'ఆలస్యమైనా ఎందుకో ఆరోజు దర్గా తెరిపించారు'
న్యూఢిల్లీ: పఠాన్కోట్ వైమానిక స్థావరం పై దాడికి సంబంధించి విచారణ పలు అనుమానాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ దాడికి కొద్ది గంటలముందు కిడ్నాప్ కు గురైన గురుదాస్‌పూర్ ఎస్‌పీ సల్వీందర్‌సింగ్ ఇప్పటికే చెప్పిన కథనంలో పొంతన లేని అంశాలపై పలు ప్రశ్నలు తలెత్తుతుండగా ఈ ఘటన నేపథ్యంలో చెప్తున్న కొందరు ఇస్తున్న వివరణలు సల్వీందర్ సింగ్ ఏదైనా తప్పు చేశారా అనే అనుమానాలను పెంచుతున్నాయి. తాను పంజ్ పిర్ దర్గాకు తరుచుగా వెళ్లొస్తుంటానని, అలా వెళ్లొస్తున్న క్రమంలోనే తనను కిడ్నాప్ చేశారని చెప్పగా.. ఆ దర్గాను చూసుకునే సోమ్ అనే వ్యక్తి మాత్రం సల్వీందర్ సింగ్ ను తానెప్పుడు ఆ దర్గా వద్ద చూడలేదని అన్నారు.
అయితే, డిసెంబర్ 31, రాత్రి 8.30 గంటలకు సల్వీందర్ తనకు ఫోన్ చేశారని, దర్గాను తెరిచి ఉంచాలని కోరాడని, అయితే అప్పటికే సమయం ముగిసినందున అది సాధ్యం కాదని చెప్పగా, తాను ఒక అధికారిగా చెప్తున్నానని ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి దర్గాను తెరిచి ఉంచేలా చేశారని చెప్పాడు. అదే రోజు ఆయన స్నేహితుడు రాజేశ్ వర్మ కూడా రెండు సార్లు దర్గాకు వచ్చాడని తెలిపారు. అంతేకాకుండా ఆ ఆలయానికి అత్యంత సమీపంలో కొన్ని పాకిస్థాన్ కాలిబూట్ల గుర్తులు ఉన్నాయని, అది సరిహద్దుకు అతి సమీపంలో ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ ఇప్పటికే గుర్తించింది. ఈ అనుమానాలు మరింత బలపడితే ఎస్పీ సల్వీందర్ సింగ్ ను కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. చాలా లాజిక్స్ కూడా సల్వీందర్ సింగ్ పరోక్షంగా పాక్ ఉగ్రవాదులకు సహకరించారేమోనని అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.