చండీగఢ్ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రత్యేక చొరవ వల్లే కర్తార్‌పూర్ కారిడార్ ఏర్పాటుకు మార్గం సుగమమైందని పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు వ్యాఖ్యానించారు. సిక్కుల ప్రార్థనలు ఫలించేలా చేసిన ఘనత కేవలం ఇమ్రాన్‌కే చెందుతుందని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్- పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని కర్తార్‌పూర్ సాహిబ్ వెళ్లే సిక్కు తీర్థ యాత్రికులకు సౌలభ్యంగా ఉండేందుకు గుర్‌దాస్‌పూర్ నుంచి ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సోమవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన సిద్ధు.. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. అయితే ఈ నిర్మాణం విషయంలో అసలైన ఘనత మాత్రం పాక్ ప్రధాని, తన స్నేహితుడు ఇమ్రాన్ ఖాన్‌కే దక్కుతుందని వ్యాఖ్యానించారు. 24 ఏళ్ల కఠోర శ్రమ అనంతరం ప్రధానిగా పగ్గాలు చేపట్టిన ఇమ్రాన్ సిక్కు ప్రజల ఆకాంక్షలు ఫలించేలా చేశారని ప్రశంసించారు. రాజకీయాలను, మతాన్ని వేర్వేరుగా చూసినపుడే అందరూ సంతోషంగా ఉంటారని ఈ కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు. (భారత్ ఇక ఆ విషయాన్ని మర్చిపోవాల్సిందే : పాక్)
కాగా వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలతో వార్తల్లో నిలవడం సిద్ధుకు కొత్తేం కాదు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లిన సమయంలో, ఆ దేశ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడం.. సౌత్ ఇండియా కంటే పాకిస్తానే బెటర్ అంటూ వ్యాఖ్యానించడం తదితర సమయాల్లో ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే లష్కరే ఉగ్రవాదులు ముంబైలో సృష్టించిన నరమేధానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆ ఘటనలో మరణించిన వారికి, అమరవీరులకు దేశమంతా నివాళి అర్పిస్తుంటే... అందుకు కారణమైన దాయాది దేశాన్ని ప్రశంసల్లో ముంచెత్తడం సిద్ధుకే చెల్లిందని ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. (26/11 పదేళ్ల ఉగ్ర జ్ఞాపకం)
Comments
Please login to add a commentAdd a comment