కొనసాగుతున్న గాలింపు చర్యలు
ఉగ్రవాద దాడిని సమర్థంగా ఎదుర్కొన్న భద్రతా దళాలు.. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. అయితే, ఇంకా ఎక్కడైనా ఉగ్రవాదులు నక్కి ఉన్నారేమోనన్న అనుమానంతో దీనానగర్, చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. గురుదాస్పూర్ జిల్లా మొత్తం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం పది గంటల పాటు కొనసాగిన ఎదురు కాల్పుల్లో మొత్తం 9 మంది మరణించారు. మృతుల్లో పంజాబ్ డిటెక్టివ్ విభాగం ఎస్పీ బల్జీత్ సింగ్ కూడా ఉన్న విషయం తెలిసిందే.
కాగా, గురుదాస్పూర్ ఎదురుకాల్పుల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం సాయంత్రం జాతీయ భద్రతా సలహాదారుతోను, కేంద్ర హోం శాఖ కార్యదర్శితోను సమావేశం కానున్నారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు. ఇక ఈ అంశంపై పార్లమెంటులో మంగళవారం నాడు రాజ్నాథ్ సింగ్ ఓ ప్రకటన చేయనున్నారు.