మసూద్ అజర్‌పై చార్జిషీట్
పఠాన్ కోట్ చార్జిషీట్‌లో జైషే చీఫ్ పేరు చేర్చిన ఎన్ఐఏ
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాద దాడి కేసుకు సంబంధించి సోమవారం ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్‌లో పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమూద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ పేరును చేర్చింది. పఠాన్‌కోట్ దాడికి మసూద్ అజర్ సూత్రధారి అని వెల్లడించింది. అజర్‌తో పాటు అతని సోదరుడు మరో ఇద్దరి పేర్లను సైతం చార్జిషీట్‌లో పేర్కొంది. పేలుడు పదార్థాలు, ఆయుధాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాల అభియోగాలు నమోదు చేసింది. ఈ మేరకు సోమవారం పంచకులలోని ఎన్ఐఏ కోర్టులో నలుగురిపై చార్జిషీట్ దాఖలు చేసింది. సాక్ష్యాధారాల సేకరణ, దర్యాప్తులో సహకరించిన.. జైల్లోని ఒక పాక్ ఉగ్రవాది, అమెరికా ఎఫ్‌బీఐ, న్యాయ శాఖ అధికారులు సహా ఆరుగురిని సాక్షులుగా పేర్కొంది.
ఈ ఏడాది జనవరి 2న పఠాన్ కోట్ ఎయిర్‌బేస్‌పై జరిగిన ఉగ్ర దాడిలో ఏడుగురు సైనికులు అమరులయ్యారు. మసూద్ సోదరుడు ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మరో ఇద్దరు షాహీద్ లతీఫ్, కషీఫ్ జాన్ దాడులకు సహకరించినట్టు ఎన్ఐఏ చార్జిషీట్‌లో పేర్కొంది. కాగా, మసూద్ అజర్‌పై చార్జిషీట్‌ను ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద వ్యతిరేక చట్టాల ప్రకారం అతనిపై ఆంక్షలు విధించేందుకు భారత్ ఉపయోగించే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు.