గురుదాస్‌పూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాఖఢ్ అని ముందే తెలిస్తే తన కొడుకు సన్నీ దేవల్‌ను ఆయనపై పోటీచేయనిచ్చేవాణ్ని కాదని సన్నీ తండ్రి, ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సునీల్ తండ్రి, లోక్‌సభ మాజీ స్పీకర్ బలరామ్ జాఖడ్‌పై తనకు ఎనలేని గౌరవం ఉందని ఆయన అన్నారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి సన్నీని బీజేపీ ఎన్నికల్లో నిలిపింది. 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి గెలిచిన మరో బాలీవుడ్ హీరో వినోద్ ఖన్నా మరణించాక జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేసిన సునీల్ జాఖడ్ గెలిచారు.
ఆయన మళ్లీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీకి దిగారు. ‘‘నేను గురుదాస్‌పూర్ చేరుకున్నాకే సునీల్ పోటీచేస్తున్న విషయం తెలిసింది. ఆయన నాకు కొడుకులాంటి వాడు. అయితే, ఇప్పుడు ప్రచారం కూడా ప్రారంభమయ్యాక పోటీ నుంచి వైదొలగడం కుదరదు,’’ అని 83 ఏళ్ల ధర్మేంద్ర చెప్పారు. సన్నీతో బహిరంగ చర్చకు సునీల్ ఆహ్వానించారన్న విషయం గుర్తుచేయగా, ‘‘సన్నీ ఆయనతో చర్చించలేడు. సునీల్‌కు రాజకీయానుభవం ఉంది. ఆయన తండ్రి రాజకీయవేత్త. మేమేమో సినీరంగం నుంచి వచ్చాం. మేం ఇక్కడకు చర్చించడానికి రాలేదు. ప్రజల సమస్యలు వినడానికి వచ్చాం,’’అని ధర్మేంద్ర వివరించారు.
బలరామ్ రాజకీయ పాఠాలు నేర్పారు
‘‘మొదట నాకు ఎమ్మెల్యేకు, ఎంపీకి తేడా తెలియదు. రాజకీయాల్లో మౌలిక పాఠాలు నాకు బలరామ్ జాఖడ్ నేర్పారు. ఆయన రాజస్తాన్ నుంచి మొదట పోటీచేసినప్పుడు నేను ఆయన తరఫున ప్రచారం చేశాను,’’అని ధర్మేంద్ర తెలిపారు. 2004 ఎన్నికల్లో రాజస్తాన్‌లోని చురూ స్థానంలో బలరామ్ జాఖడ్‌పై పోటీచేయాలని బీజేపీ కోరితే అందుకు తాను నిరాకరించానని, చివరికి బికనీర్ నుంచి బీజేపీ తరఫున పోటీకి దిగి గెలిచానని ఆయన గుర్తుచేశారు. ‘‘ఆ ఎన్నికల్లోనే పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ భార్య ప్రణీత్ కౌర్‌పై పాటియాలాలో పోటీచేయాలని ఓ దశలో బీజేపీ కోరింది. అందుకు నేను అంగీకరించలేదు.
అమరీందర్ తండ్రి పాటియాలా సంస్థానాధీశుడు. మొదట ఆయనే తన రాజ్యాన్ని భారత్‌లో విలీనం చేశారు. ప్రణీత్ నా సోదరి వంటిది. ఆమెపై పోటీకి అందుకే నిరాకరించాను,’’ అని ఆయన అన్నారు. ‘‘రాజకీయాల్లో రాణించడం చాలా కష్టమని సన్నీకి చెప్పాను. ఎన్నికల్లో పోటీచేయడానికి అప్పటికే ఒప్పుకున్నానని సన్నీ జవాబిచ్చాడు. గురుదాస్‌పూర్ నుంచి పోటీకి సన్నీని ఎవరు ఒప్పించారో నాకు తెలియదు. ఒకసారి దిగాక ఎన్నికల రంగం నుంచి పారిపోయేది లేదు. సినిమా రంగంలో కూడా అగ్రస్థానాలకు చేరుకోవడానికి కొందరు రాజకీయాలు చేస్తారు. కాని, నేనెన్నడూ అక్కడ రాజకీయాలు చేయలేదు.’’ అని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో యూపీలోని మథుర నుంచి తన భార్య, నటి హేమమాలిని మరోసారి పోటీకి దిగడం గురించి ప్రస్తావిస్తూ, తమది రాజకీయ కుటుంబం కాదని ఆయన అన్నారు.
సునీల్ జాఖడ్ అభ్యర్థని ముందు తెలియదు: ధర్మేంద్ర
Published Mon, May 13 2019 5:13 AM | Last Updated on Mon, May 13 2019 5:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment