సాధారణంగా అక్రమ సంపాదనపరులు తమ నల్లడబ్బును స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటారని అంటుంటారు. అక్కడి బ్యాంకుల్లో సొమ్మున్నట్టు బహిరంగంగా ఎవరూ చెప్పుకోరు. అయితే, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సునీల్ కుమార్ జాఖఢ్ మాత్రం తన భార్యకు స్విస్ బ్యాంకులో ఏడు కోట్ల రూపాయల విలువైన డిపాజిట్లు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. తన భార్య సిల్వియా జాఖఢ్ పేరుమీద జ్యూరిక్ లోని జ్యూర్‌చర్ కాంటోనల్ బ్యాంకులో 7.37 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయని ఎన్నికల సంఘానికి సమర్పించిన అస్తిపాస్తుల వివరాల్లో వెల్లడించారు. మధ్య ప్రదేశ్ మాజీ గవర్నర్ బలరాం జాఖడ్ కుమారుడైన సునీల్ ఈ నియోజకవర్గం సిట్టింగ్ ఎంపీ.
ఇక్కడ ఆయన ప్రముఖ బాలీవుడ్ హీరో సన్నీదేవల్‌తో తలపడుతున్నారు. స్విస్ బ్యాంకు సొమ్ము కాకుండా దేశంలోని వేర్వేరు బ్యాంకుల్లో 1.23 కోట్ల విలువైన డిపాజిట్లు ఉన్నాయని సునీల్ తెలిపారు. తన భార్యకు 12.06 కోట్ల విలువైన ఆస్తులున్నాయని పేర్కొన్నారు. ఇక సన్నీడియోల్ విషయానికి వస్తే ఆయనకు 60.46 కోట్ల విలువైన చరాస్తులు,21 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఆయన భార్య లిండా దేవల్‌కు 5.72 కోట్లు ఉన్నాయి. సన్నీదేవల్‌కు మొత్తం 49.3 కోట్ల అప్పులు ఉన్నాయి. ఆయన భార్య పేరు మీద 1.66 కోట్ల అప్పులున్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. సన్నీ దేవల్ జీఎస్‌టీ కింద కోటి 7 లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందట.
Comments
Please login to add a commentAdd a comment