సరిహద్దును ఎందుకు మూసేయలేదు?
గురుదాస్పూర్ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాల్పుల సమాచారం తెలిసిన వెంటనే తన సంగత్ దర్శన్ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. రాష్ట్ర డీజీపీ సుమేధి సింగ్ సహా, మిగిలిన ఉన్నతాధికారులు గురుదాస్పూర్ జిల్లాలోని దీనానగర్కు వెళ్లాలని ఆదేశించారు. తీవ్రంగా గాయపడి అమృతసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మరోవైపు ఈ ఘటనపై ఆయన కేంద్రంపై ఆరోపణలు గుప్పించారు. ఉగ్రవాదం ఒక రాష్ట్ర సమస్య కాదని, దాన్ని ఎదుర్కొనేందుకు జాతీయ విధానం కావాలంటూ పరోక్షంగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. అంతర్జాతీయ సరిహద్దులను ఎందుకు మూసేయలేదంటూ ప్రశ్నించారు.
మరోవైపుర దీనానగర్ ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య భీకరంగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సర్వేష్ కౌశల్, ఇతర ముఖ్య అధికారులతో సీఎం అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. పరిస్థితిని ఎప్పటికపుడు సమీక్షిస్తున్నారు. హోం మంత్రి రాజ్నాథ్ సింగ్కు పరిస్థితిని వివరిస్తున్నారు.
కాగా సోమవారం ఉదయం జరిగిన భారత్ పాక్ సరిహద్దులో ఉగ్రదాడితో దేశ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కేంద్ర హోంశాఖ అన్ని భద్రతా దళాలను అప్రమత్తం చేసింది. దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు.