లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న యువరాజ్‌ సింగ్‌..? | Yuvraj Singh Likely To Contest On BJP Ticket From Gurdaspur Lok Sabha Constituency | Sakshi
Sakshi News home page

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న యువరాజ్‌ సింగ్‌..?

Published Thu, Feb 22 2024 4:15 PM | Last Updated on Thu, Feb 22 2024 4:40 PM

Yuvraj Singh Likely To Contest On BJP Ticket From Gurdaspur Lok Sabha Constituency - Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్‌, సిక్సర్ల వీరుడు యువరాజ్‌ సింగ్‌ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయనున్నాడని భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. యువీ పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్దిగా బరిలో నిలుస్తాడని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. 

తాజాగా యువీ.. తల్లి షబ్నమ్‌తో కలిసి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలవడంతో ఈ ప్రచారం నిజమేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై యువీ స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం గురుదాస్‌పూర్‌ ఎంపీగా సినీ నటుడు సన్నీ డియోల్‌ ఉన్నాడు.

ఇతను 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్దిగా భారీ మెజార్టీతో గెలుపొందాడు. ఈ నియోజకవర్గం నుంచి గతంలో మరో సినీ నటుడు కూడా ఎంపీగా గెలిచాడు. మునుపటి తరం బాలీవుడ్‌ నటుడు వినోద్‌ ఖన్నా ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్దిగా పలుమార్లు గెలిచాడు. 1998, 1999, 2004, 2014లో వినోద్‌ ఖన్నా గురుదాస్‌పూర్‌ ఎంపీగా గెలిచాడు. ఈ నియోజకవర్గం భారత్‌-పాకి​స్తాన్‌ బోర్డర్‌ను ఆనుకుని ఉంటుంది.

కాగా, భారత క్రికెటర్లు రాజకీయాల్లో రావడం కొత్తేమీ కాదు. గతంలో చాలామంది లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. కొందరు రాజ్యసభకు ఎన్నికయ్యారు. దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ గతంలో రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించగా.. ప్రస్తుతం టర్బనేటర్‌ హర్భజన్‌ సింగ్‌ రాజ్యసభ​ ఎంపీగా (ఆమ్‌ ఆద్మీ పార్టీ) కొనసాగుతున్నాడు.

లోక్‌సభ​ విషయానికొస్తే.. టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ ప్రస్తుతం న్యూఢిల్లీ నుంచి లోక్‌సభ​కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇతను 2019లో బీజేపీ అభ్యర్దిగా గెలుపొందాడు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్దిగా పోటీ చేస్తాడని ప్రచారం​ జరుగుతున్న యువరాజ్‌ సింగ్‌.. ప్రస్తుత ఎంపీలు గంభీర్‌, హర్బజన్‌ సింగ్ సమకాలీకులే కావడం విశేషం. 


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement