ముష్కరులు హతం | Another two terrorists culling | Sakshi
Sakshi News home page

ముష్కరులు హతం

Published Tue, Jan 5 2016 1:36 AM | Last Updated on Sat, Aug 25 2018 5:33 PM

ముష్కరులు హతం - Sakshi

ముష్కరులు హతం

పఠాన్‌కోట్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదుల ఏరివేత
 
♦ ఆరుకు పెరిగిన ఉగ్రవాదుల సంఖ్య.. ఎయిర్‌బేస్‌లో కొనసాగుతున్న ఆపరేషన్
♦ వైమానిక స్థావరంలో అణువణువూ కూంబింగ్ చేస్తాం: భద్రతా బలగాలు
♦ వ్యూహాత్మక వైమానిక దళ ఆస్తులకు భారీ నష్టమేదీ జరగలేదని వెల్లడి
♦ పఠాన్‌కోట్‌పై దాడి మాదే: పాక్‌లోని యునెటైడ్ జిహాదీ కౌన్సిల్ ప్రకటన
♦ అది పాక్ ముష్కరుల నుంచి దృష్టి మళ్లించే ఎత్తుగడన్న రక్షణ నిపుణులు
♦ ప్రధాని అధ్యక్షతన జాతీయ భద్రతా మండలి భేటీ.. ఉగ్రదాడులపై చర్చ
 
 పఠాన్‌కోట్:
 పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై శనివారం తెల్లవారు జామున ఉగ్రవాదుల దాడితో మొదలైన సైనిక చర్య వరుసగా మూడో రోజు సోమవారమూ కొనసాగింది. ఎయిర్‌బేస్‌లో వైమానికదళ సిబ్బంది నివసించే రెండంతస్తుల భవనంలో ఉగ్రవాదులు దాక్కున్నారు. వారిని ఏరివేసేందుకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్, వైమానిక దళం, సైనిక విభాగాలకు చెందిన భద్రతా బలగాలు రాకెట్ లాంచర్ల వంటి భారీ ఆయుధ సంపత్తితో ఆపరేషన్‌ను తీవ్రం చేశాయి. ఆదివారం రాత్రి కూడా హెలికాప్టర్లతో గాలింపు, పహారా కొనసాగించిన భద్రతా దళాలు.. సోమవారం ప్రధాన యుద్ధ శక్తులన్నిటినీ ఈ ఆపరేషన్ కోసం మోహరించాయి.

పంజాబ్ పోలీసులు, నిఘా సంస్థలు కూడా కూడా సహకారమందించాయి. పొద్దున్నుంచీ సాయంత్రం దాక వరుస విరామాలతో పలుమార్లు కాల్పులు, పేలుళ్లు వినిపించాయి. ఉగ్రవాదులు దాక్కున్న భవనం భారీ పేలుడుతో దద్దరిల్లింది. రాత్రయ్యాక.. భవనంలో దాక్కున్న ఇద్దరు ఉగ్రవాదులూ హతమైనట్లు భధ్రతా దళాలు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించాయి. అయితే.. ఈ ఆపరేషన్‌లో హతమైన ఉగ్రవాదుల సంఖ్యపైనా, అమరులైన భద్రతా సిబ్బంది సంఖ్య పైనా తొలి రోజు శనివారం నుంచీ భిన్నమైన వార్తలు వెలువడుతున్నాయి. స్థావరంలోకి చొరబడ్డ ఉగ్రవాదులు ఎంతమంది అన్న సంఖ్యపై స్పష్టత లేనప్పటికీ.. మొత్తం ఆరుగురని ఆదివారం నాడు ఆపరేషన్ నిర్వహిస్తున్న అధికారులు పేర్కొన్నారు.

శనివారం నాడే నలుగురు ఉగ్రవాదులు హతమవగా.. సోమవారం రాత్రికి మరో ఇద్దరిని హతమార్చటంతో ఉగ్రవాదులను మొత్తంగా నిర్మూలించినట్లు పరిగణిస్తున్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం కానీ, ఆపరేషన్‌లో పాల్గొంటున్న అధికారులు కానీ.. ఎయిర్‌బేస్‌లో ఉగ్రవాదులెవరూ ప్రాణాలతో లేరని, ఆపరేషన్‌ముగిసిందని ప్రకటించటానికి సిద్ధంగా లేరు.

 భద్రమని తేల్చే వరకూ ఆపరేషన్... ‘‘కూంబింగ్, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.  స్థావరంలోని సిబ్బంది అందరినీ, ఆస్తులన్నిటినీ, నిర్మాణాలన్నిటినీ ప్రత్యక్షంగా క్షుణ్నంగా తనిఖీ పూర్తిచేసి ఎయిర్‌బేస్ భద్రంగా ఉందని నిర్ధారించుకునే వరకూ ఆపరేషన్ కొనసాగుతుంది’’ అని ఎన్‌ఎస్‌జీ ఐజీ మేజర్ జనరల్ దుషాంత్‌సింగ్ సోమవారం సాయంత్రం పఠాన్‌కోట్‌లో విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆయన అంతకుముందు కూడా ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ కమొడోర్ జె.ఎస్.దామూన్, బ్రిగేడియర్ అనుపీందర్‌సింగ్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు.

ఎయిర్‌బేస్‌లోని వ్యూహాత్మక వైమానిక దళ ఆస్తులకు భారీ నష్టమేదీ వాటిల్లలేదని చెప్పారు. ‘‘వైమానిక దళ స్థావరం చాలా విశాలమైన ప్రదేశం. వైమానిక దళానికి చెందిన వ్యూహాత్మక ఆస్తులు ఇందులో ఉన్నాయి. ఐఏఎఫ్ సిబ్బంది కుటుంబాలు, పాఠశాలలు కూడా ఇందులో ఉన్నాయి.. ఇదొక మినీ నగరం. వైమానిక దళానికి చెందిన వ్యూహాత్మక ఆస్తులను లక్ష్యంగా చేసుకోవటానికి ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో పూర్తిగా సిద్ధమై వచ్చారు’’ అని ఐఏఎఫ్ అధికారి వివరించారు.  

 ఈ ఉగ్రవాదులు సుశిక్షితులు.. భారీ ఆయుధాలు...
 పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడికి దిగిన ఉగ్రవాదులు సుశిక్షితులని.. వైమానిక స్థావరంలో ఉన్న మిగ్ 21 ఫైటర్ విమానాలు, ఎంఐ 25 యుద్ధ హెలికాప్టర్లను ధ్వంసం చేసే లక్ష్యంతో బలమైన ఆయుధ సంపత్తితో వచ్చారని.. అందుకే వారిని ఏరివేసే ఆపరేషన్ సుదీర్ఘంగా సాగుతోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 2008లో ముంబైలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులకన్నా కూడా ఈ ఉగ్రవాదులు మరింత సుశిక్షితులని చెప్పాయి. ఉగ్రవాదులు ఏకే47 రైఫిళ్లు, అండర్ బారెల్ గ్రెనేడ్ లాంచర్లు (యూబీజీఎల్), 52 ఎంఎం మోర్టార్లు, జీపీఎస్ వ్యవస్థలు వెంట తెచ్చుకుని దాడికి దిగారని తెలిపాయి. అలాగే.. మరణాలు సంభవించకుండా  జాగ్రత్తలు తీసుకోవాలనిప్రధాని మోదీ, రక్షణమంత్రి పారికర్‌లు ఇచ్చిన కచ్చితమైన సూచనలు కూడా ఆపరేషన్ మూడు రోజుల పాటు కొనసాగటానికి కారణమని వివరించాయి.

 ‘ఉగ్ర’ వేటపై ప్రధాని సమీక్ష...: పఠాన్‌కోట్, అఫ్గానిస్తాన్‌లలో ఉగ్రవాదుల దాడులు, వారిని నిలువరించేందుకు భద్రతా బలగాల ఆపరేషన్లపై ప్రధాని మోదీ సోమవారం జాతీయ భద్రతా మండలి భేటీ నిర్వహించి చర్చించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌గోవల్, విదేశాంగ కార్యదర్శి జైశంకర్‌లతో పాటు.. భద్రతపై కేబినెట్ కమిటీ సభ్యులైన రక్షణమంత్రి మనోహర్‌పారికర్, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. రెండు చోట్ల కొనసాగుతున్న ఆపరేషన్ల గురించి ఉన్నతాధికారులు మోదీకి వివరించారు.
 
 దాడి చేసింది మా వాళ్లే: యూజేసీ
 శ్రీనగర్: ‘పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది మా నేషనల్ హైవే స్క్వాడ్’ అని యూజేసీ అధికార ప్రతినిధిగా చెప్పుకుంటూ సయ్యద్ సదాకత్ హుస్సేన్ అనే వ్యక్తి కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో మీడియాకు ఈ-మెయిల్ పంపించారు. అయితే.. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల సంఖ్య వివరాలేవీ చెప్పలేదు. అయితే.. యూజీసీ పేరుతో వచ్చిన ఈ-మెయిల్ విశ్వసనీయతపై భారత భద్రతా  నిపుణులు సందేహం వ్యక్తంచేశారు. ఈ దాడి పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ పనేనని బలంగా భావిస్తున్నారు. ఉగ్రదాడి పాక్ నుంచి జరుగుతోందన్న అంశం నుంచి దృష్టి మరల్చే ఎత్తుగడలో భాగంగా యూజేసీ పేరును తెరపైకి తెచ్చారని అభిప్రాయపడుతున్నారు. ఉగ్రవాదులు పాక్ నుంచి వచ్చిన వారు కాదని.. కశ్మీర్‌కు చెందిన వారని చూపించే ప్రయత్నంలో భాగమని భావిస్తున్నారు.
 
 స్మగ్లర్ల అండతో చొరబాటు!
 పఠాన్‌కోట్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు.. డ్రగ్స్ స్మగ్లర్ల సాయంతో భారత్‌లో ప్రవేశించి ఉండొచ్చని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. ఉగ్రవాదులు వాడిన ఆయుధాలను వారు భారత్‌లోకి చొరబడకముందే పాక్ నుంచి దేశంలోకి తరలించి ఉండొచ్చని భావిస్తున్నారు. నకిలీ భారత కరెన్సీ, మాదకద్రవ్యాలు, ఆయుధాలను అక్రమ రవాణా చేసే వ్యవస్థీకృత ముఠాలు.. సరిహద్దుకు ఇరువైపులా ఉగ్రవాదులకు సాయపడి ఉండొచ్చని చెప్తున్నారు. ఆయుధాలను కూడా చాలా ముందుగానే డ్రగ్స్ స్మగ్లర్ల ద్వారా భారత్‌లోకి తరలించి.. ఒకచోట దాచివుంచితే ఉగ్రవాదులు సరిహద్దు దాటి వచ్చివాటిని తీసుకుని దాడికి దిగి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ స్మగ్లింగ్ ముఠాల్లో కొందరు భద్రతా సిబ్బంది పాత్రను కొట్టేయలేమని..నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
 
 పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడికి తెగబడిన ఉగ్రవాదుల్లో మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మూడో రోజైన సోమవారం హతమార్చాయి. దీంతో మొత్తం హతులైన ఉగ్రవాదుల సంఖ్య ఆరుకు పెరిగింది. అయితే.. ఎయిర్‌బేస్‌లో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. స్థావరాన్ని పూర్తిగా జల్లెడ పడుతూ ఎన్‌ఎస్‌జీ, సైన్యం, వైమానిక దళ బృందాలు ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. స్థావరం పూర్తిగా సురక్షితమని నిర్ధారించుకునే వరకూ ఆపరేషన్ కొనసాగుతుందని స్పష్టంచేశాయి. పఠాన్‌కోట్‌లో దాడి చేసింది తామేనని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న యునెటైడ్ జిహాదీ కౌన్సిల్ అనే పలు కశ్మీరీ ఉగ్రవాద సంస్థల కూటమి సోమవారం ప్రకటించింది.

ఒకవైపు పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదులతో భారత బలగాలు పోరాడుతుండగానే ఆదివారం రాత్రి అఫ్గానిస్తాన్‌లోని మజారే షరీఫ్‌లో భారత దౌత్యకార్యాలయంపైనా ఉగ్రవాదులు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఉగ్రవాదులను కార్యాలయం వెలుపలే నిలువరించిన భద్రతా బలగాలు.. ముగ్గురు ముష్కరులను హతమార్చాయి. మరో ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు సమీపంలోని ఒక భవనంలో దాక్కుని కాల్పులు జరుపుతుండటంతో వారిపై అఫ్గాన్ భద్రతా బలగాలు, కమాండోలు సైనిక చర్య చేపడుతున్నాయి. భారత దౌత్య కార్యాలయంలో సిబ్బంది అంతా క్షేమంగానే ఉన్నారు.

ఇటు పఠాన్‌కోట్.. అటు మజారే షరీఫ్‌లో భారత్ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన నేపథ్యంలో.. భారత్ - పాక్‌ల మధ్య జరగాల్సిన విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం తొలుత ఉన్నత స్థాయి సమావేశం, ఆ తర్వాత జాతీయ భద్రతా మండలి సమావేశం నిర్వహించి పఠాన్‌కోట్, మజారే షరీఫ్ దాడులు, సైనిక చర్యలు, ఇతర పరిణామాలపై చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement