గంటా రెండు గంటల్లో ఎన్కౌంటర్ ముగిసే అవకాశం
పంజాబ్ ఎన్కౌంటర్ గంటా రెండు గంటల్లో ముగిసే అవకాశం ఉందని కేంద్ర హోం మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు. గురుదాస్పూర్ జిల్లాలోని దీనానగర్ వద్ద పోలీసు కమాండోలకు, ఉగ్రవాదులకు మధ్య పోరాటం ఇంకా కొనసాగుతోందని ఆయన చెప్పారు. మొత్తం ఎన్కౌంటర్ ఒకటి రెండు గంటల్లో ముగియొచ్చన్నారు. ఇద్దరు పోలీసు అధికారులు, ఇద్దరు హోం గార్డులు, ముగ్గురు సామన్య పౌరులు కూడా మరణించిన వారిలో ఉన్నారు. ఉగ్రవాదుల్లో ఒకరిని దీనానగర్ పోలీసు స్టేషన్ ప్రాంగణంలోనే హతమార్చారు.
ఉగ్రవాదులు ఎవరనేది ఇంతవరకు స్పష్టంగా తెలియలేదని, తొలుత ఒక వ్యాన్ చేజిక్కించుకునేందుకు ప్రయత్నించి, తర్వాత ఒక చిన్న కారు లాక్కుని దాంట్లో పోలీసు స్టేషన్ వద్దకు సోమవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు ప్రవేశించారన్నారు. ఆ సమయానికి కేవలం ముగ్గురు నలుగురు పోలీసులే అక్కడ ఉన్నట్లు తెలిపారు. వాళ్లు ముందుగా స్టేషన్కు కాపలాగా ఉన్న పోలీసుపై కాల్పులు జరిపారని, కాల్పుల శబ్దం విన్న మరో పోలీసు లోపలినుంచి వచ్చి ఉగ్రవాదులపై కాల్పులు జరిపాడని చెప్పారు. మరణించినవారిలో డిటెక్టివ్ ఎస్పీ బల్జీత్ సింగ్ కూడా ఉన్నారు.