పక్కా ప్లాన్ తోనే వచ్చారు.. | Terror strikes Punjab, 13 killed in early morning attacks | Sakshi
Sakshi News home page

పక్కా ప్లాన్ తోనే వచ్చారు..

Published Mon, Jul 27 2015 2:04 PM | Last Updated on Sun, Sep 3 2017 6:16 AM

పక్కా ప్లాన్ తోనే వచ్చారు..

పక్కా ప్లాన్ తోనే వచ్చారు..

గురుదాస్పూర్: కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఉగ్రవాదులు మళ్లీ పంజా విసిరారు. గత కొన్నాళ్లుగా కశ్మీర్‌లో వరుస కాల్పులతో కలకలం రేపుతున్న ఉగ్రవాదులు ఈసారి పంజాబ్‌ను టార్గెట్ చేశారు. గురుదాస్‌పూర్ జిల్లాలో జంట దాడులకు తెగబడ్డారు. ఉగ్రవాదులు మొదట బస్సుపై దాడి చేశారు. ఆ కలకలం నుంచి తేరుకోకముందే దీనానగర్‌ పోలీస్ స్టేషన్‌పై అటాక్ చేశారు. పోలీస్ స్టేషన్‌లోకి దూసుకొచ్చిన ముష్కరులు... అత్యాధునిక ఆయుధాలతో విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ జంట దాడుల్లో ఇద్దరు పోలీసులతో పాటు మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి పైగా గాయపడ్డారు.

పంజాబ్‌లో దాడులు చేయడానికి ఉగ్రవాదులు పక్కా ప్రణాళికతో వచ్చినట్లు అర్థమవుతోంది. అంతే కాదు దాడి చేసే ప్రాంతాన్ని కూడా ముష్కరులు చాలా వ్యూహాత్మకంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. టెర్రరిస్టులు అటాక్ చేసిన దీనానగర్ పోలీస్ స్టేషన్‌ పంజాబ్-పాకిస్థాన్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలోనే ఉండడం గమనార్హం. ఈ తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఓ కారును హైజాక్ చేసినట్లు సమాచారం. ఆ కారులో సరిహద్దుల నుంచి గురుదాస్‌పూర్ జిల్లాలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు... ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సైనిక దుస్తులు ధరించారు.

ఆర్మీ దుస్తుల్లో నలుగురు ఉగ్రవాదులు మొదట ఓ బస్సుపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. బస్సుపై దాడి తర్వాత ఉదయం 5 గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఉగ్రవాదులు దీనానగర్ పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించారు. అయితే వచ్చిన వారు సైనిక దుస్తుల్లో ఉండడంతో పోలీస్ స్టేషన్ సిబ్బంది అనుమానించలేదు. ఐతే వాళ్లు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో బిత్తరపోయిన కానిస్టేబుళ్లు ఎదురుకాల్పులకు దిగారు. అయితే అప్పటికే ఉగ్రవాదుల కాల్పులకు గార్డ్ డ్యూటీ చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీస్ స్టేషన్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు ప్రతీ 5 నిమిషాలకు ఒకసారి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఐతే ఉగ్రవాదులు పోలీస్ స్టేషన్‌పై దాడికి మాత్రమే పరిమితం కాలేదని, పెద్ద ఎత్తున రక్తపాతం సృష్టించే ఉద్దేశం ఉందని ఆ తర్వాతి పరిణామాలు తేటతెల్లం చేశాయి. గురుదాస్‌పూర్‌ జిల్లాలోని రైల్వే ట్రాక్‌పై ఉగ్రవాదులు ఐదు బాంబులు పెట్టారు. అదృష్టవశాత్తు భద్రతా దళాలు ముందుగానే వాటిని గుర్తించి నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

రైల్వే ట్రాక్‌పై బాంబులు కనిపించిన నేపథ్యంలో అమృత్‌సర్‌-పఠాన్‌కోట్ మధ్య రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపేశారు. ఈ ప్రాంతంలో ఇతర రైల్వే ట్రాక్‌లపై ఎక్కడైనా బాంబులు పెట్టారేమో అనే అనుమానంతో విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. అలాగే పఠాన్‌కోట్‌ హైవేని మూసేసి ఉగ్రవాదుల కోసం తనిఖీలు చేపట్టారు.

మరోవైపు... ప్రధాని కార్యాలయం కూడా పంజాబ్ ఉగ్రవాద దాడిపై దృష్టి సారించింది. పీఎంఓ వర్గాలు ఎప్పటికప్పుడు దాడికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నాయి. ఇదిలా ఉంటే పంజాబ్ దాడి దృష్ట్యా కేంద్ర నిఘా వర్గాలు హై అలర్ట్ ప్రకటించాయి. ఢిల్లీ సహా ప్రధాన ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించాయి. ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, బసు స్టేషన్లు, షాపింగ్ మాల్స్‌ సహా జనసమ్మర్థ ప్రాంతాల్లో తనిఖీలను తీవ్రం చేయాలని హెచ్చరించాయి. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశాయి.

అటు... రక్షణమంత్రి మనోహర్ పారికర్... పంజాబ్ దాడిపై ఆచితూచి స్పందించారు. దాడి జరిగిన ప్రాంతానికి సైన్యాన్ని తరలించామని... మిగతా వివరాలను కేంద్ర హోంశాఖ వెల్లడిస్తుందని పారికర్ తెలిపారు. మరోవైపు పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. పంజాబ్ డీజీపీతో మాట్లాడిన బాదల్... దాడి ఘటనపై వివరాలను సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement