లాంగ్ లివ్ డెమోక్రసీ
(సాక్షి వెబ్ ప్రత్యేకం)
పాకిస్థాన్ సరిహద్దుకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలో దీనానగర్.. ఉదయాన్నే తుపాకీ కాల్పులతో ఉలిక్కిపడింది. సాయంత్రానికి తుపాకీ కాల్పుల శబ్దాలు ఆగిపోయాయి. ముగ్గురు తీవ్రవాదులు చనిపోయారు. ముగ్గురు అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఒక ఎస్పీ సహా నలుగురు పోలీసులు అమరులయ్యారు.
దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత పంజాబ్ మరోసారి ఉగ్రవాదం దెబ్బకి విలవిల్లాడింది. 11 గంటల పాటు సాగిన 'ఎన్కౌంటర్' ఎన్నో ప్రశ్నలని మరోసారి తెరపైకి తెచ్చింది. అమర్నాథ్ యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో జమ్మూ - కశ్మీర్ సరిహద్దు పొడవునా భారత సైన్యం అప్రమత్తంగా ఉంది. చొరబాటు దాదాపు అసాధ్యమైంది. అందుకే ఉగ్రవాదులు తమ దృష్టిని పంజాబ్ సరిహద్దు వైపు మళ్లించి.. తమ ఉనికిని మళ్లీ చాటుకున్నారు.
లష్కర్ ఏ తాయిబా, జైష్ ఏ మహ్మద్ సంస్థల హస్తం ఉందని నిఘావర్గాల నమ్మకం. దాడికి పాకిస్థాన్ మద్దతు ఉందని, ఆయుధాలు, గ్రనేడ్లు అందుకు సాక్ష్యాలని ప్రభుత్వం విశ్వసిస్తోంది. మళ్లీ పడగ విప్పడానికి ప్రయత్నిస్తున్న ఖలిస్థాన్ వేర్పాటువాదులకి ఈ సంఘటనకు సంబంధం లేదనేది ప్రాథమిక సమాచారం.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్తో భారతదేశం ఎలాంటి సంబంధాన్ని కోరుకుంటుంది? ఇలాంటి సంఘటనలు జమ్ము - కశ్మీర్లో సర్వసాధారణం. కానీ గతంలో ఇంతకన్నా పెద్ద సంఘటనలు జరిగాయి. సాక్షాత్తు భారతదేశ పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏం చేయగలిగాం? ముంబై వీధుల్లో పేలుళ్ల తర్వాత ఏం చేయగలిగాం? దావూద్ ఇబ్రహీంను వెనక్కి తీసుకొచ్చేందుకు దౌత్యపరంగా ఏమైనా చేయగలిగామా? పాకిస్థాన్లో క్రికెట్ ఆడటం మానడం మినహా. కార్గిల్లో చొరబాట్లు గుర్తించేందుకే ఎంతో సమయం తీసుకున్నాం. అందుకు భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాం.
కాకతాళీయంగా నిన్నటి రోజునే (ఆదివారం) కార్గిల్ విజయ్ దివస్ జరుపుకున్నాం. నేడు (సోమవారం) ఉదయాన్నే ఈ సంఘటన. పెషావర్లో స్కూల్ పిల్లల ఊచకోతను ప్రపంచం దిగ్భ్రాంతితో చూసినప్పుడు ఉగ్రవాదాన్ని అణచివేస్తామని పాక్ పాలకులు ఎప్పటి లాగానే బీరాలు పోయారు. ఎంతవరకు అణచగలిగారో ప్రపంచానికి తెలుసు. పాములకు పాలు పోయడమే తెలుసు. ఆ పాములను పక్కన ఉన్న పుట్టల్లోకి ఉసిగొల్పి అవి కాటేస్తుంటే చూడటమే తెలుసు.
ఇపుడు కూడా అదే జరుగుతుంది. ఆధారాలు కావాలంటారు. చూపిస్తే ఇవి సరిపోవు. మరికొన్ని ఆధారాలు కావాలంటారు. దౌత్యవేత్తల మాటల గారడిలో అమాయకుల ప్రాణాలకు ఏ మాత్రం విలువ ఉంటుందో తెలిసిందే. చాయ్ పే చర్చ, నావ్ పే చర్చ.. అవసరమైతే ఇంకో చర్చ.. కొనసాగుతూనే ఉంటాయి.
'ఈ దుస్సాహసాన్ని సహించేది లేదు. గట్టిగా బుద్ధి చెబుతాం' లాంటి ప్రకటనలు వినపడుతూనే ఉంటాయి. ఒకవైపు పోలీసులు తీవ్రవాదులతో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతుంటే నేడు అదే సమయంలో చట్టసభల్లో సభ్యులు క్రమశిక్షణతో మెలగాలనే అంశంపై రాద్ధాంతం. రోజంతా అదే రభస. మీరు ఉన్నపుడు దాడులు జరగలేదా? అంటే మీరున్నపుడూ.. అంటూ మరో ఎదురుదాడి. తుపాకుల మోత కూడా ఈ మాటల దాడుల ముందు చిన్నబోయింది.
ఇది శాంతి భద్రతల సమస్యా? లేక దౌత్యపరమైన సమస్యా? దేశ అస్తిత్వాన్ని సవాలు చేసే పెనుముప్పా? ఎదుర్కోవడం ఎలా? ఎంతకాలం ఈ దాగుడు మూతలు? ఒకసారి ఖలిస్థాన్.. ఇపుడు పాకిస్థాన్.. రేపు మరేదో సమస్య. జమ్మూ - కశ్మీర్ సమస్యకు పరిష్కారం ఉందా? అక్కడి యువత, ప్రజల కోరికలేమిటి? వారి అస్తిత్వానికి సంబంధించిన సమస్యలను పట్టించుకుంటున్నామా? రాజకీయ అవసరాల కోసం ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకుంటూ వస్తున్నామా?
సిరియా, ఇరాక్లను భయపెడుతూ ప్రపంచానికి సవాలు విసురుతున్న ఐఎస్ఐఎస్ జెండాలు జమ్మూ - కశ్మీర్ వీధుల్లో కాలనాగుల్లా భయపెడుతున్న రాబోయే పెనుముప్పును కావాలనే పట్టించుకోవడం మానేస్తున్నామా? ఈ వారాంతం వరకు పార్లమెంటులో వాదోపవాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు.. కాలం గడచిపోతుంది. ఇంకో రోజు.. ఇంకోచోట తుపాకులు గర్జిస్తాయి. గ్రనేడ్లు పేలుతాయి. అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మళ్లీ ఇదే సీన్ రిపీట్ అవుతుంది. ఈ క్రమంలో 'కొలేటరల్ డామేజ్' కింద అమాయకులు బలైపోతూనే ఉంటారు.
అందుకే ..........లాంగ్ లివ్ డెమోక్రసీ