పంజాబ్‌లో ‘ఉగ్ర’ బీభత్సం | High alert sounded across nation after Punjab terror attack | Sakshi
Sakshi News home page

పంజాబ్‌లో ‘ఉగ్ర’ బీభత్సం

Published Tue, Jul 28 2015 3:21 AM | Last Updated on Sat, Aug 11 2018 8:07 PM

పంజాబ్‌లో ‘ఉగ్ర’ బీభత్సం - Sakshi

పంజాబ్‌లో ‘ఉగ్ర’ బీభత్సం

ఉగ్ర దాడిలో ఎస్పీ, ముగ్గురు పౌరులు సహా ఏడుగురు మృతి
* పోలీస్ స్టేషన్‌పై దాడి; సిబ్బందిపై తూటాల వర్షం 
* అంతకుముందు ఒక ఆర్టీసీ బస్సుపై, ఆరోగ్య కేంద్రంపై కాల్పులు
* 15 మందికి తీవ్రగాయాలు
* పంజాబ్ స్వాట్ దళాలు, ఆర్మీ ఎదురుదాడి; దాదాపు 12 గంటల పాటు ఎన్‌కౌంటర్
* మొత్తం ముగ్గురు ఉగ్రవాదుల హతం  
గురుదాస్‌పూర్(పంజాబ్): పంజాబ్‌లో సోమవారం ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. గురుదాస్‌పూర్ జిల్లా దీనానగర్‌లో తెల్లవారుజామున ప్రారంభించిన విధ్వంసాన్ని  12 గంటల పాటు కొనసాగించి ఒక ఎస్పీ సహా ఏడుగురిని బలి తీసుకున్నారు.

వారిలో ముగ్గురు పౌరులున్నారు. మరో 15 మందిని తీవ్రంగా గాయపర్చారు. దీనానగర్ పోలీస్‌స్టేషన్‌లోకి దూసుకెళ్లి సిబ్బందిపై అత్యాధునిక ఆయుధాలతో విచ్చలవిడిగా తూటాలవర్షం కురిపించారు. పంజాబ్ పోలీస్, ఆర్మీ సమన్వయంతో ఎదురుదాడి చేసి చిట్టచివరకు సోమవారం సాయంత్రానికి మొత్తం ముగ్గురు టైస్టులనూ హతమార్చారు. ఈ దాడి వెనుక ఎవరున్నారనే విషయంపై స్పష్టత లేదు. కానీ పక్కనే ఉన్న పాక్ సరిహద్దును దాటి వచ్చిన లష్కరే తోయిబా, లేదా జైషే మొహమ్మద్ ముష్కరుల ఘాతుకమే ఇదని భావిస్తున్నారు.

ఈ అనూహ్య ఉగ్ర దాడితో.. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. దాడిని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయొద్దని ఈ సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ వార్తాచానెళ్లకు ఆదేశాలు జారీ చేసింది.
 
ఎలా మొదలైంది!?.. సోమవారం వేకువజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఆత్మాహుతి దళం తమ ఆపరేషన్‌ను ప్రారంభించింది. మొదట, సైనిక దుస్తుల్లో గురుదాస్‌పూర్- పఠాన్ కోట్ రోడ్డుపై ఒక టెంపోను హైజాక్ చేసేందుకు ఆ టైస్టులు విఫలయత్నం చేశారు. తర్వాత దగ్గర్లో ఉన్న ఒక చిన్న హోటల్‌లోకి వెళ్లి, ఆ హోటల్ యజమాని కమల్‌జిత్ సింగ్ మాథుర్‌పై కాల్పులు జరిపి, ఆయన మారుతి 800 కారును అపహరించారు. అక్కడ్నుంచి వెళ్తూ దీనానగర్ బైపాస్ వద్ద ఒక చిరువ్యాపారిని కాల్చిచంపారు.

తర్వాత అదే రహదారిపై వెళ్తున్న పంజాబ్ ఆర్టీసీ బస్సుపై గుళ్లవర్షం కురిపించి, పలువురు ప్రయాణికులను తీవ్రంగా గాయపర్చారు. అక్కడ్నుంచి అదే కారులో దీనానగర్ పోలీస్‌స్టేషన్‌లోకి దూసుకెళ్లారు. అంతకుముందు పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ఆరోగ్య కేంద్రంపై కాల్పులు జరిపారు. ఏకే 47 తదితర ఆధునిక ఆయుధాలు, భారీ మందుగుండుతో పోలీస్‌స్టేషన్లోకి దూసుకెళ్లి మొదట అక్కడి సెంట్రీపై కాల్పులు జరిపారు. అక్కడి పోలీసులు తేరుకుని, తమ ఎస్‌ఎల్‌ఆర్ తుపాకులకు పనిచెప్పేలోగా వారిపైనా విచక్షణారహితంగా గుళ్లవర్షం కురిపించారు. ఆ పక్కనే ఉన్న సిబ్బంది ఇళ్లను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు.

గ్రెనేడ్లతో దాడులకు తెగబడ్డారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు మరిన్ని బలగాలను, పంజాబ్ స్వాట్(స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ టీమ్) దళాలను ఘటనాస్థలికి పంపించారు. ఆర్మీ కూడా అక్కడికి చేరుకుంది. ఈ దళాలు టైస్టులపై ఎదురుదాడి ప్రారంభించాయి. ఈ లోగా స్టేషన్ పక్కనే ఖాళీగా ఉన్న భవనంలోకి వెళ్లిన ఉగ్రవాదులు.. అక్కడి నుంచి పోలీసులు, భద్రతా బలగాలపై కాల్పులు ప్రారంభించారు. ఆత్యాధునిక గ్రెనేడ్లతో దాడి  చేశారు. దాదాపు 12 గంటల ఎన్‌కౌంటర్ తర్వాత ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.

పాక్ సరిహద్దుకు అత్యంత దగ్గర్లోని దీనానగర్ పోలీసుల వద్ద ఆధునిక ఆయుధాలు లేకపోవడం, కాలం చెల్లిన ఎస్‌ఎల్‌ఆర్‌లతో వారు టైస్టులను ఎదుర్కోవాల్సి రావడం విమర్శలకు తావిస్తోంది. ఆ పోలీసుల వద్ద కనీసం బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు, హెల్మెట్ల వంటి అవసరమైన రక్షణ పరికరాలు కానీ లేవని తెలుస్తోంది. మరోవైపు, పఠాన్‌కోట్- అమృతసర్ రైల్వే లైన్‌పై భద్రతాబలగాలు ఐదు బాంబులను గుర్తించి నిర్వీర్యం చేశారు. ఆ మార్గంలో రైళ్లను రద్దు చేశారు.
 
ఎస్పీ సహా ఏడుగురు..
ఉగ్రవాదుల దాడిలో గురుదాస్‌పూర్ డిటెక్టివ్ ఎస్పీ బల్జీత్ సింగ్‌తో పాటు ముగ్గురు పౌరులు, ముగ్గురు హోంగార్డులు ప్రాణాలు కోల్పోయారు. దాడిలో  గాయపడిన మరో 15 మంది గురుదాస్‌పూర్, అమృతసర్‌ల్లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ముగ్గురిని గులాం రసూల్, ఆశారాణి, అమర్జీత్‌గా గుర్తించారు.

బల్జీత్ సింగ్ తండ్రి పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఆచార్ కూడా 1984లో మిలిటెంట్ల దాడిలోనే చనిపోయారు. పంజాబ్ ఉగ్రదాడి నేపథ్యంలో పంజాబ్, కశ్మీర్‌లలోని అంతర్జాతీయ సరిహద్దు వెంట హైఅలర్ట్ ప్రకటించా రు. 2007లో లూథియానాలోని ఓ సినిమా హాళ్లో ఏడుగురు చనిపోయిన బాంబు పేలుడు  తర్వాత పంజాబ్‌లో ఇదే తొలి ఉగ్రదాడి.
 
చైనా మేడ్ గ్రెనేడ్లు
ఉగ్రవాదులు ఆదివారం అర్ధరాత్రి దాటాక పాక్ నుంచి జమ్మూ, పఠాన్‌కోట్‌ల మధ్య ఉన్న కంచెలేని సరిహద్దు ద్వారా కానీ, జమ్మూలోని చాక్‌హీరా వద్దనున్న సరిహద్దు గుండా కానీ భారత్‌లోకి వచ్చి ఉండొచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అక్కడి నుంచి 15 కి.మీ. ప్రయాణించి హైవేకి చేరుకుని ఉండొచ్చని అంచనా. ఆపరేషన్ తర్వాత ఉగ్రవాదులు దాక్కున్న భవనంలో జీపీఎస్ పరికరాలను, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. టైస్టులు ఆధునిక ఆయుధాలతో వచ్చారని, వారి వద్ద చైనా తయారీ గ్రెనేడ్లున్నాయని డీజీపీ సుమేధ్ సింగ్ సైనీ చెప్పారు. మార్చిలో కశ్మీర్‌లోని కథువాలో పోలీస్ స్టేషన్‌పై జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు ఇలాగే దాడి చేశారు. పంద్రాగస్టు నేపథ్యంలో ఉగ్రదాడులు జరగొచ్చని నిఘావర్గాలు ఇదివరకే చెప్పాయి.

దీనానగర్ పోలీస్‌స్టేషన్‌పై ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు
ఉగ్రవాది మృతదేహాన్ని తరలిస్తున్న పోలీసులు
ఘటనాస్థలిలో కారుపై బుల్లెట్ గుర్తులు

ఎన్‌కౌంటర్‌లో రక్తమోడుతున్న పోలీసులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement