స్త్రీల కలలు తరచు సామాజిక నిబంధనల మధ్య పరిమితం అవుతుంటాయి. అలాంటి ప్రపంచంలో అనీ దివ్య అసమానతలను ధిక్కరించి కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లాలో పుట్టి, విజయవాడలో పెరిగిన అనీ దివ్య... బోయింగ్ 777 ను నడిపి ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళా కమాండర్‌గా పేరు పొందింది. ‘మహిళా కమాండర్లలో అతి పిన్నవయస్కురాలిగా చేరాలని కలలు కనలేదు. కానీ, అభిరుచి, అంకితభావం ఆమె కలను సాకారం చేశాయి’ అని చెప్పే ముప్పై ఏడేళ్ల దివ్య... మహిళా శక్తి అంటే ఏమిటో తన విజయగాధ ద్వారా మనకు పరిచయం చేస్తుంది.
‘అమ్మాయిలు పెద్దగా కలలు కనడానికి వీలులేని ప్రదేశం నుండి వచ్చాను’ అని చెప్పే దివ్య 11వ తరగతి వరకు సాధారణ విద్యార్థిని. ఆమె తన కలను సాకారం చేసుకోవడానికి 90 శాతం కంటే ఎక్కువ మార్కులు స్కోర్ చేయడం తప్పనిసరి అని తెలుసుకుంది. అడ్డంకులను అధిగమించాలని నిశ్చయించుకుని, సవాల్‌ను ఎదుర్కొంది. అదే సంవత్సరంలో అన్ని సబ్జెక్టులలో నూటికి నూరు మార్కులు స్కోర్ చేసింది. దీంతో ఆమె కలలు స్పష్టంగా ఉన్నాయి అని కుటుంబ సభ్యులకూ అర్ధమైంది. కానీ, ముందుకు వెళ్లే మార్గం సులభంగా లేదు. అందుకు తగినంత ఖర్చు పెట్టే ఆర్థిక స్తోమత ఆమె కుటుంబానికి లేదు.
కానీ, ఆమె తండ్రి ఫ్లయింగ్ స్కూల్ ఫీజు కోసం రుణం తీసుకున్నాడు. దీంతో ఆమె అసలు ప్రయాణం మొదలైంది. 17 ఏళ్ల వయసులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ ఫ్లయింగ్ స్కూల్‌లో చేరింది. 19 ఏళ్ల వయసులో కమర్షియల్ లైసెన్స్ పొందిన అతి పిన్న వయస్కురాలైన మహిళా పైలట్‌గా నిలిచింది. ట్రైనింగ్ పూర్తయ్యాక ఎయిర్ ఇండియాలో కో–పైలట్‌గా చేరింది. 21 ఏళ్ల వయసులో ట్రైనింగ్ కోసం లండన్‌కు వెళ్లింది. అక్కడ ఆమె బోయింగ్ 777ను నడపడం ప్రారంభించింది. పైలట్‌గానే కాదు కెప్టెన్ దివ్య మోటివేషనల్ స్పీకర్ కూడా. విమానయాన రంగంలో తన అనుభవాలు, సవాళ్లను వేదికలపై స్పీచ్‌లుగా ఇచ్చింది. ముంబై రిజ్వీ లా కాలేజీ నుండి ఎల్‌ఎల్‌బీ పట్టా కూడా పొందింది.
ఎగతాళి చేసేవారు
‘‘నాన్న ఆర్మీలో ఉద్యోగి అవడంతో మా కుటుంబం పఠాన్‌కోట్‌లో ఉండేది. నేను అక్కడే పుట్టాను. నాన్న వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని విజయవాడలో స్థిరపడ్డారు. అలా, నా స్కూల్ చదువు మొత్తం విజయవాడలోనే జరిగింది. చిన్నప్పటి నుంచి పైలట్ కావాలనే కోరిక ఉండేది. ఇది తెలిసి ఇతర పిల్లలు నన్ను ఎగతాళి చేసేవారు. పిల్లల్లో చాలామంది ఇంజనీరింగ్ లేదా డాక్టర్ కావా లనే అనుకునేవారు. అదృష్టవశాత్తు నా ఎంపికకు నా తల్లిదండ్రులు మద్దతు ఇచ్చారు. మా అమ్మ ఎప్పుడూ నన్ను ప్రోత్సహించేది. అయితే, పైలట్ కావాలనే నా నిర్ణయాన్ని బంధువులు, కుటుంబ స్నేహితులు వ్యతిరేకించేవారు. ఇది అమ్మాయిలకు తగిన వృత్తిగా అనుకునేవారు కాదు.
సవాల్‌గా తీసుకున్నాను..
ఇంగ్లీష్ రాయడం, చదవడం వచ్చు. కానీ, ఇంగ్లీషులో మాట్లాడటం అనేది సమస్యగా ఉండేది. దీంతో ట్రైనింగ్ కాలేజీలో చేరిన మొదటి రోజు నుంచీ తోటి వారి హేళనకు గురయ్యాను. ఒక చిన్న పట్టణం నుండి వెళ్లడం, ఇంగ్లీషులో పట్టులేకపోవడంతో మొదటి రోజు నుండి సవాళ్లు ఎదురయ్యాయి. చాలాసార్లు మా సీనియర్లు క్లాస్ బయటకు పిలిచి ర్యాగ్ చేసేవారు. ఈ సమస్యను అధిగమించాలంటే ముందు నా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనుకున్నాను. అందుకు సెలవుల్లో నాకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ఆంగ్లంలో మాట్లాడటానికి మంచి పట్టు సాధించాను. ట్రైనింగ్ పూర్తయ్యే సమయానికి స్కాలర్‌షిప్ కూడా వచ్చింది.
సాధించినప్పుడే మన శక్తి బయటకు తెలుస్తుంది
ప్రపంచంలోనే బి777 మహిళా కమాండర్లలో అతి పిన్న వయస్కురాలిగా పేరు తెచ్చుకున్నందుకు గర్వంగా ఉంది. నడిచొచ్చిన దారిని చూసుకుంటే అన్నింటిని ఎలా అధిగమించాను అనే ఆశ్చర్యం కలుగుతుంది. నిజానికి ఎవరి ప్రయాణమూ అంత సాఫీగా సాగదు. ఎత్తుపల్లాలు ఉండనే ఉంటాయి. ఆ కష్టాలను దాటుకొని వచ్చినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. మనలోని ఆత్మ విశ్వాసం బయటకు కనిపిస్తుంది. కలలు సామాజిక అంచనాలకు, ఆర్థిక పరిమితులకు పరిమితం కాదని ఆ శక్తి గుర్తు చేస్తుంది. ఒక చిన్న పట్టణం నుండి ఏవియేషన్ కమాండింగ్ ఎత్తుల వరకు ఎదగడంలో నా బలహీనతలపై చాలా పోరాటం చేశాను’’ అని వివరిస్తుంది కెప్టెన్ అనీ దివ్య.
Comments
Please login to add a commentAdd a comment