terrorist attack in punjab
-
పక్కా ప్లాన్ తోనే వచ్చారు..
గురుదాస్‌పూర్: కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఉగ్రవాదులు మళ్లీ పంజా విసిరారు. గత కొన్నాళ్లుగా కశ్మీర్లో వరుస కాల్పులతో కలకలం రేపుతున్న ఉగ్రవాదులు ఈసారి పంజాబ్‌ను టార్గెట్ చేశారు. గురుదాస్‌పూర్ జిల్లాలో జంట దాడులకు తెగబడ్డారు. ఉగ్రవాదులు మొదట బస్సుపై దాడి చేశారు. ఆ కలకలం నుంచి తేరుకోకముందే దీనానగర్ పోలీస్ స్టేషన్‌పై అటాక్ చేశారు. పోలీస్ స్టేషన్లోకి దూసుకొచ్చిన ముష్కరులు... అత్యాధునిక ఆయుధాలతో విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ జంట దాడుల్లో ఇద్దరు పోలీసులతో పాటు మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి పైగా గాయపడ్డారు. పంజాబ్‌లో దాడులు చేయడానికి ఉగ్రవాదులు పక్కా ప్రణాళికతో వచ్చినట్లు అర్థమవుతోంది. అంతే కాదు దాడి చేసే ప్రాంతాన్ని కూడా ముష్కరులు చాలా వ్యూహాత్మకంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. టెర్రరిస్టులు అటాక్ చేసిన దీనానగర్ పోలీస్ స్టేషన్ పంజాబ్-పాకిస్థాన్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలోనే ఉండడం గమనార్హం. ఈ తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఓ కారును హైజాక్ చేసినట్లు సమాచారం. ఆ కారులో సరిహద్దుల నుంచి గురుదాస్‌పూర్ జిల్లాలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు... ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సైనిక దుస్తులు ధరించారు. ఆర్మీ దుస్తుల్లో నలుగురు ఉగ్రవాదులు మొదట ఓ బస్సుపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. బస్సుపై దాడి తర్వాత ఉదయం 5 గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఉగ్రవాదులు దీనానగర్ పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించారు. అయితే వచ్చిన వారు సైనిక దుస్తుల్లో ఉండడంతో పోలీస్ స్టేషన్ సిబ్బంది అనుమానించలేదు. ఐతే వాళ్లు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో బిత్తరపోయిన కానిస్టేబుళ్లు ఎదురుకాల్పులకు దిగారు. అయితే అప్పటికే ఉగ్రవాదుల కాల్పులకు గార్డ్ డ్యూటీ చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ స్టేషన్లోకి చొరబడిన ఉగ్రవాదులు ప్రతీ 5 నిమిషాలకు ఒకసారి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఐతే ఉగ్రవాదులు పోలీస్ స్టేషన్‌పై దాడికి మాత్రమే పరిమితం కాలేదని, పెద్ద ఎత్తున రక్తపాతం సృష్టించే ఉద్దేశం ఉందని ఆ తర్వాతి పరిణామాలు తేటతెల్లం చేశాయి. గురుదాస్‌పూర్ జిల్లాలోని రైల్వే ట్రాక్‌పై ఉగ్రవాదులు ఐదు బాంబులు పెట్టారు. అదృష్టవశాత్తు భద్రతా దళాలు ముందుగానే వాటిని గుర్తించి నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్‌పై బాంబులు కనిపించిన నేపథ్యంలో అమృత్సర్-పఠాన్‌కోట్ మధ్య రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపేశారు. ఈ ప్రాంతంలో ఇతర రైల్వే ట్రాక్‌లపై ఎక్కడైనా బాంబులు పెట్టారేమో అనే అనుమానంతో విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. అలాగే పఠాన్‌కోట్ హైవేని మూసేసి ఉగ్రవాదుల కోసం తనిఖీలు చేపట్టారు. మరోవైపు... ప్రధాని కార్యాలయం కూడా పంజాబ్ ఉగ్రవాద దాడిపై దృష్టి సారించింది. పీఎంఓ వర్గాలు ఎప్పటికప్పుడు దాడికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నాయి. ఇదిలా ఉంటే పంజాబ్ దాడి దృష్ట్యా కేంద్ర నిఘా వర్గాలు హై అలర్ట్ ప్రకటించాయి. ఢిల్లీ సహా ప్రధాన ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించాయి. ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, బసు స్టేషన్లు, షాపింగ్ మాల్స్ సహా జనసమ్మర్థ ప్రాంతాల్లో తనిఖీలను తీవ్రం చేయాలని హెచ్చరించాయి. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశాయి. అటు... రక్షణమంత్రి మనోహర్ పారికర్... పంజాబ్ దాడిపై ఆచితూచి స్పందించారు. దాడి జరిగిన ప్రాంతానికి సైన్యాన్ని తరలించామని... మిగతా వివరాలను కేంద్ర హోంశాఖ వెల్లడిస్తుందని పారికర్ తెలిపారు. మరోవైపు పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. పంజాబ్ డీజీపీతో మాట్లాడిన బాదల్... దాడి ఘటనపై వివరాలను సేకరించారు. -
దద్దరిల్లిన దీనానగర్
గురుదాస్ పూర్: తుపాకీ తూటాల మోతతో పంజాబ్ లోని దీనానగర్ పట్టణం దద్దరిల్లింది. తమ ప్రాంతంలోకి చొరబడిన ముష్కరులు సాగించిన విధ్వంసకాండతో దీనానగర్ వాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చి ఉగ్రవాదులు మారణకాండకు తెగబడ్డారన్న సమాచారంతో దీనానగర్ ప్రజలు బెంబేలెత్తారు. ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు టీవీలకు అతుక్కుపోయారు. పాఠశాలలు, కాలేజీలు, ఇతర సంస్థలు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. గురుదాస్ పూర్ జిల్లాలో మూడో అతిపెద్ద పట్టణమైన దీనానగర్ పై సాయుధ దుండగులు దండెత్తారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపి చివరకు పోలీస్ స్టేషన్ లో నక్కారు. మొదట కమల్ జీత్ సింగ్ మాథారు అనే వ్యక్తి నుంచి మారుతి 800 వాహనాన్ని లాక్కుని అతడిపై కాల్పులు జరిపారు. తర్వాత రోడ్డుపక్కనున్న హోటల్ పై కాల్పులు జరిపి చిరువ్యాపారిని పొట్టనపెట్టుకున్నారు. కదులుతున్న బస్సుపై కాల్పులు జరపడంతో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. తర్వాత హెల్త్ సెంటర్ లక్ష్యంగా దాడికి దిగారు. పోలీస్ స్టేషన్ లోకి చొరబడే ముందు పోలీసులు నివాసముంటున్న క్వార్టర్స్ పై గ్రెనేడ్లు విసిరారు. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఉగ్రవాదులు, సైనిక బలగాలు జరుపుతున్న కాల్పులతో దీనానగర్ దద్దరిల్లింది. ముష్కర మూక దాడితో దీనానగర్ వాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. కార్యాలయాలకు సెలవు పెట్టారు. పిల్లలను స్కూల్స్ మానిపించారు. మరోవైపు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. -
టెర్రరిస్టుల్లో ఒకడు వీడే
గురుదాస్ పూర్: పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఇద్దరిని భద్రత బలగాలు హతమార్చాయి. మృతి చెందిన ఉగ్రవాదుల్లో ఒకరి దగ్గర ఏకే-47 తుపాకీ, పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి ఉన్నాయి. నలుపు రంగు దుస్తులు ధరించి, చేతులకు గ్లౌజులు వేసుకుని గుబురు గడ్డంతో ఉన్నాడు. మృతుల పేరు, వివరాలు వెల్లడికావాల్సి ఉంది. నలుగురు ఉగ్రవాదులు దాడిలో పాల్గొన్నట్టు సమాచారం. మరోవైపు దీనానగర్ పోలీసు స్టేషన్ లో నక్కిన ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు సైనిక బలగాలు రంగంలోకి దిగాయి. ఉగ్రవాదుల దాడిలో 13 మంది మృతి చెందారు. ఉగ్ర దాడి నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. సీనియర్ మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసరంగా సమావేశమయ్యారు. సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. పార్లమెంట్ వద్ద అదనపు బలగాలు మొహరించారు. -
'ఆ పరిస్థితిని ఎదుర్కొనే సత్తా ఉంది'
న్యూఢిల్లీ: పంజాబ్ లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో తలెత్తిన పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొంటామని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ప్రకటించింది. ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే సత్తా భారత ప్రభుత్వానికి ఉందని పీఎంఓ వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలో ఉగ్రవాదులు దాడికి తెగబడిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. హోంమంత్రిత్వ శాఖ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని చెప్పారు. ఇటువంటి దాడులను తిప్పికొట్టగల సత్తా తమకు ఉందని పునరుద్ఘాటించారు. -
'సరిహద్దులో అప్రమత్తంగా ఉండాలి'
న్యూఢిల్లీ: పంజాబ్ లో ఉగ్రవాదుల దాడితో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఇండియా- పాకిస్థాన్ సరిహద్దు వెంట అప్రమత్తంగా ఉండాలని బీఎస్ఎఫ్ డీజీ డీకే పాథక్ తో ఆదేశించినట్టు ట్విటర్ లో పేర్కొన్నారు. పంజాబ్ లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వెల్లడించారు. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, హోంశాఖ, ఎన్ఎస్ఏ కార్యదర్శులతో మాట్లాడానని చెప్పారు. గురుదాస్ పూర్, పంజాబ్ లో పరిస్థితిని కనిపెట్టి చూస్తున్నామన్నారు. భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని చెప్పారు. ఉగ్రవాదులను మట్టుబెట్టే ఆపరేషన్ కొనసాగుతోందని, త్వరలోనే పరిస్థితి అదుపులోకి వస్తుందని తెలిపారు. Spoke to DG BSF Shri DK Pathak and instructed him to step up the vigil on India-Pakistan border in the wake of attack in Gurudaspur — Rajnath Singh (@BJPRajnathSingh) July 27, 2015