పేలుడు జరిగిన చోట కొనసాగుతున్న సహాయక చర్యలు
బటాలా: పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి బటాలా ప్రాంతంలో జనావాసాల మధ్య ఉన్న బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో ఫ్యాక్టరీ భవంతి పేకమేడలా కూలిపోవడంతో 23 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 27 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది భారీ సంఖ్యలో ప్రమాదస్థలికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ పేలుడు తీవ్రతకు బాణాసంచా ఫ్యాక్టరీ నేలమట్టం కాగా, పలువురు భవన శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్), రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్‌ఎఫ్), అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
భయానక అనుభవం..
బటాలా అగ్నిప్రమాదంపై తమ భయానక అనుభవాలను స్థానికులు మీడియాతో పంచుకున్నారు. ఈ విషయమై రాజ్‌పాల్ ఖక్కర్ అనే వ్యక్తి మాట్లాడుతూ..‘నేను సమీపంలోని గురుద్వారాకు వెళ్లి వస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దీంతో నేను నేలపై పడిపోయి స్పృహ కోల్పోయాను. కళ్లు తెరిచిచూసేసరికి ఆసుపత్రిలో ఉన్నాను’ అని తెలిపారు. సాహిబ్ సింగ్ అనే మరో వ్యక్తి స్పందిస్తూ..‘సెప్టెంబర్ 5న గురునానక్ దేవ్ 532వ వివాహ వార్షికోత్సవ వేడుకల నేపథ్యంలో బాణాసంచా కొనుగోలు చేసేందుకు వెళ్లాను. అంతలోనే భారీ తీవ్రతతో పేలుడు సంభవించింది. ఆ పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే నేను తిరిగి స్పృహలోకి రావడానికి చాలాసేపు పట్టింది’ అని వ్యాఖ్యానించారు.
మృతులకు 2 లక్షల పరిహారం
బటాలా దుర్ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. బటాలా అదనపు డిప్యూటీ కమిషనర్ ఈ విచారణ చేపడతారని వెల్లడించారు. అలాగే సహాయక చర్యలను పర్యవేక్షించాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రి రాజేందర్ సింగ్‌కు సూచించారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50,000, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.25 వేలు నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని గురుదాస్‌పూర్ జిల్లా అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు బటాలా సీనియర్ మెడికల్ ఆఫీసర్ సంజీవ్ భల్లా మాట్లాడుతూ.. క్షతగాత్రులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం సెలవుపై ఉన్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని వెనక్కు పిలిపించామని పేర్కొన్నారు.
రాష్ట్రపతి కోవింద్, రాహుల్ దిగ్భ్రాంతి
బటాలా అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశా>రు. ఈ ప్రమాదంలో 23 మంది చనిపోవడంపై రాహుల్ విచారం వ్యక్తంచేశారు. క్షతగాత్రులు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు బటాలా దుర్ఘటనపై గురుదాస్‌పూర్ ఎంపీ సన్నీడియోల్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
కాలువలోకి ఎగిరిపడ్డ కార్లు..
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు తీవ్రతకు సమీపంలోని రెండు భవనాలు కూలిపోయాయి. దగ్గర్లోని కార్లు, ఇతర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరికొన్ని వాహనాలు ఎగిరి సమీపంలోని కాలువలో పడిపోయాయి. పేలుడు ప్రకంపనలకు కిలోమీటర్ దూరంలోని భవనాల అద్దాలు పగిలిపోయాయి. చాలామంది క్షతగాత్రుల తల, కాళ్లకు గాయాలయ్యాయి
– విపుల్ ఉజ్వల్, గురుదాస్‌పూర్ డీసీపీ
పేలుడు ధాటికి ఛిద్రమైన మృతదేహాలను తీసుకెళ్తున్న పోలీసులు, స్థానికులు
Comments
Please login to add a commentAdd a comment