సిబ్బంది క్వార్టర్స్‌లో నక్కిన ఉగ్రవాదులు
పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో సిబ్బంది క్వార్టర్స్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు దాగి ఉండొచ్చని, వాళ్లను అంతం చేసేందుకు ఆపరేషన్ కొనసాగుతోందని ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్ఎస్‌జీ దళాలకు చెందిన సీనియర్ అధికారులు తెలిపారు. ఎన్‌ఎస్‌జీకి చెందిన మేజర్ జనరల్ దుష్యంత్ సింగ్, మరో ఇద్దరు అధికారులు సోమవారం మధ్యాహ్నం ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. ఇప్పటికి నలుగురు ఉగ్రవాదులను హతమార్చామని, వాళ్లు భారీ ఆయుధ సంపత్తితో వచ్చారని చెప్పారు. ఇది చాలా పెద్ద ఎయిర్ బేస్ అని, దాదాపు ఓ నగరం అంత వైశాల్యం ఉంటుందని వివరించారు. ఇందులో వ్యూహాత్మక ఆయుధాలతో పాటు సిబ్బంది నివాసాలు, స్కూళ్లు కూడా ఉన్నాయని.. ఇక్కడి ఆస్తులకు గానీ, ఆయుధాలకు గానీ ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు.
ఆపరేషన్ చాలా మంచి సినర్జీతో సాగుతోందని, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఎన్ఎస్‌జీ, పంజాబ్ పోలీస్ కలిసి చేస్తున్నాయని చెప్పారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని.. అది పూర్తయితే గానీ వివరాలు ఏవీ చెప్పలేమని అన్నారు. ఇప్పటివరకు నలుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. జనవరి 1 నుంచి తాము అప్రమత్తంగా ఉన్నామని, నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో ఆర్మీ కూడా 8 దళాలను మోహరించిందని అన్నారు. గరుడ్ దళంతో తొలుత ఉగ్రవాదులు తలపడ్డారని, తర్వాత ఆర్మీ, గరుడ్, ఎన్‌ఎస్‌జీల సంయుక్త దాడుల వల్ల వాళ్లు కొంత ఏరియాకే పరిమితం అయ్యారని అన్నారు.
ఆదివారం రాత్రి కూడా శానిటైజేషన్ జరిగిందని, అయితే ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది నివాసం ఉండే రెండు అంతస్థుల భవనంలో దాక్కుని ఉగ్రవాదులు అక్కడి నుంచి కాల్పులు జరిపారని చెప్పారు. వాళ్లను అక్కడికే పరిమితం చేసి, క్వార్టర్లలో ఉండే సిబ్బంది కుటుంబాలను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు కమాండ్ ఆస్పత్రిలోను, పఠాన్ కోట్‌లోను మంచి వైద్యం అందిస్తున్నామన్నారు. ఎయిర్‌బేస్‌లో ఉన్న ఆస్తులను ధ్వంసం చేయాలనే కుట్రతో ఉగ్రవాదులు వచ్చారని, అయితే ఇప్పుడు మాత్రం ఆస్తులన్నీ సురక్షితంగానే ఉన్నాయని తాను హామీ ఇవ్వగలనని అన్నారు.