జమ్ముకశ్మీర్‌లో ఇటీవలి కాలంతో తరచూ ఉగ్రవాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. భారత్- పాక్ సరిహద్దుల్లోనూ ఇలాంటి ఘటనలు కనిపిస్తున్నాయి. తాజాగా పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లా సరిహద్దు గ్రామాల్లో 48 గంటల్లో తొమ్మిది మంది అనుమానితులు కనిపించడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.
తొలుత బమియల్ నియోజకవర్గంలోని చోడియా గ్రామంలో ఒక మహిళ ముగ్గురు అనుమానితులను చూశారు. అదే గ్రామంలో ఇద్దరు అనుమానితులు కనిపించారు. ఇదేవిధంగా జమ్ము-కథువా సరిహద్దుకు ఆనుకుని ఉన్న చక్రాల్ గ్రామంలో ఇద్దరు యువకులు.. నలుగురు అనుమానితులను గమనించారు. దీంతో వీరు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు, బీఎస్‌ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. శాటిలైట్‌తోనూ, డ్రోన్‌ల ద్వారా కూడా ఆ ప్రాంతంలో అణువణువునా గాలిస్తున్నారు. భద్రతా సంస్థల అధికారులు ఆ ప్రాంతంలో క్యాంప్ నిర్వహిస్తున్నారు.
చక్రాల్ గ్రామానికి చెందిన రఘువీర్ సింగ్, రిషు కుమార్ అనే యువకులు తమకు నలుగురు అనుమానితులు కనిపించినట్లు పోలీసులకు తెలిపారు. వారంతా నల్లటి దుస్తులు ధరించి, ముఖాలకు మాస్క్‌లు పెట్టుకుని, చెరుకు తోటల్లో దాక్కున్నారని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు, ఆపరేషన్ గ్రూప్ కమాండో, బీఎస్‌ఎఫ్ సిబ్బంది సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఇది సాయంత్రం వరకు కొనసాగింది. అయితే నిందితుల జాడ ఇంకా లభించలేదు. మరోవైపు పంజాబ్ పోలీస్ బోర్డర్ రేంజ్ డీఐజీ తాజాగా ఆర్మీ అధికారులతో సమావేశమై పలు భద్రతా అంశాలపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment