వెల్లువెత్తుతున్న సందర్శకులు
ఉగ్రవాదులు దాడిచేసిన దీనానగర్ పోలీసు స్టేషన్ ఎలా ఉందో చూసేందుకు సందర్శకులు వెల్లువెత్తుతున్నారు. వివిధ ప్రభుత్వ సంస్థలతోపాటు రాజకీయ నాయకులు కూడా ఈ స్టేషన్కు వస్తున్నారు. ఇక సామాన్య ప్రజల విషయం చెప్పనే అక్కర్లేదు. గురుదాస్పూర్ జిల్లా కేంద్రానికి 16 కిలోమీటర్లు, పఠాన్కోట్కు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో ప్రజలు మాత్రం తమ సాధారణ జీవనాన్ని పునరుద్ధరించుకున్నారు. అయితే.. అటువైపు వెళ్లేవాళ్లు మాత్రం ఒక్కసారి అక్కడ ఆగి, పోలీసు స్టేషన్ను చూసి వెళ్లిపోతున్నారు.
భారీగా ఆయుధాలతో వచ్చిన ముగ్గురు ఉగ్రవాదులు భద్రతాదళాలతో దాదాపు 11 గంటల పాటు తలపడిన ప్రదేశం ఇదేనా అన్నట్లు చూస్తున్నారు. తమ గ్రామంలో ఇలాంటి ఘోరం జరుగుతుందని ఎప్పుడూ కలలో కూడా అనుకోలేదని కమల్ అనే స్థానికుడు చెప్పారు. ఆయన ఈ ఘోరానికి ప్రత్యక్ష సాక్షి. అసలు తమ గ్రామాన్నే ఉగ్రవాదులు ఎందుకు ఎంచుకున్నారో తెలియడం లేదని, ఈ ఘటనలో గాయపడినవాళ్లు, మరణించిన వాళ్లు కూడా సామాన్యులు, నిరుపేదలేనని ఆయన అన్నారు. మరోసారి ఇలాంటివి జరగకూడదని ప్రార్థిస్తున్నామన్నారు. బుధవారం ఉదయం కొందరు సీనియర్ పోలీసు అధికారులతో కలిసి పంజాబ్ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కూడా ఈ స్టేషన్ను సందర్శించారు.