న్యూఢిల్లీ : పంజాబ్ ఎస్పీ సల్వీందర్ సింగ్ రెండోరోజు ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) ఎదుట హాజరయ్యారు. ఆయనకు ఇవాళ లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇందుకు కేంద్రం నుంచి కూడా అనుమతి లభించినట్లు సమాచారం. కాగా పఠాన్‌కోట్‌పై దాడికి ముందు ఉగ్రవాదులు తనను కిడ్నాప్ చేశారని పేర్కొన్న సల్వీందర్ సింగ్ కిడ్నాప్‌కు ముందు, తర్వాత జరిగిన సంఘటనలపై ఆయన చెప్తున్న కథనాల్లో పొంతన లేని అంశాలు ఉండటంతో లోతుగా ప్రశ్నించేందుకు తన ఎదుట హాజరు కావాల్సిందిగా ఎన్‌ఐఏ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం సల్వీందర్ సింగ్ పంజాబ్ సాయుధ పోలీసు 75వ బెటాలియన్‌కు అసిస్టెంట్ కమాండెంట్‌గా ఉన్నారు. నిన్న ఆయనను ఎన్ఐఏ బృందం సుమారు 8 గంటలపాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎన్ఐఏ మాత్రం సల్వీందర్కు క్లీన్ చిట్ ఇవ్వలేదు. దీంతో మరోసారి ఆయనను విచారణకు హాజరు కావాలని ఎన్ఐఏ ఆదేశించడంతో మరోసారి విచారణకు హాజరయ్యారు.