మోదీని ఢిల్లీలో కలిసిన బీజేపీ నేత సన్నీ డియోల్
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటుడు సన్నీ డియోల్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. డియోల్‌తో కలిసి ఉన్న ఫొటోను ఈ సందర్భంగా ప్రధాని ట్వీట్ చేశారు. ‘డియోల్‌ని కలిసినందుకు సంతోషంగా ఉంది. అతనిలోని వినయం, భారతదేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై అతనికి ఉన్న లోతైన అవగాహన నన్ను ఆకర్షించాయి. గురుదాస్‌పూర్‌లో డియోల్ విజయానికి మేమంతా కృషి చేస్తున్నాం’అని ట్వీట్‌లో తెలిపారు. అలాగే డియోల్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘గదర్’లోని ‘హిందుస్తాన్ జిందాబాద్ హై.. థా.. ఔర్ రహేగా’అనే డైలాగ్‌ను కూడా జతచేశారు. దీనికి తామిద్దరం కట్టుబడి ఉన్నామని తెలిపారు. కాగా, దక్షిణ ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్లుగా ఎంపికైన సునీతా కంగ్రా, అవతార్ సింగ్, అంజూ కమల్‌కాంత్‌లు కూడా ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని వారికి అభినందనలు తెలిపారు. ఢిల్లీని మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. కాగా, ప్రముఖ నటుడు ధర్మేంద్ర కుమారుడైన డియోల్ ఇటీవల బీజేపీలో చేరారు. గురుదాస్‌పూర్ నుంచి పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సునీల్ జఖార్‌పై ఆయన పోటీ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment