప్పుడు ప్రచారం కూడా ప్రారంభమయ్యాక పోటీ నుంచి వైదొలగడం కుదరదు,’’ అని 83 ఏళ్ల ధర్మేంద్ర చెప్పారు. సన్నీతో బహిరంగ చర్చకు సునీల్ ఆహ్వానించారన్న విషయం గుర్తుచేయగా, ‘‘సన్నీ ఆయనతో చర్చించలేడు. సునీల్‌కు రాజకీయానుభవం ఉంది. ఆయన తండ్రి రాజకీయవేత్త. మేమేమో సినీరంగం నుంచి వచ్చాం. మేం ఇక్కడకు చర్చించడానికి రాలేదు. ప్రజల సమస్యలు వినడానికి వచ్చాం,’’అని ధర్మేంద్ర వివరించారు. బలరామ్ రాజకీయ పాఠాలు నేర్పారు ‘‘మొదట నాకు ఎమ్మెల్యేకు, ఎంపీకి తేడా తెలియదు. రాజకీయాల్లో మౌలిక పాఠాలు నాకు బలరామ్ జాఖడ్ నేర్పారు. ఆయన రాజస్తాన్ నుంచి మొదట పోటీచేసినప్పుడు నేను ఆయన తరఫున ప్రచారం చేశాను,’’అని ధర్మేంద్ర తెలిపారు. 2004 ఎన్నికల్లో రాజస్తాన్‌లోని చురూ స్థానంలో బలరామ్ జాఖడ్‌పై పోటీచేయాలని బీజేపీ కోరితే అందుకు తాను నిరాకరించానని, చివరికి బికనీర్ నుంచి బీజేపీ తరఫున పోటీకి దిగి గెలిచానని ఆయన గుర్తుచేశారు. ‘‘ఆ ఎన్నికల్లోనే పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ భార్య ప్రణీత్ కౌర్‌పై పాటియాలాలో పోటీచేయాలని ఓ దశలో బీజేపీ కోరింది. అందుకు నేను అంగీకరించలేదు. అమరీందర్ తండ్రి పాటియాలా సంస్థానాధీశుడు. మొదట ఆయనే తన రాజ్యాన్ని భారత్‌లో విలీనం చేశారు. ప్రణీత్ నా సోదరి వంటిది. ఆమెపై పోటీకి అందుకే నిరాకరించాను,’’ అని ఆయన అన్నారు. ‘‘రాజకీయాల్లో రాణించడం చాలా కష్టమని సన్నీకి చెప్పాను. ఎన్నికల్లో పోటీచేయడానికి అప్పటికే ఒప్పుకున్నానని సన్నీ జవాబిచ్చాడు. గురుదాస్‌పూర్ నుంచి పోటీకి సన్నీని ఎవరు ఒప్పించారో నాకు తెలియదు. ఒకసారి దిగాక ఎన్నికల రంగం నుంచి పారిపోయేది లేదు. సినిమా రంగంలో కూడా అగ్రస్థానాలకు చేరుకోవడానికి కొందరు రాజకీయాలు చేస్తారు. కాని, నేనెన్నడూ అక్కడ రాజకీయాలు చేయలేదు.’’ అని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో యూపీలోని మథుర నుంచి తన భార్య, నటి హేమమాలిని మరోసారి పోటీకి దిగడం గురించి ప్రస్తావిస్తూ, తమది రాజకీయ కుటుంబం కాదని ఆయన అన్నారు. -
సన్నీడియోల్ @ 87 కోట్లు
చండీగఢ్/గురుదాస్‌పూర్: గదర్, ఘాయల్, బోర్డర్ చిత్రాలతో బాలీవుడ్ సినిమాలలో తనదైన ముద్ర వేసిన నటుడు, దర్శకుడు, నిర్మాత సన్నీడియోల్ సోమవారం గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలతోపాటు ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్‌ను సమర్పించారు. తన పేరుమీద, తన భార్య పేరు ఉన్న మొత్తం ఆస్తులను రూ. 87.18 కోట్లుగా ప్రకటించారు. రూ. 60.46 కోట్ల చరాస్తులు, రూ. 21కోట్ల స్థిరాస్తులను ఆయన చూపించారు. 2017–18లో ఆదాయాన్ని రూ. 63,82 లక్షలు, 2016–17లో వార్షికాదాయం 96.29 లక్షలు, 2015–16లో వార్షికాదాయం రూ. 2.25 కోట్లుగా ప్రకటించారు. తన బ్యాంకు ఖాతాలో రూ. 26 లక్షలు ఉన్నాయని, తన భార్య లిండా డియోల్ బ్యాంకు ఖాతాలో రూ. 16 లక్షల నగదు ఉందని తెలిపారు. -
ప్రధానితో సన్నీ డియోల్ భేటీ
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటుడు సన్నీ డియోల్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. డియోల్‌తో కలిసి ఉన్న ఫొటోను ఈ సందర్భంగా ప్రధాని ట్వీట్ చేశారు. ‘డియోల్‌ని కలిసినందుకు సంతోషంగా ఉంది. అతనిలోని వినయం, భారతదేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై అతనికి ఉన్న లోతైన అవగాహన నన్ను ఆకర్షించాయి. గురుదాస్‌పూర్‌లో డియోల్ విజయానికి మేమంతా కృషి చేస్తున్నాం’అని ట్వీట్లో తెలిపారు. అలాగే డియోల్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘గదర్’లోని ‘హిందుస్తాన్ జిందాబాద్ హై.. థా.. ఔర్ రహేగా’అనే డైలాగ్‌ను కూడా జతచేశారు. దీనికి తామిద్దరం కట్టుబడి ఉన్నామని తెలిపారు. కాగా, దక్షిణ ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్లుగా ఎంపికైన సునీతా కంగ్రా, అవతార్ సింగ్, అంజూ కమల్‌కాంత్‌లు కూడా ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని వారికి అభినందనలు తెలిపారు. ఢిల్లీని మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. కాగా, ప్రముఖ నటుడు ధర్మేంద్ర కుమారుడైన డియోల్ ఇటీవల బీజేపీలో చేరారు. గురుదాస్‌పూర్ నుంచి పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సునీల్ జఖార్‌పై ఆయన పోటీ చేయనున్నారు. -
టికెట్ ఇవ్వకున్నా.. ఆయనకే నా సపోర్టు!
న్యూఢిల్లీ : తనకు టికెట్ ఇవ్వకపోయినప్పటికీ బీజేపీకి తన మద్దతు ఉంటుందని దివంగత ఎంపీ, నటుడు వినోద్ ఖన్నా భార్య కవితా ఖన్నా స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా పంజాబ్‌లోని గురుదాస్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆమె భావించిన సంగతి తెలిసిందే. మొదట ఆమెకు టికెట్ కేటాయించేందుకు బీజేపీ అధిష్టానం సుముఖత వ్యక్తం చేసింది. కానీ చివరి నిమిషంలో.. పార్టీలో చేరిన సీనియర్ నటుడు సన్నీ డియోల్‌ను బరిలో దించడంతో కవిత తీవ్ర నిరాశకు లోనయ్యారు. నామినేషన్ వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత అధిష్టానం ఇలా వ్యవహరించడం తనను బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆమె ఇండిపెండెంట్‌గా పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడిన కవితా ఖన్నా.. ‘ ఈ విషయాన్ని వివాదంగా మార్చదలచుకోలేదు. పార్టీ కోసం త్యాగం చేయాలని నిర్ణయించుకున్నా. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీకే నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే నా విషయంలో జరిగిన తప్పు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నా. ఎన్నికల కోసం సర్వం సిద్ధం చేసుకున్న తర్వాత టికెట్‌ను వేరే వాళ్లకు కేటాయించారు. ఈ విషయంలో నేను చాలా బాధపడ్డాను. తిరస్కారభావంతో కుంగిపోయాను. ఆ సమయంలో తమ పార్టీలో చేరాల్సిందిగా ఎంతోమంది నన్ను సంప్రదించారు. కానీ నేనలా చేయలేదు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగినా నేను కచ్చితంగా గెలిచి తీరతాను. అయితే నా వ్యక్తిగత ప్రయోజనాల కన్నా, పార్టీ, జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చి... గురుదాస్‌పూర్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నా’ అని పేర్కొన్నారు. కాగా బాలీవుడ్ వినోద్ ఖన్నా లోక్‌సభ ఎంపీగా గురుదాస్‌పూర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. బీజేపీ టికెట్‌పై నాలుగు పర్యాయాలు(1998.99, 2004, 2014) గెలిచిన ఆయన ఏప్రిల్ 2017న మరణించారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జకార్ గెలుపొందారు. ఇక లోక్‌సభ చివరి దశ ఎన్నికల్లో భాగంగా మే19న పంజాబ్‌లో పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే. -
ఉప ఎన్నికల రిజల్ట్స్.. బీజేపీకి బిగ్ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఆదివారం వెలువడిన ఓ పార్లమెంట్, అసెంబ్లీ నియోజక వర్గాల ఉప ఎన్నిక ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి ఊహించని రీతిలో ఘోర పరాభవం ఎదురయ్యింది. కేరళ వెంగర అసెంబ్లీ స్థానాన్ని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ నిలుపుకోగా, గురుదాస్‌పూర్ లోక్‌సభ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాఖర్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి స్వర్ణ్ సాలారియాపై లక్షా 93 వేల 219 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆప్ తరఫున మేజర్ జనరల్ సురేష్ ఖజారియాకు స్వర్ణ్‌కు మంచి పోటీ ఇచ్చారనే తెలుస్తోంది. ఈ ఓటమితో ఆరు నెలల క్రితం పంజాబ్ లో సంకీర్ణ అధికారానికి దూరమైన బీజేపీకి మరో ఎదురు దెబ్బ తగిలినట్లయ్యింది. ఈ విజయంపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ప్రజలు తమవైపే ఉన్నారని, కేంద్రంలోని బీజేపీ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నదానికి ఈ ఫలితాలు నిదర్శనమని పేర్కొంది. సీనియర్ నటుడు వినోద్ ఖన్నా ఆకస్మిక మరణంతో గురుదాస్ పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని గురుదాస్ పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగగా, గత ఎన్నికలతో పోలిస్తే చాలా తక్కువ శాతం (సుమారు 54 శాతం) పోలింగ్ నమోదు కావటం విశేషం. కేరళలోనూ వాడిన కమలం... ఇక కేరళ వెంగర అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితంలో మాత్రం ఊహించిన విధంగానే తీర్పు వచ్చింది. వెంగర అసెంబ్లీ నియోజక వర్గంలో ముస్లిం లీగ్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి కేఎన్ఏ ఖాదర్(యూడీఎఫ్ మద్దతుదారు).. ప్రత్యర్థి సీపీఐ(ఎం) అభ్యర్థి పీపీ బషీర్‌పై(ఎల్డీఎఫ్ మద్దతుదారు) 23,000 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. ది సోషలిస్ట్ డెమొక్రటిక్ పార్టీ మూడు స్థానంతో సరిపెట్టుకోగా, ఆరెస్సెస్ అల్లర్ల కారణంతో ఓటు బ్యాంకు దారుణంగా పడిపోయి బీజేపీ చివరకు నాలుగో స్థానానికే పరిమితం అయ్యింది. విజయంపై ఖాదర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం లీగ్ అభ్యర్థి కున్హాలీ కుట్టి 38,000 ఓట్ల తేడాతో విజయం సాధించగా.. ఈసారి మాత్రం ఆ మెజార్టీ 15000పైగా పడిపోవటం గమనార్హం. కున్హాలీ లోక్‌సభ(మలప్పురం నియోజకవర్గం)కు వెళ్లటంతో ఖాళీ అయిన వెంగర అసెంబ్లీ స్థానానికి అక్టోబర్ 11 ఉప ఎన్నిక నిర్వహించిన విషయం తెలిసిందే. -
పక్కా ప్లాన్ తోనే వచ్చారు..
గురుదాస్‌పూర్: కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఉగ్రవాదులు మళ్లీ పంజా విసిరారు. గత కొన్నాళ్లుగా కశ్మీర్లో వరుస కాల్పులతో కలకలం రేపుతున్న ఉగ్రవాదులు ఈసారి పంజాబ్‌ను టార్గెట్ చేశారు. గురుదాస్‌పూర్ జిల్లాలో జంట దాడులకు తెగబడ్డారు. ఉగ్రవాదులు మొదట బస్సుపై దాడి చేశారు. ఆ కలకలం నుంచి తేరుకోకముందే దీనానగర్ పోలీస్ స్టేషన్‌పై అటాక్ చేశారు. పోలీస్ స్టేషన్లోకి దూసుకొచ్చిన ముష్కరులు... అత్యాధునిక ఆయుధాలతో విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ జంట దాడుల్లో ఇద్దరు పోలీసులతో పాటు మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి పైగా గాయపడ్డారు. పంజాబ్‌లో దాడులు చేయడానికి ఉగ్రవాదులు పక్కా ప్రణాళికతో వచ్చినట్లు అర్థమవుతోంది. అంతే కాదు దాడి చేసే ప్రాంతాన్ని కూడా ముష్కరులు చాలా వ్యూహాత్మకంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. టెర్రరిస్టులు అటాక్ చేసిన దీనానగర్ పోలీస్ స్టేషన్ పంజాబ్-పాకిస్థాన్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలోనే ఉండడం గమనార్హం. ఈ తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఓ కారును హైజాక్ చేసినట్లు సమాచారం. ఆ కారులో సరిహద్దుల నుంచి గురుదాస్‌పూర్ జిల్లాలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు... ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సైనిక దుస్తులు ధరించారు. ఆర్మీ దుస్తుల్లో నలుగురు ఉగ్రవాదులు మొదట ఓ బస్సుపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. బస్సుపై దాడి తర్వాత ఉదయం 5 గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఉగ్రవాదులు దీనానగర్ పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించారు. అయితే వచ్చిన వారు సైనిక దుస్తుల్లో ఉండడంతో పోలీస్ స్టేషన్ సిబ్బంది అనుమానించలేదు. ఐతే వాళ్లు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో బిత్తరపోయిన కానిస్టేబుళ్లు ఎదురుకాల్పులకు దిగారు. అయితే అప్పటికే ఉగ్రవాదుల కాల్పులకు గార్డ్ డ్యూటీ చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ స్టేషన్లోకి చొరబడిన ఉగ్రవాదులు ప్రతీ 5 నిమిషాలకు ఒకసారి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఐతే ఉగ్రవాదులు పోలీస్ స్టేషన్‌పై దాడికి మాత్రమే పరిమితం కాలేదని, పెద్ద ఎత్తున రక్తపాతం సృష్టించే ఉద్దేశం ఉందని ఆ తర్వాతి పరిణామాలు తేటతెల్లం చేశాయి. గురుదాస్‌పూర్ జిల్లాలోని రైల్వే ట్రాక్‌పై ఉగ్రవాదులు ఐదు బాంబులు పెట్టారు. అదృష్టవశాత్తు భద్రతా దళాలు ముందుగానే వాటిని గుర్తించి నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్‌పై బాంబులు కనిపించిన నేపథ్యంలో అమృత్సర్-పఠాన్‌కోట్ మధ్య రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపేశారు. ఈ ప్రాంతంలో ఇతర రైల్వే ట్రాక్‌లపై ఎక్కడైనా బాంబులు పెట్టారేమో అనే అనుమానంతో విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. అలాగే పఠాన్‌కోట్ హైవేని మూసేసి ఉగ్రవాదుల కోసం తనిఖీలు చేపట్టారు. మరోవైపు... ప్రధాని కార్యాలయం కూడా పంజాబ్ ఉగ్రవాద దాడిపై దృష్టి సారించింది. పీఎంఓ వర్గాలు ఎప్పటికప్పుడు దాడికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నాయి. ఇదిలా ఉంటే పంజాబ్ దాడి దృష్ట్యా కేంద్ర నిఘా వర్గాలు హై అలర్ట్ ప్రకటించాయి. ఢిల్లీ సహా ప్రధాన ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించాయి. ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, బసు స్టేషన్లు, షాపింగ్ మాల్స్ సహా జనసమ్మర్థ ప్రాంతాల్లో తనిఖీలను తీవ్రం చేయాలని హెచ్చరించాయి. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశాయి. అటు... రక్షణమంత్రి మనోహర్ పారికర్... పంజాబ్ దాడిపై ఆచితూచి స్పందించారు. దాడి జరిగిన ప్రాంతానికి సైన్యాన్ని తరలించామని... మిగతా వివరాలను కేంద్ర హోంశాఖ వెల్లడిస్తుందని పారికర్ తెలిపారు. మరోవైపు పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. పంజాబ్ డీజీపీతో మాట్లాడిన బాదల్... దాడి ఘటనపై వివరాలను సేకరించారు. -
దద్దరిల్లిన దీనానగర్
గురుదాస్ పూర్: తుపాకీ తూటాల మోతతో పంజాబ్ లోని దీనానగర్ పట్టణం దద్దరిల్లింది. తమ ప్రాంతంలోకి చొరబడిన ముష్కరులు సాగించిన విధ్వంసకాండతో దీనానగర్ వాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చి ఉగ్రవాదులు మారణకాండకు తెగబడ్డారన్న సమాచారంతో దీనానగర్ ప్రజలు బెంబేలెత్తారు. ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు టీవీలకు అతుక్కుపోయారు. పాఠశాలలు, కాలేజీలు, ఇతర సంస్థలు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. గురుదాస్ పూర్ జిల్లాలో మూడో అతిపెద్ద పట్టణమైన దీనానగర్ పై సాయుధ దుండగులు దండెత్తారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపి చివరకు పోలీస్ స్టేషన్ లో నక్కారు. మొదట కమల్ జీత్ సింగ్ మాథారు అనే వ్యక్తి నుంచి మారుతి 800 వాహనాన్ని లాక్కుని అతడిపై కాల్పులు జరిపారు. తర్వాత రోడ్డుపక్కనున్న హోటల్ పై కాల్పులు జరిపి చిరువ్యాపారిని పొట్టనపెట్టుకున్నారు. కదులుతున్న బస్సుపై కాల్పులు జరపడంతో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. తర్వాత హెల్త్ సెంటర్ లక్ష్యంగా దాడికి దిగారు. పోలీస్ స్టేషన్ లోకి చొరబడే ముందు పోలీసులు నివాసముంటున్న క్వార్టర్స్ పై గ్రెనేడ్లు విసిరారు. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఉగ్రవాదులు, సైనిక బలగాలు జరుపుతున్న కాల్పులతో దీనానగర్ దద్దరిల్లింది. ముష్కర మూక దాడితో దీనానగర్ వాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. కార్యాలయాలకు సెలవు పెట్టారు. పిల్లలను స్కూల్స్ మానిపించారు. మరోవైపు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. -
టెర్రరిస్టుల్లో ఒకడు వీడే
గురుదాస్ పూర్: పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఇద్దరిని భద్రత బలగాలు హతమార్చాయి. మృతి చెందిన ఉగ్రవాదుల్లో ఒకరి దగ్గర ఏకే-47 తుపాకీ, పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి ఉన్నాయి. నలుపు రంగు దుస్తులు ధరించి, చేతులకు గ్లౌజులు వేసుకుని గుబురు గడ్డంతో ఉన్నాడు. మృతుల పేరు, వివరాలు వెల్లడికావాల్సి ఉంది. నలుగురు ఉగ్రవాదులు దాడిలో పాల్గొన్నట్టు సమాచారం. మరోవైపు దీనానగర్ పోలీసు స్టేషన్ లో నక్కిన ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు సైనిక బలగాలు రంగంలోకి దిగాయి. ఉగ్రవాదుల దాడిలో 13 మంది మృతి చెందారు. ఉగ్ర దాడి నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. సీనియర్ మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసరంగా సమావేశమయ్యారు. సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. పార్లమెంట్ వద్ద అదనపు బలగాలు మొహరించారు. -
'ఆ పరిస్థితిని ఎదుర్కొనే సత్తా ఉంది'
న్యూఢిల్లీ: పంజాబ్ లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో తలెత్తిన పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొంటామని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ప్రకటించింది. ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే సత్తా భారత ప్రభుత్వానికి ఉందని పీఎంఓ వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలో ఉగ్రవాదులు దాడికి తెగబడిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. హోంమంత్రిత్వ శాఖ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని చెప్పారు. ఇటువంటి దాడులను తిప్పికొట్టగల సత్తా తమకు ఉందని పునరుద్ఘాటించారు. -
'సరిహద్దులో అప్రమత్తంగా ఉండాలి'
న్యూఢిల్లీ: పంజాబ్ లో ఉగ్రవాదుల దాడితో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఇండియా- పాకిస్థాన్ సరిహద్దు వెంట అప్రమత్తంగా ఉండాలని బీఎస్ఎఫ్ డీజీ డీకే పాథక్ తో ఆదేశించినట్టు ట్విటర్ లో పేర్కొన్నారు. పంజాబ్ లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వెల్లడించారు. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, హోంశాఖ, ఎన్ఎస్ఏ కార్యదర్శులతో మాట్లాడానని చెప్పారు. గురుదాస్ పూర్, పంజాబ్ లో పరిస్థితిని కనిపెట్టి చూస్తున్నామన్నారు. భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని చెప్పారు. ఉగ్రవాదులను మట్టుబెట్టే ఆపరేషన్ కొనసాగుతోందని, త్వరలోనే పరిస్థితి అదుపులోకి వస్తుందని తెలిపారు. Spoke to DG BSF Shri DK Pathak and instructed him to step up the vigil on India-Pakistan border in the wake of attack in Gurudaspur — Rajnath Singh (@BJPRajnathSingh) July 27, 2015