'వారిలో ఓ మహిళా ఉగ్రవాది కూడా'
దీనానగర్: పంజాబ్ లో దీనానగర్ పోలీస్ స్టేషన్ పై దాడికి తెగబడ్డ ఉగ్రవాదుల బృందంలో ఓ మహిళా సభ్యురాలు కూడా ఉన్నట్లు తెలిసింది. ముష్కరుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ మొదట ఈ విషయాన్నితెలపగా.. భద్రతా దళాలు కూడా దీనిని ధ్రువీకరిస్తున్నాయి. ఆర్మీ దుస్తులు ధరించిన నలుగురు సాయుధులు గురుదాస్ పూర్ జిల్లా దీనానగర్ పోలీస్ స్టేషన్ పై కాల్పులు జరిపి పక్కనే ఓ భవనంలో దాక్కుని కాల్పులు జరుపుతున్నారు. ఉదయం నుంచి కొనసాగుతున్న కాల్పుల్లో ఇప్పటివరకూ 13 మంది మరణించారు.
గాయపడ్డ కానిస్టేబుల్ ఘటన జరిగిన తీరును వివరిస్తూ.. ' సోమవారం ఉదయం 5:45 గంటల సమయంలో సైనిక దుస్తులు ధరించిన పది మంది.. స్టేషన్లోకి రావడం గమనించాం, మా స్టేషన్ కు సమీపంలో ఇండియన్ ఆర్మీ క్యాంపులు ఉండటంతో వచ్చినవారు ముష్కరులేనని గుర్తించలేకపోయాం. అయితే ఒక్కసారిగా విచక్షణా రహితంగా కాల్పులు జరపడం చూశాకగానీ అర్థంకాలేదు.. వాళ్లు ఉగ్రవాదులని. వాళ్లలో ఓ మహిళా ఉంది. మేం ఫైరింగ్ ఓపెన్ చేసేలోపే మా వాళ్లలో చాలా మందికి గాయాలయ్యాయి. ఓ బుల్లెట్ నా భుజంలోకి దూసుకెళ్లింది. ఇద్దరు గార్డులు కుప్పకూలిపోయారు. స్టేషన్ లోకి చొరబడ్డ ఉగ్రవాదులు ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఫైరింగ్ జరుపుతున్నారు' అని చెప్పారు.
పంజాబ్లో ఉగ్రవాదుల దాడి ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టేందుకు బీఎస్ ఎఫ్ బలగాలను రంగంలోకి దింపింది. ఢిల్లీ సహా మెట్రో నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీచేసింది. దీనానగర్ పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదుల దాడి, అనంతర పరిణామాలపై కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్.. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.