dinanagar police station
-
వెల్లువెత్తుతున్న సందర్శకులు
ఉగ్రవాదులు దాడిచేసిన దీనానగర్ పోలీసు స్టేషన్ ఎలా ఉందో చూసేందుకు సందర్శకులు వెల్లువెత్తుతున్నారు. వివిధ ప్రభుత్వ సంస్థలతోపాటు రాజకీయ నాయకులు కూడా ఈ స్టేషన్‌కు వస్తున్నారు. ఇక సామాన్య ప్రజల విషయం చెప్పనే అక్కర్లేదు. గురుదాస్‌పూర్ జిల్లా కేంద్రానికి 16 కిలోమీటర్లు, పఠాన్‌కోట్‌కు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో ప్రజలు మాత్రం తమ సాధారణ జీవనాన్ని పునరుద్ధరించుకున్నారు. అయితే.. అటువైపు వెళ్లేవాళ్లు మాత్రం ఒక్కసారి అక్కడ ఆగి, పోలీసు స్టేషన్‌ను చూసి వెళ్లిపోతున్నారు. భారీగా ఆయుధాలతో వచ్చిన ముగ్గురు ఉగ్రవాదులు భద్రతాదళాలతో దాదాపు 11 గంటల పాటు తలపడిన ప్రదేశం ఇదేనా అన్నట్లు చూస్తున్నారు. తమ గ్రామంలో ఇలాంటి ఘోరం జరుగుతుందని ఎప్పుడూ కలలో కూడా అనుకోలేదని కమల్ అనే స్థానికుడు చెప్పారు. ఆయన ఈ ఘోరానికి ప్రత్యక్ష సాక్షి. అసలు తమ గ్రామాన్నే ఉగ్రవాదులు ఎందుకు ఎంచుకున్నారో తెలియడం లేదని, ఈ ఘటనలో గాయపడినవాళ్లు, మరణించిన వాళ్లు కూడా సామాన్యులు, నిరుపేదలేనని ఆయన అన్నారు. మరోసారి ఇలాంటివి జరగకూడదని ప్రార్థిస్తున్నామన్నారు. బుధవారం ఉదయం కొందరు సీనియర్ పోలీసు అధికారులతో కలిసి పంజాబ్ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కూడా ఈ స్టేషన్‌ను సందర్శించారు. -
పంజాబ్‌లో ‘ఉగ్ర’ బీభత్సం
ఉగ్ర దాడిలో ఎస్పీ, ముగ్గురు పౌరులు సహా ఏడుగురు మృతి * పోలీస్ స్టేషన్‌పై దాడి; సిబ్బందిపై తూటాల వర్షం * అంతకుముందు ఒక ఆర్టీసీ బస్సుపై, ఆరోగ్య కేంద్రంపై కాల్పులు * 15 మందికి తీవ్రగాయాలు * పంజాబ్ స్వాట్ దళాలు, ఆర్మీ ఎదురుదాడి; దాదాపు 12 గంటల పాటు ఎన్కౌంటర్ * మొత్తం ముగ్గురు ఉగ్రవాదుల హతం గురుదాస్‌పూర్(పంజాబ్): పంజాబ్‌లో సోమవారం ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. గురుదాస్‌పూర్ జిల్లా దీనానగర్‌లో తెల్లవారుజామున ప్రారంభించిన విధ్వంసాన్ని 12 గంటల పాటు కొనసాగించి ఒక ఎస్పీ సహా ఏడుగురిని బలి తీసుకున్నారు. వారిలో ముగ్గురు పౌరులున్నారు. మరో 15 మందిని తీవ్రంగా గాయపర్చారు. దీనానగర్ పోలీస్‌స్టేషన్‌లోకి దూసుకెళ్లి సిబ్బందిపై అత్యాధునిక ఆయుధాలతో విచ్చలవిడిగా తూటాలవర్షం కురిపించారు. పంజాబ్ పోలీస్, ఆర్మీ సమన్వయంతో ఎదురుదాడి చేసి చిట్టచివరకు సోమవారం సాయంత్రానికి మొత్తం ముగ్గురు టైస్టులనూ హతమార్చారు. ఈ దాడి వెనుక ఎవరున్నారనే విషయంపై స్పష్టత లేదు. కానీ పక్కనే ఉన్న పాక్ సరిహద్దును దాటి వచ్చిన లష్కరే తోయిబా, లేదా జైషే మొహమ్మద్ ముష్కరుల ఘాతుకమే ఇదని భావిస్తున్నారు. ఈ అనూహ్య ఉగ్ర దాడితో.. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. దాడిని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయొద్దని ఈ సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ వార్తాచానెళ్లకు ఆదేశాలు జారీ చేసింది. ఎలా మొదలైంది!?.. సోమవారం వేకువజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఆత్మాహుతి దళం తమ ఆపరేషన్‌ను ప్రారంభించింది. మొదట, సైనిక దుస్తుల్లో గురుదాస్‌పూర్- పఠాన్ కోట్ రోడ్డుపై ఒక టెంపోను హైజాక్ చేసేందుకు ఆ టైస్టులు విఫలయత్నం చేశారు. తర్వాత దగ్గర్లో ఉన్న ఒక చిన్న హోటల్లోకి వెళ్లి, ఆ హోటల్ యజమాని కమల్జిత్ సింగ్ మాథుర్‌పై కాల్పులు జరిపి, ఆయన మారుతి 800 కారును అపహరించారు. అక్కడ్నుంచి వెళ్తూ దీనానగర్ బైపాస్ వద్ద ఒక చిరువ్యాపారిని కాల్చిచంపారు. తర్వాత అదే రహదారిపై వెళ్తున్న పంజాబ్ ఆర్టీసీ బస్సుపై గుళ్లవర్షం కురిపించి, పలువురు ప్రయాణికులను తీవ్రంగా గాయపర్చారు. అక్కడ్నుంచి అదే కారులో దీనానగర్ పోలీస్‌స్టేషన్‌లోకి దూసుకెళ్లారు. అంతకుముందు పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ఆరోగ్య కేంద్రంపై కాల్పులు జరిపారు. ఏకే 47 తదితర ఆధునిక ఆయుధాలు, భారీ మందుగుండుతో పోలీస్‌స్టేషన్‌లోకి దూసుకెళ్లి మొదట అక్కడి సెంట్రీపై కాల్పులు జరిపారు. అక్కడి పోలీసులు తేరుకుని, తమ ఎస్ఎల్ఆర్ తుపాకులకు పనిచెప్పేలోగా వారిపైనా విచక్షణారహితంగా గుళ్లవర్షం కురిపించారు. ఆ పక్కనే ఉన్న సిబ్బంది ఇళ్లను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. గ్రెనేడ్లతో దాడులకు తెగబడ్డారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు మరిన్ని బలగాలను, పంజాబ్ స్వాట్(స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ టీమ్) దళాలను ఘటనాస్థలికి పంపించారు. ఆర్మీ కూడా అక్కడికి చేరుకుంది. ఈ దళాలు టైస్టులపై ఎదురుదాడి ప్రారంభించాయి. ఈ లోగా స్టేషన్ పక్కనే ఖాళీగా ఉన్న భవనంలోకి వెళ్లిన ఉగ్రవాదులు.. అక్కడి నుంచి పోలీసులు, భద్రతా బలగాలపై కాల్పులు ప్రారంభించారు. ఆత్యాధునిక గ్రెనేడ్లతో దాడి చేశారు. దాదాపు 12 గంటల ఎన్కౌంటర్ తర్వాత ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. పాక్ సరిహద్దుకు అత్యంత దగ్గర్లోని దీనానగర్ పోలీసుల వద్ద ఆధునిక ఆయుధాలు లేకపోవడం, కాలం చెల్లిన ఎస్ఎల్ఆర్లతో వారు టైస్టులను ఎదుర్కోవాల్సి రావడం విమర్శలకు తావిస్తోంది. ఆ పోలీసుల వద్ద కనీసం బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్ల వంటి అవసరమైన రక్షణ పరికరాలు కానీ లేవని తెలుస్తోంది. మరోవైపు, పఠాన్‌కోట్- అమృతసర్ రైల్వే లైన్‌పై భద్రతాబలగాలు ఐదు బాంబులను గుర్తించి నిర్వీర్యం చేశారు. ఆ మార్గంలో రైళ్లను రద్దు చేశారు. ఎస్పీ సహా ఏడుగురు.. ఉగ్రవాదుల దాడిలో గురుదాస్‌పూర్ డిటెక్టివ్ ఎస్పీ బల్జీత్ సింగ్‌తో పాటు ముగ్గురు పౌరులు, ముగ్గురు హోంగార్డులు ప్రాణాలు కోల్పోయారు. దాడిలో గాయపడిన మరో 15 మంది గురుదాస్‌పూర్, అమృతసర్ల్లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ముగ్గురిని గులాం రసూల్, ఆశారాణి, అమర్జీత్గా గుర్తించారు. బల్జీత్ సింగ్ తండ్రి పోలీస్ ఇన్స్పెక్టర్ ఆచార్ కూడా 1984లో మిలిటెంట్ల దాడిలోనే చనిపోయారు. పంజాబ్ ఉగ్రదాడి నేపథ్యంలో పంజాబ్, కశ్మీర్‌లలోని అంతర్జాతీయ సరిహద్దు వెంట హైఅలర్ట్ ప్రకటించా రు. 2007లో లూథియానాలోని ఓ సినిమా హాళ్లో ఏడుగురు చనిపోయిన బాంబు పేలుడు తర్వాత పంజాబ్‌లో ఇదే తొలి ఉగ్రదాడి. చైనా మేడ్ గ్రెనేడ్లు ఉగ్రవాదులు ఆదివారం అర్ధరాత్రి దాటాక పాక్ నుంచి జమ్మూ, పఠాన్‌కోట్‌ల మధ్య ఉన్న కంచెలేని సరిహద్దు ద్వారా కానీ, జమ్మూలోని చాక్హీరా వద్దనున్న సరిహద్దు గుండా కానీ భారత్‌లోకి వచ్చి ఉండొచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అక్కడి నుంచి 15 కి.మీ. ప్రయాణించి హైవేకి చేరుకుని ఉండొచ్చని అంచనా. ఆపరేషన్ తర్వాత ఉగ్రవాదులు దాక్కున్న భవనంలో జీపీఎస్ పరికరాలను, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. టైస్టులు ఆధునిక ఆయుధాలతో వచ్చారని, వారి వద్ద చైనా తయారీ గ్రెనేడ్లున్నాయని డీజీపీ సుమేధ్ సింగ్ సైనీ చెప్పారు. మార్చిలో కశ్మీర్‌లోని కథువాలో పోలీస్ స్టేషన్‌పై జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు ఇలాగే దాడి చేశారు. పంద్రాగస్టు నేపథ్యంలో ఉగ్రదాడులు జరగొచ్చని నిఘావర్గాలు ఇదివరకే చెప్పాయి. దీనానగర్ పోలీస్‌స్టేషన్‌పై ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు ఉగ్రవాది మృతదేహాన్ని తరలిస్తున్న పోలీసులు ఘటనాస్థలిలో కారుపై బుల్లెట్ గుర్తులు ఎన్కౌంటర్లో రక్తమోడుతున్న పోలీసులు -
లాంగ్ లివ్ డెమోక్రసీ
(సాక్షి వెబ్ ప్రత్యేకం) పాకిస్థాన్ సరిహద్దుకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలో దీనానగర్.. ఉదయాన్నే తుపాకీ కాల్పులతో ఉలిక్కిపడింది. సాయంత్రానికి తుపాకీ కాల్పుల శబ్దాలు ఆగిపోయాయి. ముగ్గురు తీవ్రవాదులు చనిపోయారు. ముగ్గురు అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఒక ఎస్పీ సహా నలుగురు పోలీసులు అమరులయ్యారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత పంజాబ్ మరోసారి ఉగ్రవాదం దెబ్బకి విలవిల్లాడింది. 11 గంటల పాటు సాగిన 'ఎన్కౌంటర్' ఎన్నో ప్రశ్నలని మరోసారి తెరపైకి తెచ్చింది. అమర్నాథ్ యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో జమ్మూ - కశ్మీర్ సరిహద్దు పొడవునా భారత సైన్యం అప్రమత్తంగా ఉంది. చొరబాటు దాదాపు అసాధ్యమైంది. అందుకే ఉగ్రవాదులు తమ దృష్టిని పంజాబ్ సరిహద్దు వైపు మళ్లించి.. తమ ఉనికిని మళ్లీ చాటుకున్నారు. లష్కర్ ఏ తాయిబా, జైష్ ఏ మహ్మద్ సంస్థల హస్తం ఉందని నిఘావర్గాల నమ్మకం. దాడికి పాకిస్థాన్ మద్దతు ఉందని, ఆయుధాలు, గ్రనేడ్లు అందుకు సాక్ష్యాలని ప్రభుత్వం విశ్వసిస్తోంది. మళ్లీ పడగ విప్పడానికి ప్రయత్నిస్తున్న ఖలిస్థాన్ వేర్పాటువాదులకి ఈ సంఘటనకు సంబంధం లేదనేది ప్రాథమిక సమాచారం. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో భారతదేశం ఎలాంటి సంబంధాన్ని కోరుకుంటుంది? ఇలాంటి సంఘటనలు జమ్ము - కశ్మీర్లో సర్వసాధారణం. కానీ గతంలో ఇంతకన్నా పెద్ద సంఘటనలు జరిగాయి. సాక్షాత్తు భారతదేశ పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏం చేయగలిగాం? ముంబై వీధుల్లో పేలుళ్ల తర్వాత ఏం చేయగలిగాం? దావూద్ ఇబ్రహీంను వెనక్కి తీసుకొచ్చేందుకు దౌత్యపరంగా ఏమైనా చేయగలిగామా? పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడటం మానడం మినహా. కార్గిల్‌లో చొరబాట్లు గుర్తించేందుకే ఎంతో సమయం తీసుకున్నాం. అందుకు భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాం. కాకతాళీయంగా నిన్నటి రోజునే (ఆదివారం) కార్గిల్ విజయ్ దివస్ జరుపుకున్నాం. నేడు (సోమవారం) ఉదయాన్నే ఈ సంఘటన. పెషావర్‌లో స్కూల్ పిల్లల ఊచకోతను ప్రపంచం దిగ్భ్రాంతితో చూసినప్పుడు ఉగ్రవాదాన్ని అణచివేస్తామని పాక్ పాలకులు ఎప్పటి లాగానే బీరాలు పోయారు. ఎంతవరకు అణచగలిగారో ప్రపంచానికి తెలుసు. పాములకు పాలు పోయడమే తెలుసు. ఆ పాములను పక్కన ఉన్న పుట్టల్లోకి ఉసిగొల్పి అవి కాటేస్తుంటే చూడటమే తెలుసు. ఇపుడు కూడా అదే జరుగుతుంది. ఆధారాలు కావాలంటారు. చూపిస్తే ఇవి సరిపోవు. మరికొన్ని ఆధారాలు కావాలంటారు. దౌత్యవేత్తల మాటల గారడిలో అమాయకుల ప్రాణాలకు ఏ మాత్రం విలువ ఉంటుందో తెలిసిందే. చాయ్ పే చర్చ, నావ్ పే చర్చ.. అవసరమైతే ఇంకో చర్చ.. కొనసాగుతూనే ఉంటాయి. 'ఈ దుస్సాహసాన్ని సహించేది లేదు. గట్టిగా బుద్ధి చెబుతాం' లాంటి ప్రకటనలు వినపడుతూనే ఉంటాయి. ఒకవైపు పోలీసులు తీవ్రవాదులతో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతుంటే నేడు అదే సమయంలో చట్టసభల్లో సభ్యులు క్రమశిక్షణతో మెలగాలనే అంశంపై రాద్ధాంతం. రోజంతా అదే రభస. మీరు ఉన్నపుడు దాడులు జరగలేదా? అంటే మీరున్నపుడూ.. అంటూ మరో ఎదురుదాడి. తుపాకుల మోత కూడా ఈ మాటల దాడుల ముందు చిన్నబోయింది. ఇది శాంతి భద్రతల సమస్యా? లేక దౌత్యపరమైన సమస్యా? దేశ అస్తిత్వాన్ని సవాలు చేసే పెనుముప్పా? ఎదుర్కోవడం ఎలా? ఎంతకాలం ఈ దాగుడు మూతలు? ఒకసారి ఖలిస్థాన్.. ఇపుడు పాకిస్థాన్.. రేపు మరేదో సమస్య. జమ్మూ - కశ్మీర్ సమస్యకు పరిష్కారం ఉందా? అక్కడి యువత, ప్రజల కోరికలేమిటి? వారి అస్తిత్వానికి సంబంధించిన సమస్యలను పట్టించుకుంటున్నామా? రాజకీయ అవసరాల కోసం ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటూ వస్తున్నామా? సిరియా, ఇరాక్లను భయపెడుతూ ప్రపంచానికి సవాలు విసురుతున్న ఐఎస్ఐఎస్ జెండాలు జమ్మూ - కశ్మీర్ వీధుల్లో కాలనాగుల్లా భయపెడుతున్న రాబోయే పెనుముప్పును కావాలనే పట్టించుకోవడం మానేస్తున్నామా? ఈ వారాంతం వరకు పార్లమెంటులో వాదోపవాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు.. కాలం గడచిపోతుంది. ఇంకో రోజు.. ఇంకోచోట తుపాకులు గర్జిస్తాయి. గ్రనేడ్లు పేలుతాయి. అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మళ్లీ ఇదే సీన్ రిపీట్ అవుతుంది. ఈ క్రమంలో 'కొలేటరల్ డామేజ్' కింద అమాయకులు బలైపోతూనే ఉంటారు. అందుకే ..........లాంగ్ లివ్ డెమోక్రసీ -
ఉగ్రవాదుల వద్ద భారీగా ఆయుధాలు, జీపీఎస్ పరికరాలు
దీనానగర్ పోలీసు స్టేషన్ మీద దాడిచేసిన ఉగ్రవాదులు భారీ ఎత్తున ఆయుధాలతో పాటు జీపీఎస్ పరికరాలు కూడా తీసుకొచ్చారు. ఈ విషయాన్ని పంజాబ్ డీజీపీ సుమేధ్ సింగ్ సైని తెలిపారు. ఉగ్రవాదులను హతమార్చేందుకు వచ్చిన బృందాలకు ఆయన స్వయంగా నాయకత్వం వహించారు. మొత్తం ఎన్కౌంటర్ ముగిసిన తర్వాత.. సైని విలేకరులతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... ఉగ్రవాదులు పాకిస్థాన్‌లోని నరోవల్ ప్రాంతం నుంచి వచ్చారు సుమారు 11 గంటల పాటు మొత్తం ఆపరేషన్ జరిగింది ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో డిటెక్టివ్ ఎస్పీ బల్జీత్ సింగ్, ముగ్గురు హోంగార్డులు మరణించారు. ముగ్గురు సామాన్య పౌరులను ఉగ్రవాదులు చంపేశారు. దీనానగర్ పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ గాయపడ్డారు వాళ్ల వద్ద భారీ సంఖ్యలో ఫైర్ ఆర్మ్‌లు, గ్రెనేడ్లు ఉన్నాయి ఉగ్రవాదుల వద్ద జీపీఎస్ సిస్టంలు కూడా ఉన్నాయి ఈ దాడి వెనక లష్కరే తాయిబా ఉండొచ్చు ఇప్పటివరకు ఏ గ్రూపూ తాము దాడి చేసినట్లు చెప్పుకోలేదు ఈ మొత్తం విషయం మీద లోతుగా దర్యాప్తు చస్తాం -
పంజాబ్‌లో ముగిసిన ఎన్కౌంటర్
-
కొనసాగుతున్న గాలింపు చర్యలు
ఉగ్రవాద దాడిని సమర్థంగా ఎదుర్కొన్న భద్రతా దళాలు.. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. అయితే, ఇంకా ఎక్కడైనా ఉగ్రవాదులు నక్కి ఉన్నారేమోనన్న అనుమానంతో దీనానగర్, చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. గురుదాస్‌పూర్ జిల్లా మొత్తం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం పది గంటల పాటు కొనసాగిన ఎదురు కాల్పుల్లో మొత్తం 9 మంది మరణించారు. మృతుల్లో పంజాబ్ డిటెక్టివ్ విభాగం ఎస్పీ బల్జీత్ సింగ్ కూడా ఉన్న విషయం తెలిసిందే. కాగా, గురుదాస్‌పూర్ ఎదురుకాల్పుల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం సాయంత్రం జాతీయ భద్రతా సలహాదారుతోను, కేంద్ర హోం శాఖ కార్యదర్శితోను సమావేశం కానున్నారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు. ఇక ఈ అంశంపై పార్లమెంటులో మంగళవారం నాడు రాజ్‌నాథ్ సింగ్ ఓ ప్రకటన చేయనున్నారు. -
ముగిసిన ఎన్కౌంటర్: తీవ్రవాదుల హతం
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా దీనానగర్ ప్రాంతంలో తెల్లవారుజామున ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమైన ఎన్కౌంటర్ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ముగిసింది. దీనానగర్ పోలీసు స్టేషన్లోకి చొరబడి.. పోలీసులతో పాటు పలువురు సామాన్య పౌరులను కూడా కాల్చి చంపిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు ఎదురు కాల్పుల్లో హతమార్చాయి. దీంతో ఎన్కౌంటర్ ముగిసినట్లయింది. పంజాబ్ పోలీసు కమాండోలు, ఎన్ఎస్జీ బలగాలతో పాటు కేంద్రం పంపిన ప్రత్యేక బలగాలు ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నాయి. దాదాపు 11 గంటలకు పైగా సాగిన కాల్పులు ఉగ్రవాదుల దాడిలో ఎస్పీ బల్జీత్ సింగ్, ముగ్గురు హోం గార్డుల మృతి మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను కాల్చిచంపిన భద్రతా దళాలు తీవ్రవాదుల దాడిలో మరో ముగ్గురు పౌరుల మృతి తీవ్రవాదుల ఆపరేషన్‌లో ముమ్మరంగా పాల్గొన్న పంజాబ్ పోలీసు కమాండోలు దాడికి పాల్పడ్డవారు లష్కరే తాయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులని అనుమానం