పఠాన్‌కోట్ కంటోన్మెంట్‌లో పాక్ గూఢచారి!
- వ్యక్తిని అరెస్టు చేసిన పంజాబ్ పోలీసులు
పఠాన్‌కోట్: ఉగ్రవాద దాడులకు గురైన పఠాన్‌కోట్ కంటోన్మెంట్‌లో ఓ భారత జాతీయుడిని పంజాబ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కి అతను ఏజెంట్‌గా పనిచేస్తున్నాడని నిఘా సంస్థలు సమాచారం అందించడంతో అదుపులోకి తీసుకున్నారు.
పఠాన్‌కోట్ కంటోన్మెంట్‌లోని భారత ఆర్మీ 29 డివిజన్ హెడ్ క్వార్టర్ లో ఇష్రాద్ అహ్మద్ సహాయ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతను ఐఎస్ఐకు అండర్ కవర్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నాడని తాజాగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. అతని స్మార్ట్ ఫోన్‌లో పఠాన్‌కోట్ లోని సున్నితమైన ప్రదేశాలకు సంబంధించిన ఫొటోలు లభించాయని నిఘావర్గాలు నివేదించినట్టు సమాచారం.
పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ దేశంలోనే అతి పెద్ద ఆర్మీ స్థావరం. వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది. గత నెలలో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎయిర్‌బేస్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ దీనిని ఇటీవలికాలంలో ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గత నెల జరిగిన ఉగ్రవాద దాడికి, ఇష్రాద్‌కు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో భద్రతా సంస్థలు దర్యాప్తు జరుపుతున్నాయి. సరిహద్దుల ఆవల ఉన్న ఉగ్రవాదుల నుంచి అందిన సూచనల మేరకే అతను నడుచుకున్నట్టు అనుమానిస్తున్నారు.